గతం మరచిన తెలంగాణ నేతలు | telangana leaders forgot past things | Sakshi
Sakshi News home page

గతం మరచిన తెలంగాణ నేతలు

Published Tue, Sep 24 2013 3:10 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

telangana leaders forgot past things

 సాక్షి, అనంతపురం : తెలంగాణ వాసులు గతం మరచి మాట్లాడుతున్నారని ఎపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు మండిపడ్డారు. సోమవారం అనంతపురం జిల్లా హిందూపురం ఎంజీఎం మైదానంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట జరిగిన లేపాక్షి బసవన్న రంకె’ బహిరంగసభకు ఆయన హాజరై మాట్లాడారు. 1956కు ముందు తెలంగాణ వాసులు నిజాం నిరంకుశ పాలనలో నలిగిపోయారని, ఆప్పట్లో అందరూ కూలీలే తప్ప సెంటు భూమి ఉన్న రైతులు లేరని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో రాయలసీమ వాసులు కూడా పాల్గొని నిజాం పాలనను అంతమొందించి.. వారికి విముక్తి కల్పించారన్నారు. అప్పటి నుంచి సీమాంధ్ర ప్రాంత వాసులు ఇక్కడ సంపాదించి అక్కడ పెట్టుబడులు పెట్టడంతోనే హైదరాబాద్, దాని చుట్టూ ఉన్న జిల్లాలు అన్ని విధాలా అభివృద్ధి చెందాయన్నారు. వాస్తవానికి తెలంగాణలో ఒక్క అదిలాబాద్ తప్ప మిగిలిన 9 జిల్లాలు అభివృద్ధి చెందాయన్నారు. అయితే దేశంలోనే అనంతపురం జిల్లా అత్యంత వెనకబడిన ప్రాంతమన్నారు. గతంలో సీమాంధ్ర ప్రాంతంలో గంజి కేంద్రాలు ఏర్పాటు చేసిన చరిత్ర కూడా ఉందన్నారు. ఇలాంటి సందర్భాలు తెలంగాణలో ఏనాడు తలెత్తలేదన్నారు.
 
  హైదరాబాద్ అందరికి సంబంధించినదే తప్ప.. తెలంగాణ వారి సొత్తేం కాదన్నారు. భాగ్యనగరాన్ని కేంద్రపాలిత రాష్ట్రంగా చేయడానికి గానీ, ఉమ్మడి రాజధానిగా చేయడానికి కానీ, తెలంగాణకు అప్పగించడానికి కానీ ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. తమకు కావాల్సింది.. 23 జిల్లాలతో కూడిన  సమైక్య రాష్ట్రమేనన్నారు. రాష్ట్రాన్ని విభజించడానికి కుట్రపన్నిన ప్రభుత్వాలకు, పార్టీలకు రాయలసీమ పౌరుషాన్ని ఒక సారి రుచి చూపిద్దామని పిలుపునిచ్చారు. తమ మాటలు మెత్తగా ఉంటాయని, అంత మాత్రాన తాము చేతకాని వారం కాదన్నారు. తమలో కూడా ఒక అల్లూరి సీతారామరాజు, సుభాష్‌చంద్ర బోస్ దాగి ఉన్నారని, మాటలు మాని.. చేతల్లోకి వస్తే.. తెలంగాణవాదులు తట్టుకోలేరని, మాడి మసైపోతారని అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వెళ్లిన సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులకు అడుగడుగునా అవమానాలు, దాడులు జరిగినా ఈ ప్రాంతానికి చెడ్డపేరు రాకూడదనే కారణంతోనే సంయమనం పాటించామని, ఇకపై అలాంటి పరిస్థితి ఉండబోదన్నారు. గోదావరి తెలంగాణ ప్రాంతంలో ప్రవహిస్తున్నా.. ఆ నదీ జలాల నుంచి కనీసం సీమాంధ్రులు 100 టీఎంసీల నీటిని కూడా వాడుకోవడం లేదన్నారు. కొత్తగూడెంలోని బీటీవీఎస్‌కు తెలంగాణ ప్రాంతం నుంచి బొగ్గు రావడం లేదని, అది ఒరిస్సా నుంచి వస్తున్న విషయం సీమాంధ్రులు గుర్తించాలన్నారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణకు కరెంటు ఉండదన్నారు. కృష్ణా నీటిని హైదరాబాద్‌కు 25 టీఎంసీల మేరకు ఇస్తున్నారని, ఆ నీటిని నిలిపివేస్తే.. భాగ్యనగరం పరిస్థితి ఏమిటన్నారు.
 
 జగ్గారెడ్డికి సలాం..
 తెలంగాణలో ఉన్నా.. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని బహిరంగంగా ప్రకటిస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డికి తాను సలాం చేస్తున్నానని అశోక్‌బాబు అన్నారు. సీమాంధ్రలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. జగ్గారెడ్డి లాంటి వారు ఐదుగురు లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి పడితే వారికి ఓటు వేయకూడదని, రాష్ట్రాన్ని విభజించడానికి తయారు చేసిన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని బహిరంగంగా ప్రమాణం చేసిన వారినే గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
 
 తెలంగాణ ఎమ్మెల్యేలనూ కలుస్తాం..
 సమైక్య రాష్ట్రం కోసం తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలను కలసి విన్నవిస్తామని, అంతకన్నా ముందు సీమాంధ్ర ఎమ్మెల్యేలను సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉండేలా ప్రమాణం చేయిస్తామని అశోక్‌బాబు తెలిపారు. తాను రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రానని చెప్పారు. ప్రజలు నీతిమంతులైన నాయకులనే గెలిపించి చట్టసభలకు పంపాలన్నారు. 2014 ఎన్నికల్లో దేశంలో తప్పకుండా మార్పు ఉంటుందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ప్రకటన వచ్చే వరకు ఉద్యమం ఆగదన్నారు. 2014లో సాధారణ ఎన్నికలు పూర్తయినా.. ప్రత్యేక వాదం సమసిపోయే వరకు ఉద్యమం చేస్తూనే ఉంటామన్నారు. తెలంగాణ  ఉద్యోగాలను సీమాంధ్రులు లాక్కోలేదని, వారి ఉద్యోగాలు వారే అనుభవిస్తున్నారన్నారు. సమైక్య రాష్ట్రం కోసం ప్రజలు హిందూపురంలో మండుటెండను సైతం లెక్కచేయలేదన్నారు.
 
  ఏపీఎస్ ఆర్‌టీసీ జేఏసీ రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో జరుగుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలు నిలిచిపోతాయన్నారు. రాయలసీమకు నీళ్లు రావాలంటే గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించడం ఒక్కటే మార్గమన్నారు. రెవెన్యూ శాఖ రాష్ట్ర జేఏసీ నాయకుడు కొమ్మరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల కన్నా దారుణ పరిస్థితులు చూడాల్సి వస్తుందన్నారు. ఏపీఎన్‌జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తమకు కావాల్సింది సమైక్యాంధ్రే కానీ.. సీఎం కుర్చీ కాదన్నారు. సీఎం కుర్చీ తెలంగాణ వారే తీసుకుని.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే చాలన్నారు. రాష్ట్రం విడిపోతే వందేళ్లయినా.. హైదరాబాద్ లాంటి నగరాన్ని సీమాంధ్రలో నిర్మించలేమన్నారు. అశోక్‌బాబును ప్రశ్నించే ముందు.. అసలు నీవు ఎవరన్నది తెలుసుకోవాలని మందకృష్ణ మాదిగను ప్రశ్నించారు. మునిసిపల్ శాఖ రాష్ట్ర జేఏసీ నాయకుడు కృష్ణమోహన్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే పురపాలక సంఘాలు నిర్వీర్యమై పోతాయన్నారు.  
 
 ఉద్యమానికి పుట్టినిల్లు ‘అనంత’..
 రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన మరుసటి రోజే సమైక్య ఉద్యమం అనంతపురంలోని సప్తగిరి సర్కిల్‌లో పుట్టిందని, ఇక్కడ ఎగిసిన ఆగ్రహ జ్వాలలు రాష్ట్రమంతా వ్యాపించడానికి కారణమైందని ఏపీఎన్‌జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. జులై 30న దిగ్విజయ్ సింగ్ ప్రకటనను సీమాంధ్రలో పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవని, అయితే అనంతపురం నుండే సమైక్య ఉద్యమం ప్రారంభమైందన్నారు. అనంతలో ప్రారంభమైన ఉద్యమం రెండు రోజులకే తారస్థాయికి చేరుకోవడంతో మిగతా జిల్లాలు మేల్కొన్నాయని చెప్పడానికి గర్వంగా ఉందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement