టీజేఏసీ నేతల అరెస్ట్
టీజేఏసీ నేతల అరెస్ట్
Published Sun, Sep 8 2013 3:14 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఏపీ ఎన్జీవోలు శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ సందర్భంగా పోలీసులు అరెస్ట్ చేసిన నిజాం కళాశాల విద్యార్థులను పరామర్శించేందుకు వచ్చిన టీజేఏసీ చైర్మన్ ఫ్రొఫెసర్ కోదండరాం, టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ మాలమహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ తదితరులను అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు ప్రకటించటంపై తెలంగాణవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేయడంతో గోషామహల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అనంతరం టీజేఏసీ నాయకులు పోలీసుల అనుమతితో స్టేడియం గేటు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు...
అక్రమ కేసులు పెడతారేమో?: దేవీప్రసాద్
తెలంగాణ విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు సాయంత్రం వరకు విడుదల చేయకపోవడం చూస్తుంటే అక్రమంగా కేసులు పెట్టాలని కుట్ర పన్నినట్లు భావిస్తున్నాం. ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన అధికారులంతా సీమాంధ్ర సభలో పాల్గొన్నారు. ఈ సభను ప్రభుత్వమే నిర్వహించిందనేందుకు అనేక ఆధారాలున్నాయి. తెలంగాణా ప్రజలపై ఆధిపత్యం చెలాయించేందుకే సభ నిర్వహించారు. ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు లేవనెత్తిన అంశాలన్నీ చర్చించుకుంటే పరిష్కారమయ్యేవే.
జాతీయ గీతాన్ని అవమానించారు: శ్రీనివాస్‌గౌడ్
సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో గజల్ శ్రీనివాస్ జాతీయగీతాన్ని తప్పుగా ఆలపించి అవమానించారు. దీనిపై అక్కడే ఉన్న సచివాలయ ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూస్తాం. మేం సభలు పెడితే బారికేడ్లు పెట్టి రాకుండా అడ్డుకుంటారు. సీమాంధ్రుల సభకూ బారికేడ్లు పెట్టి మమ్మల్ని ఎటూ వెళ్లకుండా దిగ్బంధించారు. ఇది ప్రజాస్వామ్యమా? నిరంకుశమా? జై తెలంగాణా అన్న కానిస్టేబుల్‌ను చితకబాదారు.
తెలంగాణ పదం నిషేధితమా?
సీమాంధ్రలో పోటీ సభ నిర్వహిస్తాం: మంద కృష్ణమాదిగ
ఒక్కసారి తెలంగాణ అని నినదించినందుకే కానిస్టేబుల్ అని కూడా చూడకుండా చితకబాదారు. కలిసి ఉందామంటూనే దాడులకు పాల్పడటం అమానుషం. నగరంలో సీమాంధ్రుల సభకు అనుమతించి రక్షణ కల్పించిన సీఎం కిరణ్ మాకు అనుమతిస్తే సీమాంధ్రలోనే పోటీ సభ నిర్వహిస్తాం. సీమాంధ్ర సభకు జనాలను బస్సుల్లో పోలీసు వాహనాల రక్షణతో తరలించినట్లు మా సభకు తరలించాల్సిన అవసరం లేదు. కేవలం సభకు అనుమతించి రక్షణ కలిస్తే చాలు. సభ ఎప్పుడు, ఎక్కడ? అనే వివరాలను ఆదివారం వెల్లడిస్తాం.
చంపేందుకే కలిసుందామంటున్నారు: విఠల్
సభలో 30 శాతం కూడా ఉద్యోగులు లేరు. గజల్ శ్రీనివాస్, విద్యార్థి నేతలు, పీఆర్పీ మాజీ నేత డాక్టర్ మిత్ర వీరంతా ఉద్యోగులేనా? పోలీసులు వారిని లోపలికి ఎలా అనుమతించారో వివరణ ఇవ్వాలి.
Advertisement
Advertisement