సాక్షి, నల్లగొండ
అమరవీరుల త్యాగాలు, ప్రజల పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆమోదం లభించిందని జిల్లావాసులు అభిప్రాయపడ్డారు. 60 ఏళ్ల స్వప్నం సాకారమైందని పెద్దఎత్తున సంబరాలు చేశారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంపై హర్షం వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి తెలంగాణవాదులు రోడ్లపైకి వచ్చి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బాణసంచా కాల్చి ఆన ందడోలికల్లో మునిగిపోయారు. మిఠాయిలు తినిపించుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు. రంగులు చల్లుకుని నృత్యాలతో హోరెత్తించారు. తెలంగాణ నినాదాలతో మార్మోగింది. అమరులకు నివాళులర్పిం చి వారి త్యాగాలను స్మరించుకున్నారు.
నివాళులు.. సంబరాలు
జిల్లాకేంద్రంలో గురువారం రాత్రి తెలంగాణ సంబరాలు మిన్నంటాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్లాక్‌టవర్ వద్ద ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకటనారాయణ గౌడ్ సమక్షంలో సంబరాలు చేశారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అమరవీరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పూలమాలలు వేసి ఆత్మత్యాగాన్ని గుర్తుకుతెచ్చుకున్నారు. బాణసంచా కాల్చారు. స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ తీశారు. టీ ఆర్‌ఎస్, టీర్‌ఆర్‌ఎస్‌వీ, టీ జేఏసీ, తెలంగాణ జాగృతి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు అర్పించారు. పరస్పరం రంగులు చల్లుకుని డాన్సులు చేశారు. భువనగిరిలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, జేఏసీ, టీపీఎస్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంపిణీ చేశారు. అమరవీరులకు ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. మిర్యాలగూడలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో స్లీబ్లు పంపిణీ చేసి టపాసులు కాల్చారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. దామర చర్లలో అన్ని పార్టీల ఆధ్వర్యంలో, చౌటుప్పల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చారు. సూర్యాపేటలో తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. హుజూర్‌నగర్‌లో జేఏసీ, టీఆర్ ఎస్, బీజేపీ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కోదాడలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు.
సీమాంధ్రుల పాలన నుంచి విముక్తి
కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలపడంతో 60 ఏళ్లుగా సీమాంధ్రుల పాలనలో ఉన్న ఈ ప్రాంత ప్రజలకు విముక్తి లభించింది ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. ఆమెకు కృతజ్ఞతలు.
- చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్యే
సీమాంధ్రులు సహకరించాలి
కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌ను ఆమోదించడంతో ఇక్కడి ప్రజల కల నెరవేరబోతున్నది. తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షను సీమాంధ్రులు అర్థం చేసుకొని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలి. సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె విరమించాలి.
- జి. మోహన్‌రావు, గెజిటెడ్ అధికారుల సంఘం
జిల్లా అధ్యక్షుడు
తెలంగాణ సంబరాలు
Published Fri, Oct 4 2013 2:35 AM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM
Advertisement
Advertisement