ఏపీఎన్జీవో కార్యాలయ ముట్టడికి యత్నం | telanagana lawyers tried to attack apngo office | Sakshi
Sakshi News home page

ఏపీఎన్జీవో కార్యాలయ ముట్టడికి యత్నం

Published Sun, Jan 12 2014 4:04 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

ఏపీఎన్జీవో కార్యాలయ ముట్టడికి యత్నం - Sakshi

ఏపీఎన్జీవో కార్యాలయ ముట్టడికి యత్నం

అశోక్‌బాబుపై తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆగ్రహం
 హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లును భోగి మంటల్లో వేసి తగలబెడతానన్న ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుపై తెలంగాణ న్యాయవాదుల జేఏసీ మండిపడింది. ఆయన తన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణ బిల్లుపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ శనివారం పలువురు తెలంగాణ న్యాయవాదులు ఏపీఎన్జీవో కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లును భోగి మంటల్లో వేసి తగలబెట్టాలని అశోక్‌బాబు మాట్లాడటం అంబేద్కర్‌ను అవమానించడమే అని, ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలోని బ్యానర్‌ను చించేందుకు తెలంగాణ న్యాయవాదు యత్నించడంతో ఏపీఎన్జీవో నేతలు వారిని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు తెలంగాణ న్యాయవాదులను అరెస్టు చేశారు. అశోక్‌బాబుపై అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన టీ న్యాయవాదులు.. తక్షణమే కేసు నమోదు చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్‌లో బైఠాయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ న్యాయవాదులు ఉపేందర్, శ్రీధర్‌రెడ్డి, గంపా వెంకటేష్, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 ‘అశోక్‌బాబును డిస్మిస్ చేయాలి’
 తెలంగాణ బిల్లులను భోగి మంటల్లో తగలబెట్టాలని పిలుపునిచ్చిన అశోక్‌బాబును వెంటనే ప్రభుత్వ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వి.రవికుమార్ డిమాండ్ చేశారు. అశోక్‌బాబు రాజ్యాంగానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్న అశోక్‌బాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement