రేపు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ప్రతినిధులు
హైదరాబాద్: తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రుల క్వార్టర్స్‌లో ఈరోజు తెలంగాణ ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల మంత్రులందరూ హాజరయ్యారు. ఆరుగురు ఎంపిలు, 12 మంది మంత్రులు, 16 మంది ఎమ్మెల్యేలు,10 మంది ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తెలంగాణ ఫిలించాంబర్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు.
ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నందుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమావేశం ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నియమించిన ఆంటోనీ కమిటీ ఎదుట వాదనలు వినిపించాలని నిర్ణయించారు. ఇందు కోసం రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.
హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాల తెలంగాణకు సిడబ్ల్యూసి తీర్మానాన్ని కేంద్రం అమలుచేయాలని కోరారు. హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు అంగీకారం తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధి మేరకు శాంతిభద్రతల అంశం కేంద్రం చేపట్టినా అభ్యంతరం లేదని తెలిపారు. తెలంగాణతో కర్నూలు, అనంతపురం జిల్లాలు కలపడానికి వారు వ్యతిరేకత వ్యక్తం చేశారు. భద్రాచలంను తెలంగాణ నుంచి విడగొట్టవద్దని కమిటీకి తెలపాలని నిర్ణయించారు.