
ప్రభుత్వానికి చేరిన తెలంగాణ బిల్లు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి.... ఓ మంత్రితో పాటు ప్రభుత్వ విప్కు సమాచారం అందించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం రాత్రి ఈ బిల్లును రాష్ట్రానికి పంపారు. ప్రణబ్ ఆదేశానుసారం రాత్రి 9 గంటల సమయంలో అధికారుల బిల్లును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి పంపినట్లు సమాచారం. అయితే బిల్లు రాష్ట్రానికి చేరిన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.
బిల్లు ప్రతి వచ్చీ రాగానే ఉన్నతాధికారులు దాన్ని సీఎం సమక్షంలో పెట్టినట్లు సమాచారం. ఇక కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసి పంపిన విభజన బిల్లుపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత శాసనసభ, శాసనమండలి అభిప్రాయం కోరుతూ దాన్ని యథాతథంగా రాష్ట్రానికి పంపించారు. బిల్లుపై ఆరు వారాల్లోగా ఉభయ సభల అభిప్రాయం చెప్పాలని రాష్ట్రపతి నిర్ధేశించారు.