హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఏర్పాటైంది. రాష్ట్ర విభజన ఖరారైనందున తెలంగాణ యూనియాన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘాన్ని(టీయూడబ్ల్యూజే) ఏర్పాటు చేసినట్లు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్ తెలిపారు. ఇది ఐజేయూకు అనుబంధంగా పనిచేస్తుందని చెప్పారు. ఆదివారమిక్కడ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో దేవులపల్లి అమర్ ఈ వివరాలు వెల్లడించారు.
సంఘం నేతలు వీరే..: టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శిగా కె.విరహత్ అలీ, అధ్యక్షుడిగా నంగనూరి శేఖర్, 10 జిల్లాల నుంచి 25 మంది సభ్యులను ఎంపిక చేసినట్లు అమర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం టీయూడబ్ల్యూజే సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఏపీయూడబ్ల్యూజే, టీయూడబ్ల్యూజే కలసి పాత్రికేయుల సంక్షేమం కోసం పనిచేస్తాయని చెప్పారు. ఈ సమావేశంలో ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె.అమర్‌నాథ్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు సోమసుందర్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.