సాక్షి, టెక్కలి: రాజకీయాలకు కేంద్ర బిందువైన టెక్కలి నియోజకవర్గంలో ఈసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోరు ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు గెలుస్తారనేదానిపై వాడీవేడిగా చర్చ సాగుతోంది. 1952లో 61,196 మంది ఓటర్లతో ప్రారంభమైన నియోజకవర్గం ప్రస్థానం నేడు 2,22,222 మంది ఓటర్లకు చేరుకుంది. టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలతో ఉన్న టెక్కలి నియోజకవర్గంలో ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే ఆరంభమైంది.
టీడీపీ తరఫున మంత్రి హోదా అనుభవించిన కింజరాపు అచ్చెన్నాయుడు.. సామాన్య స్థాయి నుంచి ప్రజా పోరాటాలు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేరాడ తిలక్‌కు మధ్య ప్రధాన పోరు కొనసాగనుంది. కొండలాంటి అచ్చెన్నాయుడిని ఢీకొట్టడమే కాకుండా వైఎస్సార్ సీపీ విజయాన్ని అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇస్తామంటూ ఎమ్మెల్యే అభ్యర్థి తిలక్‌తో పాటు నాలుగు మండలాల నాయకులు అహర్నిశలు శ్రమిస్తూ అన్ని వర్గాల మన్ననలు పొందుతున్నారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే తమకు విజయాన్ని అందజేస్తుందనే ధీమాతో అచ్చెన్నాయుడు తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
మార్పు తప్పదా..!
టెక్కలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా, మంత్రి హోదాలో ఉన్న అచ్చెన్నాయుడు అండతో గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలు, టీడీపీ కార్యకర్తలు చేసిన ఆగడాలతో ప్రజలు విస్తుపోయారు. రేషన్ కార్డులు, పింఛన్లు, గృహ నిర్మాణ పథకాలు ఒకటేమిటి ప్రతి పథకంలో వివక్ష చూపడంతో, అర్హులకు పథకాలు అందని ద్రాక్షగా మారాయి. రేషన్ డీలర్లపై, చిన్న స్థాయి ఉద్యోగులపై వేధింపులు, బెదిరింపులతో అంతా విస్తుపోయారు. ఏదైనా పని కోసం మంత్రి వద్దకు వెళితే ఆయన అనుసరించిన వైఖరిపై నియోజకవర్గ ప్రజలతో పాటు ఆ పార్టీలో ఉన్న కొంత మంది కేడర్‌లో సైతం వ్యతిరేకత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుతున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీకు కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లో సీనియర్ నాయకులు సైతం వైఎస్సార్ సీపీలోకి చేరుతున్నారు. నియోజకవర్గంలో అభ్యర్థుల విజయాన్ని తేల్చి చెప్పే ప్రధానమైన నందిగాం, సంతబొమ్మాళి మండలాల్లో ఇప్పటికే టీడీపీకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.
అన్నదాతలకు వరం ఆఫ్‌షోర్
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా 2008లో నందిగాం మండలంలో ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అప్పటి టెక్కలి ఎమ్మెల్యే హనుమంతు అప్పయ్యదొర కృషి ఫలితంగా నిర్మాణం తలపెట్టిన ఆఫ్‌షోర్‌కు సుమారు రూ.127 కోట్లు కేటాయించారు. నందిగాం, టెక్కలి, పలాస, మెళియాపుట్టి తదితర మండలాల్లో సుమారు 24,600 ఎకరాలకు సాగునీటిని అందజేయడంతో పాటు పలాస మండలంలో 6 పంచాయతీల పరిధిలో 24 గ్రామాలకు తాగునీటిని అందజేయడానికి ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ప్రాజెక్టు మంజూరులో భాగంగా 2008 ఏప్రిల్‌లో డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా పలాస మండలం రేగులపాడు వద్ద భారీ స్థాయిలో శంకుస్థాపన చేశారు. పనులు ఊపందుకున్న సమయంలో వైఎస్సార్ మరణంతో ఆఫ్‌షోర్ నిర్మాణం నిలిచిపోయింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక టెక్కలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు పలుమార్లు ఆఫ్‌షోర్ పూర్తి చేస్తానని హామీ ఇచ్చి వైఫల్యం చెందారు.
ప్రజా పోరాటాలతో సానుకూలత
టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ కార్యకర్తలు చేసిన ఆగడాలకు ఎదురొడ్డి ప్రజా పోరాటాలు చేస్తున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేరాడ తిలక్‌కు ఈసారి అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీని పటిష్టం చేయడమే కాకుండా దిగువ స్థాయి కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇస్తూ నిత్యం ప్రజా పోరాటాలు చేస్తున్న తిలక్ అందరి మన్నలను పొందారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్రతో అన్ని వర్గాల ప్రజలు అభిమానులుగా మారారు. దీంతో ఈసారి టెక్కలి నియోజకవర్గంలో తిలక్‌కు అనుకూలంగా పవనాలు వీస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు.
అనుచిత వైఖరిపై విమర్శలు
జన్మభూమి కమిటీల ఆగడాలు, టీడీపీ కార్యకర్తల అక్రమాలతో పాటు ఏరా...పోరా అనే మాటలతో అచ్చెన్నాయుడు వైఖరిపై ప్రజలు విస్తుపోయారు. ఈసారి మంత్రికి ఓటమి తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. గ్రామ స్థాయిలో కక్ష పూరితమైన చర్యలపై టీడీపీ కార్యకర్తలు చెప్పిందే తడవుగా ఎటువంటి ఆలోచన చేయకుండా అచ్చెన్న చేసిన దుందుడుకు చర్యలు విజయానికి అడ్డంకులుగా మారనున్నాయనే కథనాలు వినిపిస్తున్నాయి. ఆఫ్‌షోర్‌ను పూర్తి చేయకపోవడం, టెక్కలిలో హుదూద్ ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా వదిలేయడం, నందిగాంలో భవనాలు లేకుండా జూనియర్ కళాశాల మంజూరు చేయడంలో నిర్లక్ష్యం చూపారనే విమర్శలు ఉన్నాయి.
నియోజకవర్గం చరిత్ర...
టెక్కలి నియోజకవర్గం 1952లో 61వేల196 మంది ఓటర్లతో ప్రస్థానం ప్రారంభమై ప్రస్తుతం 2,22,222 మందికి చేరుకుంది. కళింగ, వెలమ, యాదవ, కాపు, రెడ్డి, వైశ్య, ఎస్సీ, ఎస్టీలతో పాటు మిగిలిన చేతివృత్తులకు చెందిన సామాజిక వర్గాలు ప్రధాన ఓటర్లగా ఉన్న ఈ నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టీ.రామారావు లాంటి వ్యక్తులకు సైతం పట్టం కట్టారు. 1952లో బ్రాహ్మణతర్లా నియోజకవర్గం పేరుతో ఆరంభమై 1972 వరకు కొనసాగింది. అనంతరం టెక్కలి నియోజకవర్గంగా రూపుదిద్దుకుంది. మొట్టమొదటిగా టెక్కలి, నందిగాం, పలాసలో సగభాగం, వజ్రపుకొత్తూరులో సగభాగం, సంతబొమ్మాళి మండలంలో 7 పంచాయతీలతో 2008 సంవత్సరం వరకు టెక్కలి నియోజకవర్గంగా కొనసాగింది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలంతో పాటు అదే మండలంలో ప్రత్యేకంగా ఉన్న హరిశ్చంద్రాపురాన్ని ఈ నియోజకవర్గంలో విలీనం చేశారు. 2009 సంవత్సరం నుంచి నాలుగు మండలాలతో టెక్కలి నియోజకవర్గంగా కొనసాగుతూ వస్తోంది.
గెలుపొందిన అభ్యర్థులు వీరే..
సంవత్సరం విజేత పార్టీ
1952 రొక్కం లక్ష్మీ నరసింహదొర ఇండిపెండెంట్
1955 ఆర్‌ఎల్‌ఎమ్ దొర కాంగ్రెస్
1962 రోణంకి సత్యనారాయణ ఇండిపెండెంట్
1967 నెచ్చెర్ల రాములు ఇండిపెండెంట్
1972 సత్తారు లోకనాథంనాయుడు కాంగ్రెస్
1978 బమ్మిడి నారాయణస్వామి జనతాపార్టీ
1983 అట్డాడ జనార్దనరావు టీడీపీ
1985 వరదా సరోజా టీడీపీ
1989 దువ్వాడ నాగావళి టీడీపీ
1994 ఎన్.టి.రామారావు టీడీపీ
1995 హనుమంతు అప్పయ్యదొర టీడీపీ
1999 కొర్ల రేవతీపతి టీడీపీ
2004 హనుమంతు అప్పయ్యదొర కాంగ్రెస్
2009 కొర్ల రేవతీపతి కాంగ్రెస్
2009 కొర్ల భారతి కాంగ్రెస్
2014 కింజరాపు అచ్చెన్నాయుడు టీడీపీ
మొత్తం ఓటర్లు: 2,22,222
పురుషులు: 1,12,093
స్తీలు: 1,10,110
ఇతరులు: 19
మండలాలు: 4(టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, నందిగాం)
పంచాయతీలు: 136
పోలింగ్ కేంద్రాలు: 316
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: 157
Comments
Please login to add a commentAdd a comment