కాళ్లనే నమ్ముకున్నారు | Trusting in the legs | Sakshi
Sakshi News home page

కాళ్లనే నమ్ముకున్నారు

Published Fri, Jan 31 2014 4:17 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

Trusting in the legs

టీడీపీ నేతలు రెండు కళ్ల సిద్ధాంతపు అధినేతను నమ్ముకోకుండా తమ రెండు కాళ్లను నమ్ముకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎవరికివారుగా సొంత కాళ్లపై నిలబడాలని యోచిస్తున్నారు. తెలంగాణపై చంద్రబాబు వైఖరితో తమపై పడ్డ వ్యతిరేక ముద్రను తొలగించుకునేందుకు సొంతంగా కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు రేపట్నుంచి తన నియోజకవర్గంలో పాదయాత్రకు బయల్దేరుతున్నారు. పది పన్నెండు రోజుల్లో తన సెగ్మెంట్‌ను చుట్టివచ్చేలా 180 కిలోమీటర్లు నడిచే ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కావటంతో అయిదేళ్లలో తానేమీ అభివృద్ధి చేయలేదనే నిందలు రాకుండా దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మూడు డిమాండ్లను ఎంచుకున్నారు. ఎల్లంపల్లి నుంచి పెద్దపల్లి నియోజకవర్గానికి ఆరు టీఎంసీల నీటిని కేటాయించాలని, మానేరు వాగుపై చెక్ డ్యామ్‌లు నిర్మించి శ్రీరాంపూర్, ఓదెల మండలాల్లోని ఆయకట్టు చివరి భూములకు సాగునీటిని అందించాలని, పెద్దపల్లిలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో తాను పాదయాత్ర చేస్తున్నట్లు విజయరమణారావు తెలిపారు. తెలంగాణ బిల్లుపై గందరగోళం మధ్య అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే త మ్ముళ్లు సెగ్మెంట్లకు బయల్దేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనతో పాటు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎల్.రమణ, సుద్దాల దేవయ్య తమతమ సెగ్మెంట్లను అంటిపెట్టుకుని ఉండాలని నిశ్చయించుకున్నారు. స్వల్ప అనారోగ్యంతో మొన్నటివరకు ఇంటిపట్టునే ఉన్న దేవయ్య వచ్చేవారం నుంచి తన సెగ్మెంట్‌లో పర్యటించాలని ముహూర్తం పెట్టుకున్నారు. నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయించే రమణ అదే పంథాను అనుసరించే ఆలోచనలో ఉన్నారు.
 
 ముగ్గురు సిట్టింగ్‌లు మళ్లీ తమ సొంత సెగ్మెంట్ల నుంచే పోటీపడేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీతో పొత్తు ఖాయమని, అది కాస్తా తమకు కలిసొస్తుందని ఎమ్మెల్యేలు ఆశపడుతున్నారు. దాంతో తెలంగాణ అంశంపై ఉన్న వ్యతిరేకత తగ్గిపోతుందని అంచనాలు వేసుకుంటున్నారు. అధినేత పేరెత్తితే కలిసొచ్చే అవకాశం లేదని, మిగతా సెగ్మెంట్లలో టికెట్ల ను ఆశిస్తున్న తమ్ముళ్లు సైతం ఎవరికివారుగా ముందు జాగ్రత్తపడుతున్నారు. సొంతంగా పోటీకి నిలబడేందుకు బలాన్ని సమకూర్చుకుంటున్నారు. ఎవరికివారుగా తమకున్న వ్యక్తిగత పరిచయాలు, పలుకుబడితో పల్లెల్లోకి వెళ్లేందుకు వ్యూహం పన్నుతున్నారు.
 
 ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సొంత ఆలోచనలకు పదును పెడుతున్నారు. కోరు ట్ల నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా నియమితుడైన సాంబారి ప్రభాకర్ ఇప్పటికే తన పేరిట ముద్రించిన స్టిక్కర్, కరపత్రాలు, హ్యాండ్‌బ్యాగ్‌లతో ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. హుస్నాబాద్ సెగ్మెంట్ ఇన్‌చార్జి పి.రవీందర్‌రావు పల్లెపల్లెనా పార్టీ శ్రేణులను సమీకరించే పనిలో నిమగ్నమయ్యారు. కేవలం పార్టీ కార్యక్రమాలను నమ్ముకున్న మిగతా సెగ్మెంట్లలోని తమ్ముళ్లు ప్రజల్లోకి వెళ్లేందుకు వెనుకాడుతున్నారు. కనీసం నియోజకవర్గాల్లోనూ కనిపించటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement