కుల్కచర్ల, న్యూస్‌లైన్: ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, వందలమంది ప్రాణత్యాగాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేసింది తప్ప రోజుకో పార్టీలు మారుతున్న దొంగ రాజకీయ నాయకుల వల్ల కాదని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క అన్నారు. గురువారం స్వాతంత్య్ర దినం సందర్భంగా కుల్కచర్ల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో విమలక్కతో మాట, పాట కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు అంశంపై పలువురు ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు విమలక్క సమాధానాలిచ్చారు. మధ్యమధ్యలో తెలంగాణ వనరుల దోపిడీ, ఉద్యమం తీరుతెన్నులను పాటల ద్వారా వినిపిస్తూ ఆకట్టుకున్నారు. అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కేంద్రం ప్రకటనతో తెలంగాణ వచ్చినట్లు కాదని, సీమాంధ్ర పెట్టుబడిదారుల నుంచి ఈ ప్రాంతం విముక్తి పొందినప్పుడే అసలైన తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల కృత్రిమ ఉద్యమాలకు, బెదిరింపులకు లొంగకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలని అన్నారు. సమైక్య ఉద్యమానికి మద్దతుగా... తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న కిరణ్‌కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని, ఆయన తక్షణం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దొరల పాలన లేని సామాజిక తెలంగాణే తమ లక్ష్యమని, పెట్టుబడిదారుల పాలన అంతం చేసేంతవరకూ తమ పోరాటం కొనసాగుతుందని విమలక్క స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు ప్రహ్లాద్‌రావు, పీఏసీఎస్ అధ్యక్షుడు భీంరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు సుధాకర్ రెడ్డి, నాగరాజు, మండల జేఏసీ అధ్యక్షుడు సత్యనారాయణ, కుల్కచర్ల సర్పంచ్ జానకిరాం, మండల టీడీపీ అధ్యక్షుడు రాంరెడ్డి, టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అమరుల త్యాగఫలమే తెలంగాణ
Published Fri, Aug 16 2013 3:16 AM | Last Updated on Thu, Sep 6 2018 3:03 PM
Advertisement