తెయూ(డిచ్‌పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ(తెయూ) తొలి స్నాతకోత్సవం వర్సిటీ ఉన్నతాధికారుల ఒంటెత్తు పోకడల వల్ల అభాసు పాలైంది. బుధవారం జరిగిన తెయూ స్నాతకోత్సవంలో అధికారుల తీరు, ఖాళీ కుర్చీలతో అతిథుల ఎదుట వర్సిటీ పరువు గంగలో కలిసిందని విద్యార్థులు, వర్సిటీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెలలుగా కసరత్తు...
తొలి స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చేందుకు మూడు నెలలుగా వీసీ అక్బర్ అలీ ఖాన్, రిజిస్ట్రార్ లింబాద్రిలు కసరత్తు చేశారు. స్నాతకోత్సవాన్ని విజయవంతం చేసేందుకు 16 కమిటీలను ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి ఒక్కో పనిని అప్పచెప్పారు. స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్, పాలకమండలి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరవుతారని తరచూ ప్రెస్‌మీట్లు ఏర్పాటు చేసి మరీ ఊదర గొట్టారు. వారం క్రితం జిల్లా కేంద్రానికి టూరిస్టు బస్సు పంపి మరీ ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను వర్సిటీకి పిలిపించి స్నాతకోత్సవానికి గవర్నర్ వస్తున్నారని ప్రచారం చేసుకున్నారు. ప్రచారంపై చూపిన శ్రద్ధ స్నాతకోత్సవం విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై చూపలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల కోసం స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు ఏ కోశానా కన్పించలేదు. తమ హయాంలో తొలి స్నాతకోత్సవం జరిపిన ఖ్యాతి కోసమే కార్యక్రమం నిర్వహిం చినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గవర్నర్ రారని తెలిసినా...
రాష్ట్ర గవర్నర్ రారని ముందస్తుగానే తెలిసినా, ఆయన వస్తారని చివరి నిమిషం వరకు ప్రచారం చేయడం విమర్శలకు దారి తీస్తోంది. అసలు విషయాన్ని దాచి గవర్నర్ రాకను సైతం ప్రచారానికే వాడుకున్నారు. స్నాతకోత్సవానికి హాజరయ్యే విద్యార్థులు నిబంధనల ప్రకారం నడుచుకోవాలంటూ లేనిపోని ఆంక్షలు విధించడం, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులను కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడకపోవడం వర్సిటీ ఉన్నతాధికారుల ఒంటెత్తు పోకడలను తెలియజేస్తుంది. వర్సిటీ ఏర్పాటైన తర్వాత ఇప్ప టి వరకు పూర్తయిన ఆరు బ్యాచులకు సంబంధించి 13 మంది టాపర్లకు మాత్రమే గోల్డ్ మెడల్స్ ఇస్తామని పదే పదే ప్రకటించడం గమనార్హం. దీంతో ప్రతి బ్యాచులో టాపర్లుగా వచ్చిన వారు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కనీసం తమకు వేదికపై అతిథుల చేతుల మీదుగా కాన్వకేషన్స్ ఇప్పించాలని వారు పలుమార్లు విన్నవించినా వర్సిటీ ఉన్నతాధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.
దాతలకు గౌరవమేదీ...
తొలిస్నాతకోత్సవం కోసం టాపర్లకు గోల్డ్‌మెడల్స్ అందజేయాలని కోరుతూ పలువురు దాతలు ముందుకు వచ్చారు. 15 మంది దాతలు ఒక్కొక్కరు గోల్డ్ మెడల్ కోసం రూ.2.10 లక్షలు విరాళంగా అందజేశారు. స్నాతకోత్సవం రోజు దాతలకు కనీస గౌరవం దక్కలేదు. దాతలను ఆహ్వానించే వారే కరువయ్యారు. కనీసం వర్సిటీ సంక్షేమం కోసం విరాళాలు అందజేసిన దాతలకు ప్రత్యేక భోజనం అందజేయలేదు. అలాగే కాన్వకేషన్ కోసం 1497 మంది విద్యార్థులు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ పేరిట విద్యార్థుల నుంచి సుమారు రూ.12 లక్షలు వసూలు చేశారు. డబ్బులు చెల్లించిన వారికి సైతం వేదిక మీద కాన్వకేషన్స్ ఇవ్వబోమని వర్సిటీ ఉన్నతాధికారులు చెప్పడం వారిని నిరాశకు గురిచేసింది.
మంచినీళ్లు కరువు...
గోల్డ్‌మెడల్ అందుకోవడానికి వివిధ జిల్లాల నుంచి హాజరైన టాపర్లకు వారి కుటుంబసభ్యులతో పాటు పలువురికి మంచినీళ్లు, భోజనం అందించే వారే కరువయ్యా రు. లక్షలాది రూపాయలు వసూలు చేసి అన్నం పెట్టకుం డా ఆకలితో కడుపులు మాడ్చారని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు, విద్యార్థులు, మీడియా వారికి, పోలీసులు, అధ్యాపకులకు భోజనాలు ఒకే దగ్గర పెట్టడంతో దాతలు సైతం ప్లేట్ల కోసం కుస్తీ పట్టాల్సి వచ్చింది. వీసీ అక్బర్‌అలీఖాన్ తన ప్రసంగంలో కేవలం ఇద్దరు దాత పేర్లనే ప్రస్తావించి, మిగిలిన దాతలను విస్మరించడంతో దాతలకు గుర్తింపు లేకుండా పోయింది. దీంతో వారు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
విద్యార్థులు గుర్తు రాలేదా...
కార్యక్రమంలో సగం కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చి అతిథుల ఎదుట వర్సిటీ పరువు పోయినట్లయింది. కుర్చీ లు నిండని స్థితిలోనైనా విద్యార్థులను ఆహ్వానిస్తే నిండుదనం కన్పించేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ప్రస్తుత విద్యార్థుల కోసం కార్యక్రమం నిర్వహిస్తున్న భవనం పక్కనే ఒక టెంటు వేసి ఎల్‌సీడీ ఏర్పా టు చేశారు. అయితే అక్కడ కూర్చుని కార్యక్రమాన్ని చూ సే వారే కరువయ్యారు. స్నాతకోత్సవాన్ని మినిట్స్ టు మి నిట్స్ ప్రకారమే నిర్వహిస్తామని ప్రకటనలు చేసిన అధికారులు వాటిని పాటించలేదనే విమర్శలు ఉన్నాయి. స్నాతకోత్సవం పేరిట లక్షలు వర్సిటీ నిధులను వృథా చేశారని, కేవలం 13 మందికి గోల్డ్ మెడల్స్ అందజేయడానికి ఇంత తంతు అవసరమా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెయూ పరువు గంగ పాలు
Published Fri, Nov 15 2013 5:50 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM
Advertisement