సాక్షి, ఆమదాలవలస (శ్రీకాకుళం): జిల్లాకు అతి కీలక నేతలను అందించిన ప్రాంతం. బొడ్డేపల్లి రాజగోపాలరావు, తమ్మినేని పాపారావు కాలం నుంచి తమ్మినేని సీతారాం, బొడ్డేపల్లి సత్యవతి కాలం వరకు ఎందరో రాజకీయ ఉద్ధండులను అందించిన గడ్డ. ఇక్కడ ప్రతి ఎన్నికా ప్రత్యేకమే. ప్రస్తుతం టీడీపీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో సైకిల్ స్పీడ్ బాగా తగ్గింది. వరుసగా బయటపడుతున్న దోపిడీ ఆనవాళ్లు, మచ్చుకైనా కనిపించని ప్రగతి గుర్తులు కూనకు ప్రతికూలంగా మారుతున్నాయి. అదే సమయంలో నిత్యం ప్రజాపోరాటాలు చేసిన తమ్మినేని సీతారాం మళ్లీ చక్రం తిప్పే దిశగా అడుగులు వేస్తున్నారని స్థానికులు అంటున్నారు.
1952 నుంచి నేటి వరకు..
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1952లో నగరికటకంగా ఈ నియోజకవర్గం ఉండేది. సరుబుజ్జలి, బూర్జ, ఎల్‌ఎన్‌పేట, ఆమదాలవలస మండలాలు అప్పట్లో కలిసి ఉండేవి. మొదటి ఎన్నికల్లో సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన కిల్లి అప్పలనాయుడు, కొత్తకోట గ్రామానికి చెందిన డోల జగన్నాథం, ఆమదాలవలస మండలం తొగరాం గ్రామానికి చెందిన తమ్మినేని పాపారావు మధ్య త్రిముఖ పోటీ జరిగింది. అప్పలనాయుడు విజయం సాధించి మొదటి ఎమ్మెల్యేగా నిలిచారు. ఆ తర్వాత 1957లో జరిగిన ఎన్నికల్లో తమ్మినేని పాపారావు విజయకేతనం ఎగురవేశారు. 67లో నారాయణపురం ఆనకట్ట నిర్మాణానికి కృషి చేసి తమ్మినేని పాపారావు ఈ ప్రాంత ప్రజల గుండెల్లో స్థిరస్థానం సంపాదించారు.
1972లో ఆమదాలవలస నియోజకవర్గంగా మారింది. అప్పట్లో కాంగ్రెస్ కాస్త ఇక్కడ ప్రభావం చూపగలిగింది. 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత రాజకీయం కాస్త మారింది. తమ్మినేని సీ తారాం బలమైన నేతగా ఎదగడం అంతా చూశారు. 32 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేసిన బొడ్డేపల్లి రాజగోపాలరావుపై 1991లో సీతారాం గెలిచి నవశకానికి నాంది పలికి, తన రాజకీయ చతురత నిరూపించుకున్నారు. తర్వా త అనేక క్యాబినెట్లలో అగ్రస్థాయి నేతగా సీతారాం పనిచేశారు. గత ఎన్నికల్లో కూన రవికుమార్ టీడీపీ తరఫున పోటీ చేసి తమ్మినేనిపై గెలుపొందారు. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తమ్మినేని అడుగులు మరింత వేగంగా అధికారం వైపు పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ప్రస్తుత ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇసుక అక్రమ రవాణాకు చిరునామాగా నిలుస్తున్నారు. వంశధార, నాగావళి ప్రాంతాల్లోగల గ్రామాలు దూసి, సింగూరు, పురుషోత్తపురం, మూల సవలాపురం, ముద్దాడపేట, బొడ్డేపల్లి తదితర గ్రామాల్లో అక్రమ ఇసుక ర్యాంపులు నిర్వహించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. గ్రామాల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలకు కూడా ఇసుక ర్యాంపులు కేటాయించి ఇసుక మాఫియాకు ఆజ్యం పోశారు. ఇక భూకబ్జాల్లో రారాజుగా పేరొందారు. సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస గ్రామంలో లీజు పేరుతో 99ఎకరాలు ప్రభుత్వ స్థలం కబ్జా చేయాలని విశ్వప్రయత్నాలు చేశారు.
ఆ భూముల్లో కూన వారి పూలతోట వేసేందుకు దరఖాస్తులు పెట్టారు. వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకోవడంతో అది నిలిచిపోయింది. పంచాయతీ రాజ్ కార్యాలయం ఆవరణలోగల కోట్ల రూపాయలు విలువ చేసే సుమారు 30 సెంట్లు ప్రభుత్వ భూమిపై కూన కన్ను పడింది. దీంతో దాన్ని టీడీపీ కార్యాలయం నిర్మాణం పేరుతో కబ్జా చేయాలని చూసిన విప్‌కు పరివర్తన్ ట్రస్ట్ సబ్యుడు చింతాడ రవికుమార్ అడ్డు తగిలడంతో చుక్కెదురైంది. ఇక నీరు చెట్టుతో దోచుకున్న నిధులకే లెక్కే లేదు. కార్యకర్తలకు బెదిరింపులు చేయడంలో విప్ రౌడీ షీటర్ పాత్ర కూడా పోషించారు. ఇటీవల పొందూరు మండలానికి చెందిన గంగిరెడ్ల శివను వైఎస్సార్ సీపీ లోకి వెళ్తే చంపేస్తానని బెదిరించి రౌడీ రాజకీయాలకు తెర తీశారు.
వైఎస్సార్ సీపీ ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న తమ్మినేని సీతారాం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ విప్‌గా, మంత్రిగా పనిచేసి ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. గత మూడు విడతలుగా ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నియోజకవర్గంలో అందరి మన్ననలు పొందారు. వైఎస్ జగన్ పథకాలను విరి విగా జనంలోకి తీసుకెళ్లడమే కాకుండా, తన రాజకీయ అనుభవంతో ప్రత్యర్థులను ఇరకాటంలోకి నెడుతున్నారు.
సమస్యలు..
ఆమదాలవలస సుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని అందరూ చెబుతున్నారు. గానీ తెరవడం లేదు. వైఎస్ జగన్ దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వడంతో జనాల్లో ఆశలు మొలకెత్తుతున్నాయి. ఇక విప్ చెరబట్టిన తీరాలే ఇక్కడి ప్రధాన సమస్య. నిరంతర ఇసుక రవాణా వల్ల ఆయా గ్రామాలు అభివృద్ధి కావడం లేదు. రైల్వే స్టేషన్ ఉన్నా ఆమదాలవలస పారిశ్రామికంగా అనుకున్నంతగా అభివృద్ధి చెందడం లేదు. మున్సిపాలిటీలోనూ ప్రగతి అనుకున్నంత మేర కానరావడం లేదు.
ఎమ్మెల్యేలు వీరే..
ఆమదాలవలస నియోజకవర్గం 1952లో ఏర్పడింది.
సంవత్సరం | ఎమ్మెల్యే |
1952 | మొదట ఎమ్మెల్యే పురుషోత్తపురం గ్రామానికి చెందిన కిల్లి అప్పలనాయుడు |
1957 | తమ్మినేని పాపారావు |
1962 | తమ్మినేని పాపారావు |
1967 | తమ్మినేని పాపారావు |
1972 | పైడి శ్రీరామమూర్తి |
1977 | పైడి శ్రీరామమూర్తి |
1983 | తమ్మినేని సీతారాం |
1985 | తమ్మినేని సీతారాం |
1989 | పైడి శ్రీరామమూర్తి |
1991 | తమ్మినేని సీతారాం |
1994 | తమ్మినేని సీతారాం |
1999 | తమ్మినేని సీతారాం |
2004 | బొడ్డేపల్లి సత్యవతి |
2009 | బొడ్డేపల్లి సత్యవతి |
2014 | కూన రవికుమార్ |
Comments
Please login to add a commentAdd a comment