తెలుగు తమ్ముళ్ల ఆత్మఘోష
పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు.. అధికారంలోకి ఎప్పుడు వస్తామా అని కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూశారు. ఎన్నికలు రానే వచ్చాయి. తర్వాత సైకిల్ పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఇంకేముంది 'తముళ్ల'లో ఆనందం తాండవమాడింది. అయితే ఈ ఆనందం క్రమక్రమంగా ఆవిరైపోతుంది. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవారిని వదిలి ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతలకు అధినాయకుడు పెద్దపీట వేయడం 'పాతతరం' నేతలకు మింగుడు పడటం లేదు. దాంతో తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తితో రగలిపోతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవహారమే ఇందుకు ఉదాహరణ.
గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో, పార్టీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన పరిస్థితి తారుమారైంది. ప్రస్తుతం టీడీపీలోనే కాదు జిల్లా రాజకీయాల్లో కూడా ఆయన హవా దాదాపుగా తగ్గిపోయింది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో అదే జిల్లాకు చెందిన మంత్రి పి. నారాయణ అన్నీ తానై వ్యవహరిస్తుండడంతో సోమిరెడ్డి వెనుకబడిపోయారు. ఎమ్మెల్యేగా నెగ్గకపోయినా ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. అంతేకాదు రాజధాని ఎంపికపై ప్రభుత్వం నియమించిన కమిటీకి ఆయనను అధ్యక్షుడిని చేశారు.
మరోవైపు నెల్లూరు జిల్లాకే చెందిన కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రులు ఆనం సోదరులు నేడే రేపో పచ్చ తీర్థం పుచ్చుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆనం సోదరులు కూడా పార్టీలో చేరితే తన పరిస్థితి ఎలా వుంటుందోనని సోమిరెడ్డి ఆందోళన చెందుతున్నారు. అటు అధినేత ఆదరణ కూడా కరువవడంతో సోమిరెడ్డి హడలిపోతున్నారు. ఇటీవల జిల్లాకు చెందిన నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా జిల్లాలో తన పరిస్థితిని సోమిరెడ్డి... చంద్రబాబు ముందు ఏకరువు పెట్టినా ఆయనకు ఊరట లభించలేదు(ట). జిల్లాలో మొత్తం 10 స్థానాల్లో కేవలం మూడు స్థానాల్లోనే పచ్చ జెండా రెపరెపలాడిందంటూ బాబు... సోమిరెడ్డికి క్లాస్ తీసుకున్నారని సమాచారం. దాంతో సోమిరెడ్డి మరింత డీలా పడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్వేపల్లి శాసనసభ నుంచి పోటీ చేసి 5 వేల ఓట్ల తేడాతో సోమిరెడ్డి ఓటమిపాలైన ఆయనకు పార్టీలలోనూ ఊరట దక్కడం లేదు. పలు జిల్లాల్లో సీనియర్ నాయకుల 'ఆత్మఘోష' ఇలాగే ఉందన్న గుసగుసలు విన్పిస్తున్నాయి.