సాక్షి, అమరావతి: ‘ప్రస్తుతం విద్యుత్తును నిల్వచేయటం మీద దృష్టి సారించాం. ఈ రంగంలో పెట్టుబడులకు భారత్ ఉత్తమ దేశం..సురక్షితమని’ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం గురువారం కొలంబియా యూనివర్సిటీకి వెళ్లి ప్రసంగించారు. ప్రతి గ్రామాన్నీ రహదారులతో అనుసంధానిస్తున్నామని చెప్పారు. రానున్న రెండేళ్లల్లో అన్ని ప్రాంతాల్లో సింగిల్, డబుల్, నాలుగు, ఎనిమిది వరుసల రహదారుల నిర్మాణంలో లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుతో అమెరికాలో కూడా ఇవ్వనంత బ్యాండ్ విడ్త్ సమకూరుస్తున్నామన్నారు.
వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు టెలికమ్యూనికేషన్ సంస్కరణలు వేగవంతమయ్యాయని.. అందుకు తానే బాధ్యత తీసుకున్నానని సీఎం చెప్పారు. గతంలో పబ్లిక్ సెక్టారు సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, వీఎస్‌ఎన్‌ఎల్ ఆధిపత్యంలో ఉండేవని తెలిపారు. వీఎస్‌ఎన్‌ఎల్ ఇంటర్నేషనల్ కాల్స్‌కు, బీఎస్‌ఎన్‌ఎల్ లోకల్ కాల్స్‌పై ఆధిపత్యం వహించేవన్నారు. అప్పట్లో లైటెనింగ్ కాల్స్ ఉండేవని, వాటికి కూడా ఒకోసారి రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేదన్నారు. ఇవాళ మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తక్షణమే మాట్లాడుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో ఎవరూ కూడా ఫోన్ కాల్స్‌కు డబ్బు వసూలు చేయరని, డేటా ఇచ్చినందుకు రుసుం వసూలు చేస్తారని తెలిపారు.
వినియోగాన్ని అనుసరించి విద్యుత్తు చార్జీలు వసూలు చేస్తున్నట్లే తలసరి ఆదాయాన్ని బ్యాండ్ విడ్త్ తలసరి వినియోగం ఆధారంగా నిర్ణయించే రోజులు రానున్నాయన్నారు. సీఎం కోర్ డ్యాష్ బోర్డుతో ప్రపంచంలో ఎక్కడి నుంచైనా రియల్ టైమ్ డేటా చూడవచ్చునని తెలిపారు. రాష్ట్రంలో వీధిదీపాల నిర్వహణ కూడా రియల్ టైమ్ వ్యవస్థతో పనిచేయించే విధంగా తీర్చిదిద్దామని, బల్బు వెలిగిందా లేదా అనే అంశాన్ని సెన్సర్ ఆధారంగా గుర్తించవచ్చునన్నారు.
నాలుగేళ్ల కృషితో ఆంధ్రప్రదేశ్ రెండంకెల వృద్ధిరేటు సాధిస్తోందన్నారు. నాలుగేళ్లుగా భారత ప్రభుత్వం సగటున 7.3 % వృద్ధి రేటు సాధిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10.52%తో రెండంకెల వృద్ధిరేటు నమోదు చేసిందని వివరించారు. కార్యక్రమంలో జాన్ చాంబర్స్ స్వీయరచన ‘ద డాట్స్’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. స్టార్టప్స్ ప్రారంభించే వారికి ఈ రచన ఓ దిక్సూచిగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment