సాక్షి, కరీంనగర్ : అధినేత రెండు కళ్ల విధానం తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు సంకటంగా మారుతోంది. 2009 డిసెంబర్ 9 ప్రకటన అనంతరం తెలంగాణపై చంద్రబాబు యూ టర్న్ తీసుకున్న తరువాతి పరిణామాలతో వీలైనంత వరకు జనానికి దూరంగా ఉంటున్న నేతలకు చంద్రబాబునాయుడు ఇటీవల ప్రజల మధ్యకు వెళ్లాలని సూచించారు. తెలంగాణపై టీడీపీ లేఖతోనే కేంద్రం స్పందించిందని చెప్పాలంటూ సూచించారు. కానీ, తెలంగాణపై మళ్లీ యూ టర్న్ తీసుకుని సీమాంధ్రలో చంద్రబాబు నిర్వహించిన ఆత్మగౌరవ యాత్రలో చేసిన వ్యాఖ్యల మీద తెలంగాణ ప్రాంతంలో వ్యతిరేకత వచ్చింది. పలువురు టీటీడీపీ నేతలు కూడా బాబు వ్యాఖ్యల మీద అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల బాబుతో జిల్లాకు చెందిన నాయకులు భేటీ అయిన సందర్భంగా కూడా ఆ అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. 2004లో తాము సమ్యైవాదానికి కట్టుబడి ఉన్నామని, ఆ సమయంలో తెలంగాణ రాకుండా నిలువరించామంటే తప్పేమీ లేదని బాబు వారికి వివరించే ప్రయత్నం చేశారు. 2008లో పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని, ఇప్పటివరకు కట్టుబడి ఉన్నామని వివరించారు. ఇదే విషయాన్ని కార్యకర్తల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. కింది స్థాయి నుంచి కార్యకర్తల సమావేశాలను నిర్వహించాలని కూడా ఆదేశించారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజల మధ్యకు వెళ్లడం అధినేత చెప్పినంత సులువు కాదని పార్టీ నేతలు చెప్తున్నారు. చాలా కాలంగా జిల్లాలో పార్గీ కార్యకలాపాలు తగ్గిపోయాయి. పార్టీ ముఖ్యనేతలు తమ సొంత నియోజకవర్గాల్లో కూడా ఎప్పుడో గానీ పర్యటించడం లేదు.
సీమాంధ్ర ఉద్యమంలో భాగంగా బాబు ఆత్మగౌరవయాత్ర ప్రారంభించిన తరువాత ఇక్కడ నాయకులకు మరింత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా కొనసాగినంత కాలం పార్టీ నేతలు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో పార్టీ నేతలు ఊళ్లలో కాలు పెట్టేందుకే సాహసించలేదు. ఈ పరిస్థితుల కారణంగా పలువురు నేతలు పార్టీని విడిచిపెట్టారు. 2009 తరువాత వేములవాడ, కరీంనగర్ శాసనసభ్యులు రమేశ్, కమలాకర్ పార్టీకి దూరమయ్యారు. మండల, జిల్లా స్థాయి నాయకులు అనేక మంది వలసబాట పట్టారు.
మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి తలెత్తింది. హుస్నాబాద్‌లో తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డిని తెలంగాణవాదులు నిలదీశారు. సమైక్యవాదిగా మారారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురుకావడంతో ఆయన కంగుతిన్నారు. ఈ అనుభవంతో మిగతా నాయకులు కూడా జనంలోకి వెళ్లడం ఏమంత శ్రేయస్కరం కాదని భావిస్తున్నారు. పార్టీ ప్రజల విశ్వాసాన్ని పొందటం ఇక జరిగే పని కాదని భావిస్తున్న పలువురు నేతలు పార్టీ మీద ఆశలు వదులుకుంటున్నారు.
తమ్ముళ్లకు సంకటం
Published Thu, Sep 19 2013 2:35 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement
Advertisement