పరీక్షలు వాయిదా వేయాలి
తెయూ(డిచ్‌పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ వీసీ అక్బర్ అలీ ఖాన్ మొండివైఖరిని వీడాలని, సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. బుధవారం వర్సిటీలో పరీక్షలు బహిష్కరించారు. తర్వాత బాలుర హాస్టల్‌నుంచి పరిపాలన భవనం వరకు వీసీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. భవనం వద్ద బైఠాయించి వర్సిటీ అధికారులెవరూ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పరీక్షలు వాయిదా వేయాలంటూ ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్నా వీసీ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. విద్యార్థుల మనోభావాలను పట్టించుకోకుండా పోలీసు బందోబస్తు మధ్య పరీక్షలు నిర్వహిస్తుండడం దారుణమన్నారు.
విద్యార్థుల ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించా రు. గతంలో పరీక్షలు బహిష్కరించాలని పిలుపునిచ్చినవారే మంగళవారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ పరీక్షలు రాయాలని కోరడం సిగ్గు చేటన్నా రు. అలాంటి వారు క్యాంపస్‌లోకి వచ్చినప్పు డు నిలదీయాలని తోటి విద్యార్థులకు సూచిం చారు. పరీక్షలను వాయిదా వేసే వరకు బహిష్కరించడంతో పాటు అందోళనలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఆందోళనలో తెయూ క్యాంపస్ విద్యార్థులతో పాటు నిజామాబాద్‌లోని ప్రభుత్వ గిరిరాజ్ పీజీ కళాశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
కొనసాగిన నిరసనలు
విద్యార్థులు మధ్యాహ్నం తర్వాత పరిపాలనా భవనం వద్ద తమ నిరసన కొనసాగించారు. వసతి గృహం నుంచి వంటకాలను తెప్పించుకొని అక్కడే భోజనాలు చేసి, నిరసన తెలిపారు. పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. క్యాంపస్‌లో రాజకీయాలు చేసే విద్యార్థులు లేరని, విద్యార్థుల తరపున పోరాటం చేసేవారే ఉన్నారని పేర్కొన్నారు. పరీక్షల విషయంలో సందిగ్ధత తొలగేందుకు విద్యార్థులు, ప్రొఫెసర్లతో కమిటీ వేయాలని వారు కోరారు. ఆందోళనల్లో బీఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలవీర్‌ప్రసాద్, ఎన్ ఎస్‌యూఐ వర్సిటీ ఇన్‌చార్జి రమేశ్‌కుమార్, టీఆర్‌ఎస్‌వీ నాయకుడు కిషోర్‌నాయక్, టీజీవీపీ నాయకులు సంతోష్, నాగరాజు, లాల్‌సింగ్, నరేశ్‌కుమార్, చెన్నయ్య, కృష్ణ, జగన్, రాజు తదితరులు పాల్గొన్నారు.
పరీక్షలు రాసింది 60 మంది
తెయూ పరిధిలో బుధవారం 60 మంది పీజీ సెమిస్టర్ పరీక్షలను రాశారని వర్సిటీ అకడమిక్ ఆడిట్ సెల్ డెరైక్టర్ యాదగిరి తెలిపారు. 1,580 మంది పీజీ విద్యార్థులుండగా డిచ్‌పల్లి మెయిన్ క్యాంపస్‌లో 25 మంది, ఆర్మూర్‌లో 35 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని పేర్కొన్నారు. వర్సిటీలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఏడుగురు ఎస్‌ఐలు, 20 మంది కానిస్టేబుళ్లు భద్రత విధుల్లో పాల్గొన్నారు.