తాండూరు టౌన్ : సీమాంధ్ర ప్రాంత నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవడం తథ్యమని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 2009 నవంబర్ 29వ తేదీన ఆమరణ నిరాహార దీక్షను చేపట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం నాగేందర్‌గౌడ్ మాట్లాడుతూ నాటి కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితమే నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడమే మిగిలిందని, ఇక సీమాంధ్రుల కుట్రలు సాగవని అన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా సలహాదారు రంగారావు మాట్లాడుతూ యువత బలిదానం, కేసీఆర్ రాజీలేని పోరాటం, ప్రజల అండదండలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకోబోతున్నామన్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు జిల్లా ప్రభుత్వాస్పత్రికి వెళ్లి రోగులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు.