Telangana Lawyers JAC
-
హడావుడిగా చట్టాలు చేస్తే ఇలాగే ఉంటుంది
సాక్షి, న్యూఢిల్లీ: హడావుడిగా చట్టాలు రూపొందిస్తే వివాదాలు, వ్యాజ్యాలు, చిక్కులు మాత్రమే కాకుండా దానికి పర్యవసానంగా వికృత పరిస్థితులు కూడా తలెత్తుతాయని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని ఉద్దేశించి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఏపీల న్యాయాధికారుల విభజన జరపనిదే నియామకాలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టరాదని తెలంగాణ న్యాయమూర్తుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై మూడు రోజులుగా విచారణ జరుగుతోంది. గురువారం సంఘం తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపిస్తూ.. న్యాయమైన, సమానమైన వాటా కోసమే తెలంగాణ డిమాండ్ వచ్చిందంటూ జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ సిఫారసులను ఉటంకించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది హరేన్ రావల్ వాదనలు ప్రారంభించారు. రెండు రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించడంలో కేంద్రానిదే కీలక పాత్ర అని నివేదించారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ జోక్యం చేసుకుంటూ ‘హడావుడిగా చట్టాలు రూపొందిస్తే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. అన్నికోణాల్లో ఎదురయ్యే సమస్యలకు సంబంధిత చట్టంలో నిబంధనలు లేకపోతే వివాదాలు, వ్యాజ్యాలు మాత్రమే కాకుండా దానికి పర్యవసానంగా వికృతమైన పరిస్థితులు తలెత్తుతాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల పోలీసులు కొట్టుకునే పరిస్థితి రావడం ఈ కోవలోనిదే. ఒక చట్టం ద్వారా ప్రభావితమయ్యే అన్ని తరగతులకు న్యాయపరమైన పరిష్కారం ఆ చట్టంలో ఉండాలి’ అని పేర్కొన్నారు. విచారణ మంగళవారానికి వాయిదా పడింది. -
'మల్లన్నసాగర్ పై ప్రజల్లో అనుమానాలు'
హైదరాబాద్ : తెలంగాణ న్యాయవాదుల జేఏసీ శనివారం మెదక్ జిల్లా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన రైతులను కలిసేందుకు బయల్దేరారు.ఈ సందర్భంగా తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ మాట్లాడుతూ మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌పై ప్రజల్లో అనుమానాలున్నాయన్నారు. ప్రజల అనుమానాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ వెళుతున్నవారిని అరెస్ట్ చేయడం సరికాదని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. -
రేపట్నుంచి జిల్లా కోర్టుల్లో విధుల బహిష్కరణ!
హైదరాబాద్: రేపటి నుంచి జిల్లా కోర్టుల్లో విధులు బహిష్కరించాలని సోమవారం తెలంగాణ న్యాయవాదుల జేఏసీ తీర్మానించింది. మొత్తం నాలుగు రోజుల పాటు ఉద్యమ కార్యాచరణను న్యాయవాదుల జేఏసీ ప్రకటించింది. ఈ నెల 14న అన్ని కోర్టుల బహిష్కరణ,రిలే నిరాహారదీక్షలు, ఆందోళనలు కొనసాగించాలని తెలంగాణ న్యాయవాదులు తీర్మానించారు. అదేవిధంగా 15న మౌన ప్రదర్శన, 16న వంటావార్పు, 17న పోస్ట్ కార్డుల ఉద్యమం, 18న మరోసారి కార్యాచరణ ప్రకటిస్తామని న్యాయవాదుల జేఏసీ వెల్లడించింది. -
ఏపీఎన్జీవో కార్యాలయ ముట్టడికి యత్నం
అశోక్‌బాబుపై తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆగ్రహం హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లును భోగి మంటల్లో వేసి తగలబెడతానన్న ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుపై తెలంగాణ న్యాయవాదుల జేఏసీ మండిపడింది. ఆయన తన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణ బిల్లుపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ శనివారం పలువురు తెలంగాణ న్యాయవాదులు ఏపీఎన్జీవో కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లును భోగి మంటల్లో వేసి తగలబెట్టాలని అశోక్‌బాబు మాట్లాడటం అంబేద్కర్‌ను అవమానించడమే అని, ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలోని బ్యానర్‌ను చించేందుకు తెలంగాణ న్యాయవాదు యత్నించడంతో ఏపీఎన్జీవో నేతలు వారిని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు తెలంగాణ న్యాయవాదులను అరెస్టు చేశారు. అశోక్‌బాబుపై అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన టీ న్యాయవాదులు.. తక్షణమే కేసు నమోదు చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో బైఠాయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ న్యాయవాదులు ఉపేందర్, శ్రీధర్‌రెడ్డి, గంపా వెంకటేష్, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘అశోక్‌బాబును డిస్మిస్ చేయాలి’ తెలంగాణ బిల్లులను భోగి మంటల్లో తగలబెట్టాలని పిలుపునిచ్చిన అశోక్‌బాబును వెంటనే ప్రభుత్వ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వి.రవికుమార్ డిమాండ్ చేశారు. అశోక్‌బాబు రాజ్యాంగానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్న అశోక్‌బాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. -
సీఎం మిత్రునికి అక్రమంగా భూమి కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏకి చెందిన విలువైన భూములను అధికార యంత్రాంగం సీఎం కిరణ్ ఒత్తిడికి తలొగ్గి ఆయన మిత్రుడు అమరేందర్‌రెడ్డికి కారుచౌకగా కట్టబెట్టిందని ఆరోపిస్తూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ లోకాయుక్తను ఆశ్రయించింది. ఈ మేరకు జేఏసీ కోకన్వీనర్ శ్రీరంగారావు నేతృత్వంలో ప్రతినిధి బృందం శుక్రవారం లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. నందగిరిహిల్స్‌లో 4 ఎకరాల ఆరు గుంటల విలువైన భూమిని రూ.84.74 కోట్లకే అమరేందర్‌రెడ్డికి కట్టబెట్టారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చేందుకు బాధ్యులైన అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని వారు కోరారు. -
సమైక్య న్యాయవాదుల సభను అడ్డుకున్న టీ. లాయర్లు
-
సమైక్య న్యాయవాదుల సభను అడ్డుకున్న టీ. లాయర్ల జేఏసీ, ఉద్రిక్తం
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ భవన్ లో సమైక్యాంధ్ర న్యాయవాదుల జాయింట్ యాక్షన్ సమావేశం ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్‌ల లోని అబిడ్స్ లోని ఏపీఎన్జీవో భవన్లో నిర్వహిస్తున్న సమైక్యాంధ్ర న్యాయవాదుల జేఏసీ సమావేశాన్ని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ అడ్డుకున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ఎలాంటి సదస్సులు, సమావేశాలు నిర్వహించకూడదని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ అభ్యంతరం తెలిపింది. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల మధ్య తోపులాట కూడా జరగడంతో ఏపీఎన్ జీవో భవన్ వద్ద వాతావరణం వేడెక్కింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక బ్యానర్ ను తెలంగాణ న్యాయవాదులు చించివేశారు.