కేసీఆర్ ప్రభుత్వానికి అదే ఆఖరిరోజు
- నన్ను ఏ రూల్ కింద అరెస్టు చేస్తారు?
- ఉమ్మడి రాజధానిలో నీ పెత్తనమేమిటి?
- నేనూ ముఖ్యమంత్రినే.. నాకూ ఆత్మగౌరవం ఉంది
- తప్పుడు వీడియోలు సృష్టిస్తే ఊరుకుంటాననుకున్నారా?
- ఎన్డీటీవీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ: తనను అరెస్టు చేయటానికి సాహసిస్తే కేసీఆర్ ప్రభుత్వానికి అదే చివరి రోజవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం తనను అరెస్టు చేస్తుందన్న భయం లేదని, ఏ రూల్ ప్రకారం తనను అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. బుధవారం ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 63 మంది మాత్రమే ఉన్న పార్టీ ఐదుగురు ఎమ్మెల్సీలను ఎలా పోటీకి పెట్టిందని ప్రశ్నించారు. ఇది నైతికమేనా అని ఆయన అడిగారు.
ఎన్నికలు ప్రకటించి.. ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో ఏదైనా ఉంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలి కానీ, ఏసీబీకి ఇందులో తలదూర్చే అధికారం ఎక్కడుందని చంద్రబాబు అన్నారు. ‘ఏసీబీ ఉంది కదా అని ఎవరిపైనైనా దాడులు చేయవచ్చు.. ఇష్టం వచ్చినట్లు వ్యవహరించవచ్చు.. స్టింగ్ ఆపరేషన్ చేయవచ్చు.. మీ టీవీ చానల్‌లో నాపై ఓ వీడియో తయారు చేసి నా ప్రతిష్టను దిగజార్చవచ్చనుకుంటే కుదరదు. మీ టీమ్.. మీ టీవీ న్యూస్ చానల్ తప్పుడు డాక్యుమెంట్‌ను ప్రసారం చేయటం ఏ రకమైన నైతికత? ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని దర్యాప్తు ఏజెన్సీలకు సమర్పించాలి కానీ టీవీ న్యూస్ చానల్‌కు లీక్ చేస్తారా’’ అని చంద్రబాబు ఆవేశంగా అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం టీవీ చానళ్లను, ఎమ్మెల్యేలను బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించుకోవటానికి కలిసి మాట్లాడుకుందామని గత ఏడాది కాలంలో ఎన్నోసార్లు కేసీఆర్‌ను కోరానని కానీ ఆయన స్పందించనే లేదన్నారు. సమస్యల పరిష్కారం తమ వల్ల కాకపోతే.. నిపుణుల కమిటీని ఏర్పాటు చేద్దామని.. దాని వల్ల కూడా కాకుంటే కేంద్రం ద్వారా పరిష్కరించుకుందామని ఎన్ని సార్లు చెప్పినా కేసీఆర్ విననే లేదని చంద్రబాబు అన్నారు. ఉమ్మడి రాజధానిలో ఆయనకేం అధికారం ఉందని ప్రశ్నించారు.
‘నీకు పోలీసులుంటే నాకు పోలీసులున్నారు.. నీకు ఏసీబీ ఉంటే.. నా కు ఏసీబీ ఉంది..’ అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని అరెస్టు చేస్తుందా అన్న ప్రశ్నకు చంద్రబాబు జవాబిస్తూ.. ‘‘నేనెందుకు భయపడాలి? ఏ రూల్ ప్రకారం అరెస్ట్ చేస్తారు? ఒకవేళ అందుకు సాహసిస్తే మాత్రం కేసీఆర్ ప్రభుత్వానికి అదే ఆఖరి రోజవుతుంది. నేను ఎన్నికైన సీఎంని. నాకు ఆత్మగౌరవం ఉంది’’ అని అన్నారు.