సాక్షి, న్యూఢిల్లీ: హడావుడిగా చట్టాలు రూపొందిస్తే వివాదాలు, వ్యాజ్యాలు, చిక్కులు మాత్రమే కాకుండా దానికి పర్యవసానంగా వికృత పరిస్థితులు కూడా తలెత్తుతాయని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని ఉద్దేశించి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఏపీల న్యాయాధికారుల విభజన జరపనిదే నియామకాలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టరాదని తెలంగాణ న్యాయమూర్తుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై మూడు రోజులుగా విచారణ జరుగుతోంది.
గురువారం సంఘం తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపిస్తూ.. న్యాయమైన, సమానమైన వాటా కోసమే తెలంగాణ డిమాండ్ వచ్చిందంటూ జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ సిఫారసులను ఉటంకించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది హరేన్ రావల్ వాదనలు ప్రారంభించారు. రెండు రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించడంలో కేంద్రానిదే కీలక పాత్ర అని నివేదించారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ జోక్యం చేసుకుంటూ ‘హడావుడిగా చట్టాలు రూపొందిస్తే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి.
అన్నికోణాల్లో ఎదురయ్యే సమస్యలకు సంబంధిత చట్టంలో నిబంధనలు లేకపోతే వివాదాలు, వ్యాజ్యాలు మాత్రమే కాకుండా దానికి పర్యవసానంగా వికృతమైన పరిస్థితులు తలెత్తుతాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల పోలీసులు కొట్టుకునే పరిస్థితి రావడం ఈ కోవలోనిదే. ఒక చట్టం ద్వారా ప్రభావితమయ్యే అన్ని తరగతులకు న్యాయపరమైన పరిష్కారం ఆ చట్టంలో ఉండాలి’ అని పేర్కొన్నారు. విచారణ మంగళవారానికి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment