Telugu Tammullu
-
‘తెల్ల’ దొరలు.. ఈ తెలుగు తమ్ముళ్లు
-
‘తెల్ల’ దొరలు.. ఈ తెలుగు తమ్ముళ్లు
రూ.కోట్ల నల్లధనం తెల్లధనంగా మార్పిడి కాల్‌మనీ, ఇసుక, లిక్కర్ డబ్బు మార్చేందుకు టార్గెట్లు రైతులు, చిరు వ్యాపారులకు తిప్పలు బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు నల్లధనం మార్పిడికి ఆశ్రయిస్తున్న బడా వ్యాపారులు రూ. 500 కోట్లు నల్లధనాన్ని మార్చిన మంత్రి! సాక్షి, అమరావతి: అమాత్యులు, అధికార పార్టీ ముఖ్య నేతలు తమ అధికార దర్పాన్ని వినియోగించి కూడబెట్టిన నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు అన్ని వర్గాలకు టార్గెట్లు విధిస్తున్నారు. కాల్‌మనీ, ఇసుక, లిక్కర్ వ్యాపారాల్లో అక్రమంగా కూడబెట్టిన సొమ్మును పెద్ద ఎత్తున తెల్లధనంగా మారుస్తున్నారు. నిత్యావసర వ్యాపారాల్లోనూ తమ ‘చిల్లర’ దందా నిర్వహించడంతో రైతులు, చిరు వ్యాపారులకు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా ఏపీ రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు, వారి అనుచర గణం పెద్ద నోట్ల మార్పిడి ఓ వ్యాపారంలా సాగిస్తుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు తమ చేతికి మట్టి అంటకుండా తమ వద్ద ఉన్న నల్లధనం తెల్లధనంగా మారిపోతూ ఉండటంతో వ్యాపారస్తులు కూడా బ్యాంకు మెట్లు ఎక్కకుండా వీరిద్వారా నోట్లు మార్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ** గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ ముఖ్య నేత కుమారుడు, కుమార్తె బరితెగించి సాగిస్తున్న ’చిల్లర’ దందాకు వ్యాపార వర్గాలు హడలెత్తిపోతున్నాయి. తమ వద్ద ఉన్న రూ.కోట్ల నగదు మార్పిడికి ఆ ముఖ్య నేత కుమార్తె ఏకంగా మందుల షాపులను ఎంపిక చేసుకుని మరీ టార్గెట్లు విధించారు. పెద్ద షాపునకు రూ.5 లక్షలు, చిన్న షాపునకు రూ.2 లక్షలు మార్చాలని హుకుం జారీ చేయడంతో మందుల షాపుల నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న కుమారుడు పలు వ్యాపార రంగాలకు చెందిన వ్యాపారాలు చేసే వారు ఎన్ని కోట్లు తెచ్చినా మార్చి 20 శాతం తగ్గించి కొత్తనోట్లు ఇప్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఓ మిల్క్ కంపెనీ వాహనాల్లో చెన్నై తరలించి నోట్ల మార్పిడి చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ** జిల్లాకు చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే ఏకంగా డెయిరీ పార్లర్లలో నగదు మార్పిడి చేస్తున్నారు. పాల రైతుల నుంచి సేకరించిన చిన్న నోట్లను తీసుకుని పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయిస్తున్నారు. ** పల్నాడు ప్రాంతానికి చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే తన ఇంట వివాహానికి భారీగా ఖర్చు చేస్తున్నారు. మద్యం షాపులు, ఆర్టీసీ డిపోలను నగదు మార్పిడి కేంద్రాలుగా ఎంచుకున్నారు. అంత పెద్ద మొత్తంలో నగదు ఎలా ఖర్చు చేస్తున్నారనేది సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ** ఇదే జిల్లాకు చెందిన ఓ అమాత్యుడు ఏకంగా సహకార సంఘాలను, విత్తన విక్రయ కేంద్రాలను ఎంచుకుని నగదు భారీగా మార్పిడి చేస్తున్నారు. సదరు అమాత్యుడి సతీమణి తమ వల్ల లబ్ధి పొందిన వారందరినీ పిలిపించి నగదు మార్పిడి వ్యవహారాలను అప్పగిస్తున్నారని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానించడం గమనార్హం. ** కృష్ణా జిల్లాకు చెందిన ఒక మంత్రి, ఆయన అనుచరులు లిక్కర్ సిండికేట్లతో తమకు ఉన్న పరిచయాలను ఉయోగించుకుని పెద్దనోట్లు పెద్ద ఎత్తున 20 శాతం కమీషన్‌కు మార్చుతున్నట్లు తెలిసింది. కోట్లలో నల్లధనం ఉన్న లిక్కర్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీరిని సంప్రదిస్తున్నారు. ** విజయవాడ నగరంలో ఎంతో హుందాగా కనపడే ఒక ప్రజాప్రతినిధి కార్యాలయమే నోట్లు మార్పిడికి కేంద్రంగా మారిందని తెలిసింది. ఆయన అనుచరులు 22 శాతం కమీషన్ తీసుకుని పాత నోట్లు మార్చి కొత్త నోట్లు ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకర్లతో ఒప్పందాలు కుదుర్చుకుని ఈ వ్యాపారం జోరుగా సాగిస్తున్నట్లు తెలిసింది. ** ప్రభుత్వ స్థలాలు, పార్కులు ఆక్రమణ, కాల్‌మనీ, ఇసుక సిండికేట్లతో పాటు ప్రతి వ్యాపారంలోనూ తలదూర్చడంలో దిట్టగా పేరు పొందిన ఒక ప్రజాప్రతినిధి అనుచరులు పాత నోట్లు మార్చడంతో బిజీబిజీగా వున్నారు. ఇసుక సిండికేట్ల వద్ద ఉన్న నల్లధనాన్ని మొత్తం కొత్త నోట్లగా మార్చే బాధ్యతల్ని వీరు భుజానికి ఎత్తుకున్నట్లు తెలిసింది. ** ఒక ప్రజాప్రతినిధి కార్యాలయంలో పనులు చక్కదిద్దే మరో నేత వన్‌టౌన్ లోని ఒక మార్వాడీ వ్యాపారితో ఒప్పందం పెట్టుకుని హవాలా, వడ్డీవ్యాపారస్తుల వద్ద పెద్ద నోట్లు తెల్లనోట్లుగా మార్చే పనిలో బిజీబిజీగా వున్నారు. 500 కోట్లు నల్లధనాన్ని మార్చిన మంత్రి! రాజధాని ప్రాంతంలోని ఓ కీలక మంత్రి, ఆయన ముఖ్య అనుచరులు గత రెండు వారాల్లో రూ.500 కోట్ల మేర పాత నోట్లను మార్చుకున్నారని అత్యంత విశ్వసనీయ సమాచారం. ‘మాది పెద్ద శాఖ. కోట్లలో పనులు జరుగుతుంటాయి. శాఖలోని డబ్బులతో పాటు సంస్థలకు చెప్పి మీ బ్యాంకు శాఖల్లో డిపాజిట్లు పెద్ద ఎత్తున చేయిస్తాం. రద్దయిన మా పెద్దనోట్లను మార్చి కొత్త నోట్లు ఇవ్వండి...’ అని చెప్పి, రెండు బ్యాంకుల్లో పనిచేసే కీలక అధికారుల సాయంతో ఈ మార్పిడి చేసినట్లు తెలుస్తోంది. ఆ మంత్రికి మద్యం సిండికేట్‌తో అనేక లాలూచీలు ఉన్నాయనే ఆరోపణలు టీడీపీ నేతల నుంచే వినిపిస్తుంటాయి. మంత్రితో పాటు పార్టీ నేతలు ఓ ప్రభుత్వ, ఓ ప్రైవేటు బ్యాంకు అధికారులతో మంతనాలు జరిపి తమ వద్ద పాత నోట్లను మార్చుకున్నట్లు సమాచారం. నోట్లు మార్చుకున్న టీడీపీ నేతలు కూడా తమకు పరిచయం ఉన్న పరిశ్రమలకు చెందిన కరెంటు, సేవింగ్స్ ఎకౌంట్లను మీ బ్యాంకులకు మార్పిస్తామని, వ్యాపారులు కూడా మీ వైపు మళ్లేలా చూస్తామని హామీనివ్వటంతో వారు కూడా అంగీకరించారని తెలిసింది. -
పోలీసులపై తెలుగు తమ్ముళ్ల దాడి
నూజివీడు: అధికారంలో ఉన్నామనే అహంకారంతో కృష్ణాజిల్లాలో తెలుగు తమ్ముళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఆగిరిపల్లిలో పోలీసులపై దాడికి తెగబడ్డారు. టీడీపీ చెందిన రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేయాలని పోలీసులు చెప్పడంతో తమ్ముళ్లకు ఆగ్రహం వచ్చింది. ఆగిరిపల్లి ఎస్ఐ రాజేంద్రప్రసాద్ తమను స్టేషన్‌కు రమ్మంటారా అని రౌడీషీటర్లు శ్రావణ్ కుమార్, నవీన్ వీరంగం సృష్టించారు. టీడీపీ నాయకుడు పాలేటి ఉమా మహేశ్వరరావు అలియాస్ పింకీ నేతృత్వంలో 20 మంది కలిసి మారణాయుధాలతో పోలీసులపై దాడి చేశారు. ఎస్ఐ రాజేంద్రప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ సతీష్ కుమార్, కానిస్టేబుల్ వెంకటేశ్వరరావుపై నడిరోడ్డుపైనే దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ఆగిరిపల్లి బయల్దేరి వెళ్లారు. ఉమామహేశ్వరరావు మండవల్లిలో రౌడీషీటర్ అని, భూకబ్జాలు.. సెటిల్మెంట్లు చేసే అతడిపై చాలా కేసులు ఉన్నాయని ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. తాను వచ్చాక అడ్డుకోవడంతో తనమీద కక్ష పెంచుకున్నారని చెప్పారు. ట్రాఫిక్ పరిస్థితిని సమీక్షిస్తూ.. స్టేషన్‌కు వచ్చి వాళ్లను సమాచారం ఇవ్వాలని కోరగా, 'మేం రౌడీషీటర్లమని నువ్వెవడురా చెప్పడానికి' అంటూ బూతులు తిట్టారని, దీనిపై తాను తన ఉన్నతాధికారులకు చెప్పానని ఎస్ఐ అన్నారు. తర్వాత పాలేటి ఉమా కారులో మారణాయుధాలు తీసుకుని వచ్చి తనపై దాడికి ప్రయత్నించాడని తెలిపారు. దాడిలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయన్నారు. -
తెలుగు తమ్ముళ్ల హల్చల్
తాడేపల్లి రూరల్ డ్వాక్రా మహిళల సమావేశంలో తెలుగుతమ్ముళ్లు హల్చల్ సృష్టించారు. మినిట్స్ బుక్ లాక్కున్నారు. ఫొటోలు, వీడియోలు తీశారు. ఆ తమ్ముళ్లను ఏమంటే ఏమవుతుందోనని సమావేశం నిర్వహిస్తున్న అధికారి సైతం మిన్నకుండిపోయారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో బుధవారం జరిగిన ఈ సంఘటనతో డ్వాక్రా సంఘాలు భయాందోళన చెందారు. వివరాల్లోకి వెళితే... ఉండవల్లి ఇసుక క్వారీని ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు కేటాయించింది. దీని నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు ఉండవల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో డీఆర్డీఏ అడిషనల్ ప్రాజెక్టు డెరైక్టర్ డాక్టర్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకోసం డ్వాక్రా గ్రూపుల నుంచి ముగ్గురు మహిళలను ఎంపిక చేయాలనే అంశంపై సుదీర్ఘ చర్చ జరుగుతుండగా, హఠాత్తుగా అక్కడ తెలుగుతమ్ముళ్లు ప్రత్యక్ష్యమయ్యారు. సమావేశం కొనసాగడానికి వీల్లేదని అడ్డుతగిలారు. అంతటితో ఆగక మినిట్స్ బుక్ ఇష్టానుసారం రాసుకుంటే కుదరదంటూ, తాము చెప్పిందే రాయాలని పట్టుబట్టారు. ఫొటోలు వీడియోలు తీశారు. చివరకు తెలుగు తమ్ముళ్లే తీర్మానాలు రాయించి, చదివి వినిపించారు. ఉండవల్లి గ్రామంలో 80 గ్రూపుల వరకు డ్వాక్రా మహిళలు ఉన్నారని, ఇసుక క్వారీ పర్యవేక్షణకు ఎవరిని ఎంపిక చేస్తారంటూ హడావుడి చేశారు. ప్రభుత్వ అధికారి అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో అనుమతి లేకుండా తెలుగుతమ్ముళ్లు ప్రవేశించడం, ఇష్టానుసారంగా వ్యవహరించడంతో మహిళలకు ఇబ్బందికరంగా మారింది. ఏం చేయాలోపాలుపోక మహిళలు, అధికారి ప్రేక్షకపాత్ర వహించారు. వీడియో తీశాం, మీరు మాట్లాడిందీ రికార్డు చేశాం, ఏం చేయాలో మాకు తెలు సంటూ తెలుగుతమ్ముళ్లు చివరకు అక్కడ నుంచి వెళ్లిపోయారు. కాగా, ప్రభుత్వం కేటాయించిన ఇసుక క్వారీ పర్యవేక్షక బాధ్యతలను తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలకు అప్పగించే వ్యూహంలో భాగంగానే తెలుగుతమ్ముళ్లు ఈ సమావేశంలో గందరగోళం సృష్టించారని తెలుస్తోంది. మినిట్స్ బుక్‌లో ఉండవల్లి సెంటర్ నుంచి ఇసుక క్వారీ వరకు రోడ్డు వెడల్పు చేయించాలని, గుంటూరు కెనాల్ పై కొత్త బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ తీర్మానాలు రాయించారు. ఇలా రాయించడం వల్ల ఇసుక క్వారీ బాధ్యతల నిర్వహణకు డ్వాక్రా సంఘాలు ముందుకు రావని, తద్వారా తమ పార్టీ మహిళలకే క్వారీ బాధ్యతలు దక్కేలా చేసుకోవచ్చనే వ్యూహంలో భాగంగానే తెలుగుతమ్ముళ్లు హల్చల్ సృష్టించినట్టు అర్థమవుతోందని అక్కడ వున్న పలువురు మహిళలు వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, తెలుగుతమ్ముళ్ల స్పీడ్‌కు ఆ పార్టీ ప్రజాప్రతినిధులే కారణమంటూ పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తమ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్ అంటూ సాక్షాత్తూ వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొద్ది రోజుల క్రితం పెనుమాకలో జరిగిన బహిరంగ సభలో హెచ్చరించారు. అధికారులు సైతం తమ కార్యకర్తలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందేనంటూ ఆయన ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇలా తెలుగుదేశం పార్టీ నేతలు, మంత్రులు వారి సమావేశాల్లో హెచ్చరికలు జారీ చేస్తుండడంతో తెలుగుతమ్ముళ్ల స్పీడు మరింత జోరందుకుంది. ఈ క్రమంలోనే అధికారిక సమావేశాల్లో సైతం జొరబడి తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. -
తెలుగు తమ్ముళ్ల ఆత్మఘోష
పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు.. అధికారంలోకి ఎప్పుడు వస్తామా అని కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూశారు. ఎన్నికలు రానే వచ్చాయి. తర్వాత సైకిల్ పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఇంకేముంది 'తముళ్ల'లో ఆనందం తాండవమాడింది. అయితే ఈ ఆనందం క్రమక్రమంగా ఆవిరైపోతుంది. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవారిని వదిలి ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతలకు అధినాయకుడు పెద్దపీట వేయడం 'పాతతరం' నేతలకు మింగుడు పడటం లేదు. దాంతో తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తితో రగలిపోతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో, పార్టీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన పరిస్థితి తారుమారైంది. ప్రస్తుతం టీడీపీలోనే కాదు జిల్లా రాజకీయాల్లో కూడా ఆయన హవా దాదాపుగా తగ్గిపోయింది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో అదే జిల్లాకు చెందిన మంత్రి పి. నారాయణ అన్నీ తానై వ్యవహరిస్తుండడంతో సోమిరెడ్డి వెనుకబడిపోయారు. ఎమ్మెల్యేగా నెగ్గకపోయినా ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. అంతేకాదు రాజధాని ఎంపికపై ప్రభుత్వం నియమించిన కమిటీకి ఆయనను అధ్యక్షుడిని చేశారు. మరోవైపు నెల్లూరు జిల్లాకే చెందిన కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రులు ఆనం సోదరులు నేడే రేపో పచ్చ తీర్థం పుచ్చుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆనం సోదరులు కూడా పార్టీలో చేరితే తన పరిస్థితి ఎలా వుంటుందోనని సోమిరెడ్డి ఆందోళన చెందుతున్నారు. అటు అధినేత ఆదరణ కూడా కరువవడంతో సోమిరెడ్డి హడలిపోతున్నారు. ఇటీవల జిల్లాకు చెందిన నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో తన పరిస్థితిని సోమిరెడ్డి... చంద్రబాబు ముందు ఏకరువు పెట్టినా ఆయనకు ఊరట లభించలేదు(ట). జిల్లాలో మొత్తం 10 స్థానాల్లో కేవలం మూడు స్థానాల్లోనే పచ్చ జెండా రెపరెపలాడిందంటూ బాబు... సోమిరెడ్డికి క్లాస్ తీసుకున్నారని సమాచారం. దాంతో సోమిరెడ్డి మరింత డీలా పడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్వేపల్లి శాసనసభ నుంచి పోటీ చేసి 5 వేల ఓట్ల తేడాతో సోమిరెడ్డి ఓటమిపాలైన ఆయనకు పార్టీలలోనూ ఊరట దక్కడం లేదు. పలు జిల్లాల్లో సీనియర్ నాయకుల 'ఆత్మఘోష' ఇలాగే ఉందన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. -
తెలుగు తమ్ముళ్లు
-
బాబు ఇంటి ముందు మల్కాజ్గిరి తమ్ముళ్ల ఆందోళన