
ఏకమై.. కుట్రను అడ్డుకుందాం
జెండాలు, ఎజెండాలు పక్కన పెడదాం
తెలంగాణ ప్రజాప్రతినిధుల సమావేశంలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. శాసనసభలో రాష్ట్రపతి పంపిన బిల్లుపై చర్చ జరపకుండా మరికొంత సమయం గడువు కోరేందుకు వ్యూహం పన్నారని ఆరోపించారు. ఈ కుట్రను అడ్డుకునేందుకు జెండాలు, ఎజెండాలను పక్కనపెట్టి పార్టీలకతీతంగా తెలంగాణ ప్రజాప్రతినిధులంతా పోరాడాలని నిర్ణయించారు. అందులో భాగంగా త్వరలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి సహా కేంద్ర పెద్దలను కలిసి సీమాంధ్ర నేతల కుట్రలను జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో అసెంబ్లీలో విభజన బిల్లుపై సాఫీగా చర్చ జరిగేలా, నిర్దిష్ట గడువులోపు రాష్ట్రపతికి పంపేలా ఒత్తిడి తెచ్చేలా ఎప్పటికప్పుడు అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను ఏకతాటిపైకి తెచ్చి వ్యూహం రూపొందించేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీతోపాటు ఒప్పుకుంటే టీఆర్‌ఎస్, ఎంఐఎం నేతలను సభ్యులుగా చేర్చాలని నిర్ణయించారు. శుక్రవారం శాసనసభ ముగిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి కె.జానారెడ్డి అధ్యక్షతన మంత్రుల నివాస ప్రాంగణంలోని క్లబ్‌హౌస్‌లో తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. మంత్రులు గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, రాంరెడ్డి వెంకటరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, బసవరాజు సారయ్య, సునీత లక్ష్మారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరైన ఈ భేటీలో మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి(టీడీపీ), నాగం జనార్దన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి(బీజేపీ) హాజరయ్యారు. హన్మంతు షిండే, చెన్నమనేని రమేశ్ మినహా టీఆర్‌ఎస్ తరపున ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ ఈటెల రాజేందర్, హరీష్‌రావు సహా 16 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్‌లు అనిల్, ఆరెపల్లి మోహన్‌తోపాటు 20 మంది ఎమ్మెల్యేలు, 10 ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు... తొలుత జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ బిల్లును అడ్డుకునే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ తరుణంలో జెండా, ఎజెండాలను పక్కనపెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. సభలో చివరి వరకు చర్చ జరగకుండా చేసి మరింత గడువు కోరాలని సీమాంధ్ర నేతలు ఎత్తుగడ వేస్తున్నందున దాన్ని తిప్పికొట్టేందుకు ఎప్పటికప్పుడు వ్యూహం రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత వరకు తెలంగాణ సభ్యులంతా ప్రతిరోజూ సభలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో కలిపి సమన్వయ కమిటీని ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు అన్ని పార్టీల నేతలు మద్దతు తెలిపారు. టీడీపీ తరపున ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీజేపీ నుంచి నాగం, కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి రాజేందర్‌ను కమిటీలో సభ్యులుగా నియమించారు. సీపీఐ, ఎంఐఎం ఈ సమావేశానికి రాకపోయినప్పటికీ తెలంగాణకు సానుకూలంగా ఉన్నందున వారిని కూడా కమిటీలో చేర్చుకోవాలని నిర్ణయించారు.
సమయం వృథా కానివ్వొద్దు..
సమావేశంలో హరీష్‌రావు మాట్లాడుతూ శాసనసభ నుంచి తొందరగా విభజన బిల్లును పంపేందుకు సమయం వృథా కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా తెలంగాణకు చెందిన 119 మంది ఎమ్మెల్యేలంతా తెలంగాణ బిల్లుకు మద్దతు చెబుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేపట్టాల్సిన సూచనలను ప్రతిపాదిస్తూ మూకుమ్మడిగా స్పీకర్‌కు లేఖ అందజేస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. దాంతో చాలా మేరకు సమయం కలిసి వస్తుందన్నారు. అలాగే బిల్లు విషయంలో స్పీకర్ నిబంధనల మేరకు వ్యవహరించేలా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. నాగం మాట్లాడుతూ సీమాంధ్రులు చేస్తున్న కుట్రలను జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లి దేశవ్యాప్త చర్చ జరపాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అందరం కలిసి త్వరలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధానితోపాటు కేంద్ర పెద్దలందరినీ కలిసి సీమాంధ్ర కుట్రలను వివరిస్తూ లేఖలను అందజేయాలని ప్రతిపాదించారు. సమావేశంలో మిగిలిన నేతలంతా అందుకు మద్దతు పలికారు. అసెంబ్లీ సమావేశాల విరామం సమయంలో ఢిల్లీ వెళ్దామని, తేదీని ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేయాలని నిర్ణయించారు. విభజన కోసం ఐక్యంగా ఉంటూ పోరాడుదామని, అయితే టీడీపీని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఎర్రబెల్లి అన్నారు.
కరడుగట్టిన సమైక్యవాదిగా ఉన్న శైలజానాథ్ శాసనసభా వ్యవహారాలను అప్పగించడం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని రేవూరి ప్రకాష్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దీన్ని ఆషామాషీగా తీసుకోకుండా అందరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. పొంగులేటి మాట్లాడుతూ సభలో విభజన బిల్లుపై చర్చ జరగనందుకు నిరసనగా ప్రతిరోజూ గాంధీ విగ్రహం వద్ద వివిధ రూపాల్లో నిరసన తెలిపితే బాగుంటుందని సూచించారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ శ్రీధర్‌బాబు తరహాలో మిగిలిన తెలంగాణ మంత్రులంతా రాజీనామా చేస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. వెంటనే జోక్యం చేసుకున్న శ్రీధర్‌బాబు.. ప్రస్తుతం ఆ అవసరం లేదన్నారు. సమావేశానంతరం ఆయా పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు.
బిల్లును అడ్డుకుంటే ప్రతిఘటిస్తాం: జానారెడ్డి
జెండా, ఎజెండాను పక్కనపెట్టి తెలంగాణ లక్ష్యంగా కలిసికట్టుగా ఉంటూ పోరాడుతాం. తెలంగాణ బిల్లును సభలో చర్చకు రాకుండా ఉంటే ప్రతిఘటిస్తాం. సీమాంధ్రల వ్యూహాలకు ప్రతివ్యూహం రూపొందించి అమలు చేస్తాం. త్వరలో రాష్ట్రపతిని కలిసి బిల్లుపై చర్చ జరగకుండా ఎవరు ఆటంకం కలిగించారో వివరిస్తాం.
కేంద్ర, రాష్ట్రాల కుమ్మక్కు: మోత్కుపల్లి, ఎర్రబెల్లి
విభజన ప్రక్రియను పూర్తి చేయాల్సిందే. కానీ వ్యూహాత్మకంగా జాప్యం జరుగుతోంది. ఇది చూస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై కావాలనే జాప్యం చేస్తున్నారన్న అనుమానం కలుగుతోంది. ఫిబ్రవరిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి విభజనను పూర్తి చేయాలి. అలా కాకుండా జాప్యం చేస్తే మాత్రం అందుకు పూర్తి బాధ్యత కేంద్రమే వహించాలి.
కిరణ్‌కు సీఎం పదవి ఎందుకు: నాగం
వాణిజ్య శాఖను సమర్ధవంతంగా నిర్వహించలేకపోయిన కిరణ్ ముఖ్యమంత్రి పదవిని సమర్ధవంతంగా ఎలా నిర్వహిస్తారు? రాష్ట్రాన్ని సరిగా నడపలేని సీఎం విభజనను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నాడు.
నంగనాచి మాటలతో అడ్డుకోవద్దు: ఈటెల రాజేందర్
సీమాంధ్ర నేతలు నంగనాచి మాటలు చెబుతూ సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ నేతలెవరూ ఊరుకోరు. ఇప్పటికైనా విభజన బిల్లుపై చర్చ జరపాలి. సీమాంధ్ర ప్రజల సమస్యలుంటే చెప్పాలి. వాటి పరిష్కారానికి సూచనలు చేయాలి. సీమాంధ్రులెంత అరిచి గీపెట్టినా తెలంగాణ ఆగదనే సత్యాన్ని గ్రహించాలి.