తెలుగు తమ్ముళ్ల హల్‌చల్ | Telugu brothers Hulchul | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల హల్‌చల్

Published Thu, Oct 2 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

తెలుగు తమ్ముళ్ల హల్‌చల్

తెలుగు తమ్ముళ్ల హల్‌చల్

తాడేపల్లి రూరల్
 డ్వాక్రా మహిళల సమావేశంలో తెలుగుతమ్ముళ్లు హల్‌చల్ సృష్టించారు. మినిట్స్ బుక్ లాక్కున్నారు. ఫొటోలు, వీడియోలు తీశారు. ఆ తమ్ముళ్లను ఏమంటే ఏమవుతుందోనని సమావేశం నిర్వహిస్తున్న అధికారి సైతం మిన్నకుండిపోయారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో బుధవారం జరిగిన ఈ సంఘటనతో డ్వాక్రా సంఘాలు భయాందోళన చెందారు.

వివరాల్లోకి వెళితే...
 ఉండవల్లి ఇసుక క్వారీని ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు కేటాయించింది. దీని నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు ఉండవల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో డీఆర్‌డీఏ అడిషనల్ ప్రాజెక్టు డెరైక్టర్ డాక్టర్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు.
 
  ఇందుకోసం డ్వాక్రా గ్రూపుల నుంచి ముగ్గురు మహిళలను ఎంపిక చేయాలనే అంశంపై సుదీర్ఘ చర్చ జరుగుతుండగా, హఠాత్తుగా అక్కడ తెలుగుతమ్ముళ్లు ప్రత్యక్ష్యమయ్యారు.
 
  సమావేశం కొనసాగడానికి వీల్లేదని అడ్డుతగిలారు. అంతటితో ఆగక మినిట్స్ బుక్ ఇష్టానుసారం రాసుకుంటే కుదరదంటూ, తాము చెప్పిందే రాయాలని పట్టుబట్టారు. ఫొటోలు వీడియోలు తీశారు. చివరకు తెలుగు తమ్ముళ్లే తీర్మానాలు రాయించి, చదివి వినిపించారు. ఉండవల్లి గ్రామంలో 80 గ్రూపుల వరకు డ్వాక్రా మహిళలు ఉన్నారని, ఇసుక క్వారీ పర్యవేక్షణకు ఎవరిని ఎంపిక చేస్తారంటూ హడావుడి చేశారు.
 
  ప్రభుత్వ అధికారి అధ్యక్షతన జరుగుతున్న  సమావేశంలో అనుమతి లేకుండా తెలుగుతమ్ముళ్లు ప్రవేశించడం, ఇష్టానుసారంగా వ్యవహరించడంతో  మహిళలకు ఇబ్బందికరంగా మారింది. ఏం చేయాలోపాలుపోక మహిళలు, అధికారి ప్రేక్షకపాత్ర వహించారు.
 
  వీడియో తీశాం, మీరు మాట్లాడిందీ రికార్డు చేశాం, ఏం చేయాలో మాకు తెలు సంటూ తెలుగుతమ్ముళ్లు చివరకు అక్కడ నుంచి వెళ్లిపోయారు.
 
  కాగా, ప్రభుత్వం కేటాయించిన ఇసుక క్వారీ పర్యవేక్షక బాధ్యతలను తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలకు అప్పగించే వ్యూహంలో భాగంగానే తెలుగుతమ్ముళ్లు ఈ సమావేశంలో గందరగోళం సృష్టించారని తెలుస్తోంది.
 
  మినిట్స్ బుక్‌లో ఉండవల్లి సెంటర్ నుంచి ఇసుక క్వారీ వరకు రోడ్డు వెడల్పు చేయించాలని, గుంటూరు కెనాల్ పై కొత్త బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ తీర్మానాలు రాయించారు. ఇలా రాయించడం వల్ల ఇసుక క్వారీ బాధ్యతల నిర్వహణకు డ్వాక్రా సంఘాలు ముందుకు రావని, తద్వారా తమ పార్టీ మహిళలకే క్వారీ బాధ్యతలు దక్కేలా చేసుకోవచ్చనే వ్యూహంలో భాగంగానే తెలుగుతమ్ముళ్లు హల్‌చల్ సృష్టించినట్టు అర్థమవుతోందని అక్కడ వున్న పలువురు మహిళలు వ్యాఖ్యానించారు.
 
  ఇదిలావుండగా, తెలుగుతమ్ముళ్ల స్పీడ్‌కు ఆ పార్టీ ప్రజాప్రతినిధులే కారణమంటూ పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తమ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్ అంటూ సాక్షాత్తూ వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొద్ది రోజుల క్రితం పెనుమాకలో జరిగిన బహిరంగ సభలో హెచ్చరించారు. అధికారులు సైతం తమ కార్యకర్తలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందేనంటూ ఆయన ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు.
 
  ఇలా తెలుగుదేశం పార్టీ నేతలు, మంత్రులు వారి సమావేశాల్లో హెచ్చరికలు జారీ చేస్తుండడంతో తెలుగుతమ్ముళ్ల స్పీడు మరింత జోరందుకుంది. ఈ క్రమంలోనే అధికారిక సమావేశాల్లో సైతం జొరబడి తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement