సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన ఖాయమని తేలిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో భవిష్యత్తు రాజకీయ పరిస్థితులపై అన్ని పార్టీలు దృష్టిని సారించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక్కో లోక్‌సభాస్థానం పరిధిలో ఇప్పుడు 7 అసెంబ్లీ స్థానాలుండగా వాటిని 9కి పెంచాలనే డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది. ప్రధానంగా తెలంగాణలో ఈ డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 153కు పెంచాలనే వాదనకు క్రమంగా బలం చేకూరుతోంది.
లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల సంఖ్య దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒకో తీరుగా ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో వాటి సంఖ్యను పెంచాలని ఆయా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలుండే విధంగా తెలంగాణ విభజన బిల్లులోనే పొందుపర్చాలంటూ కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రజాప్రతినిధుల బృందంతో రెండు రోజుల్లో జీవోఎంను కలవాలని నిర్ణయించారు. ఇప్పుడు తెలంగాణలోని మిగిలిన పార్టీలతో పాటు టీఆర్‌ఎస్ కూడా దీనిపై దృష్టి సారించింది. ఒక్కో లోక్‌సభస్థానాన్ని ఒక జిల్లాగా చేయాలని గతంలో కోరిన టీఆర్‌ఎస్ ఇప్పుడు జిల్లాల సంఖ్యను 23గా చేయాలని డిమాండ్ చేస్తోంది.
అసెంబ్లీ స్థానాలెందుకు పెంచాలి?
తెలంగాణలో ఇప్పుడున్న 119 అసెంబ్లీ స్థానాల వల్ల రాజకీయ అనిశ్చితి పెరుగుతుందని నేతలు ప్రధానంగా ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేవలం 60 మంది ఎమ్మెల్యేల బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉండడంతో, 20 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ లేదా ఏదైనా వర్గం రాష్ట్ర రాజకీయ పరిస్థితులను శాసించే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల రాజకీయ బేరసారాలు, ప్రలోభాల వంటివాటితో అభివృద్ధికి విఘాతం కలుగుతుందని వీరు వాదిస్తున్నారు. దీనితో పాటు శాసనమండలిని కొనసాగించాలంటే ఆ రాష్ట్రంలో 120 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సీట్లను పెంచితే శాసనమండలిని కూడా కొనసాగించవచ్చని వీరంటున్నారు. అలాగే రాష్ట్రంలో ఆయా అసెంబ్లీ స్థానాల్లో ఓటర్ల సంఖ్యలో కూడా తీవ్ర వ్యత్యాసాలున్నాయి. తెలంగాణలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 1.42 లక్షల మంది ఓటర్లు ఉంటే మరో నియోజకవర్గంలో 4.42 లక్షల ఓటర్లున్నారు. ఈ వ్యత్యాసాలను సరిచేయడానికి అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచడమే మార్గమని వీరంటున్నారు.
నియోజకవర్గాల్లో ఓటర్ల వ్యత్యాసం..
తెలంగాణలో సగటున 2.10 లక్షల ఓటర్ల సంఖ్యను ప్రాతిపదికగా పెట్టుకుని ఒక రెవెన్యూ మండలం ఒక నియోజకర్గంలోనే ఉండాలనే కొన్ని నిబంధనలను పెట్టుకుని పునర్విభజన చేశారు. అయితే ఈ పునర్విభజనలోనూ తీవ్రమైన వ్యత్యాసాలున్నాయి. రంగారెడ్డిజిల్లా పరిధిలోని ఎల్‌బీనగర్‌లో అత్యధికంగా 4,42,713 మంది ఓటర్లు ఉండగా ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో అతి తక్కువగా 1,42,223 మంది ఓటర్లు ఉన్నారు. ఆ మాటకొస్తే ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలోనూ ఓటర్లు రెండు లక్షలకన్నా తక్కువగానే ఉన్నారు. తెలంగాణ మొత్తంలో రెండు లక్షలపైచిలుకు ఓటర్లున్న నియోజకవర్గాలు 46 ఉన్నాయి. ఇందులో నిజామాబాద్ (3), కరీంనగర్ (6), మెదక్ (4), రంగారెడ్డి (1), హైదరాబాద్ (12) మహబూబ్‌నగర్ (2), నల్లగొండ (8), వరంగల్ (7), ఖమ్మం (2) ఉన్నాయి. మూడు లక్షలకుపైగా ఓటర్లున్న నియోజకవర్గాలు తెలంగాణలో మూడు ఉన్నాయి. అవి కూడా రంగారెడ్డి జిల్లాలో (మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్) మాత్రమే ఉన్నాయి.
నాలుగు లక్షల పైచిలుకు ఓటర్లున్న నియోజకవర్గాలు మొత్తం నాలుగు ఉండగా, ఆ నాలుగు కూడా రంగారెడ్డి జిల్లాలోనే (కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి) ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్‌లోని నియోజకవర్గాలు కాకుండా మున్సిపాలిటీలు ఇతర పట్టణ ప్రాంతాల ప్రభావం ఉన్న స్థానాలు 54 ఉన్నాయి. మహబూబ్‌నగర్ (11), మెదక్ (7), నల్లగొండ (8), నిజామాబాద్ (3), రంగారెడ్డి (4), ఆదిలాబాద్ (5), ఖమ్మం (4), కరీంనగర్ (7), వరంగల్‌లో (5) నియోజకవర్గాలు పట్టణ ప్రాంతాలతో కలిసి ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాలు కలిపితే పట్టణ ఓటర్ల సంఖ్య ఎక్కువగా కలిగిన నియోజకవర్గాలు 69 ఉన్నాయి. ఎక్కువగా ఓటర్లున్న నియోజకవర్గాల్లో ఆ సంఖ్యను తగ్గించి, అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యను దాదాపు సమానంగా ఉండే విధంగా పునర్విభజన చేయాలని నాయకులు కోరుతున్నారు.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరు
అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో దేశం మొత్తం మీద ఒకే విధానం, సంఖ్య, ప్రామాణికత లేవు. కొన్ని లోక్‌సభ నియోజకవర్గస్థానాల పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలుంటే మరికొన్ని నియోజకవర్గాల్లో 10 దాకా ఉన్నాయి. అస్సాంలోని కొన్ని లోక్‌సభస్థానాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 9 అసెంబ్లీ స్థానాలున్నాయి. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 7, 8 ఉన్నాయి. మన రాష్ట్రంలో 7 ఉన్నాయి. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒకో విధానం ఉంది.
సీట్ల పెంపుపై పార్టీల దృష్టి
Published Mon, Nov 25 2013 1:15 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement