‘తెల్ల’ దొరలు.. ఈ తెలుగు తమ్ముళ్లు | Andhra Pradesh Minister exchange 500 crore old currency | Sakshi
Sakshi News home page

‘తెల్ల’ దొరలు.. ఈ తెలుగు తమ్ముళ్లు

Published Fri, Nov 25 2016 8:14 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

‘తెల్ల’ దొరలు.. ఈ తెలుగు తమ్ముళ్లు - Sakshi

‘తెల్ల’ దొరలు.. ఈ తెలుగు తమ్ముళ్లు

రూ.కోట్ల నల్లధనం తెల్లధనంగా మార్పిడి
కాల్‌మనీ, ఇసుక, లిక్కర్‌ డబ్బు మార్చేందుకు టార్గెట్లు
రైతులు, చిరు వ్యాపారులకు తిప్పలు
బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు
నల్లధనం మార్పిడికి ఆశ్రయిస్తున్న బడా వ్యాపారులు
రూ. 500 కోట్లు నల్లధనాన్ని మార్చిన మంత్రి!


సాక్షి, అమరావతి: అమాత్యులు, అధికార పార్టీ ముఖ్య నేతలు తమ అధికార దర్పాన్ని వినియోగించి కూడబెట్టిన నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు అన్ని వర్గాలకు టార్గెట్లు విధిస్తున్నారు. కాల్‌మనీ, ఇసుక, లిక్కర్‌ వ్యాపారాల్లో అక్రమంగా కూడబెట్టిన సొమ్మును పెద్ద ఎత్తున తెల్లధనంగా మారుస్తున్నారు. నిత్యావసర వ్యాపారాల్లోనూ తమ ‘చిల్లర’ దందా నిర్వహించడంతో రైతులు, చిరు వ్యాపారులకు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా ఏపీ రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు, వారి అనుచర గణం పెద్ద నోట్ల మార్పిడి ఓ వ్యాపారంలా సాగిస్తుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు తమ చేతికి మట్టి అంటకుండా తమ వద్ద ఉన్న నల్లధనం తెల్లధనంగా మారిపోతూ ఉండటంతో వ్యాపారస్తులు కూడా బ్యాంకు మెట్లు ఎక్కకుండా వీరిద్వారా నోట్లు మార్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

**  గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ ముఖ్య నేత కుమారుడు, కుమార్తె బరితెగించి సాగిస్తున్న ’చిల్లర’ దందాకు వ్యాపార వర్గాలు హడలెత్తిపోతున్నాయి. తమ వద్ద ఉన్న రూ.కోట్ల నగదు మార్పిడికి ఆ ముఖ్య నేత కుమార్తె ఏకంగా మందుల షాపులను ఎంపిక చేసుకుని మరీ టార్గెట్లు విధించారు. పెద్ద షాపునకు రూ.5 లక్షలు, చిన్న షాపునకు రూ.2 లక్షలు మార్చాలని హుకుం జారీ చేయడంతో మందుల షాపుల నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న కుమారుడు పలు వ్యాపార రంగాలకు చెందిన వ్యాపారాలు చేసే వారు ఎన్ని కోట్లు తెచ్చినా మార్చి 20 శాతం తగ్గించి కొత్తనోట్లు ఇప్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఓ మిల్క్‌ కంపెనీ వాహనాల్లో చెన్నై తరలించి నోట్ల మార్పిడి చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

** జిల్లాకు చెందిన మరో సీనియర్‌ ఎమ్మెల్యే ఏకంగా డెయిరీ పార్లర్‌లలో నగదు మార్పిడి చేస్తున్నారు. పాల రైతుల నుంచి సేకరించిన చిన్న నోట్లను తీసుకుని పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయిస్తున్నారు.

**  పల్నాడు ప్రాంతానికి చెందిన మరో సీనియర్‌ ఎమ్మెల్యే తన ఇంట వివాహానికి భారీగా ఖర్చు చేస్తున్నారు. మద్యం షాపులు, ఆర్టీసీ డిపోలను నగదు మార్పిడి కేంద్రాలుగా ఎంచుకున్నారు. అంత పెద్ద మొత్తంలో నగదు ఎలా ఖర్చు చేస్తున్నారనేది సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

**  ఇదే జిల్లాకు చెందిన ఓ అమాత్యుడు ఏకంగా సహకార సంఘాలను, విత్తన విక్రయ కేంద్రాలను ఎంచుకుని నగదు భారీగా మార్పిడి చేస్తున్నారు. సదరు అమాత్యుడి సతీమణి తమ వల్ల లబ్ధి పొందిన వారందరినీ పిలిపించి నగదు మార్పిడి వ్యవహారాలను అప్పగిస్తున్నారని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానించడం గమనార్హం.

**  కృష్ణా జిల్లాకు చెందిన ఒక మంత్రి, ఆయన అనుచరులు లిక్కర్‌ సిండికేట్లతో తమకు ఉన్న పరిచయాలను ఉయోగించుకుని పెద్దనోట్లు పెద్ద ఎత్తున 20 శాతం కమీషన్‌కు మార్చుతున్నట్లు తెలిసింది. కోట్లలో నల్లధనం ఉన్న లిక్కర్, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తులు వీరిని
సంప్రదిస్తున్నారు.

**  విజయవాడ నగరంలో ఎంతో హుందాగా కనపడే ఒక ప్రజాప్రతినిధి కార్యాలయమే నోట్లు మార్పిడికి కేంద్రంగా  మారిందని తెలిసింది. ఆయన అనుచరులు  22  శాతం కమీషన్‌ తీసుకుని పాత నోట్లు మార్చి కొత్త నోట్లు ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకర్లతో ఒప్పందాలు కుదుర్చుకుని ఈ వ్యాపారం జోరుగా సాగిస్తున్నట్లు తెలిసింది.

**  ప్రభుత్వ స్థలాలు, పార్కులు ఆక్రమణ, కాల్‌మనీ,  ఇసుక సిండికేట్లతో పాటు ప్రతి వ్యాపారంలోనూ తలదూర్చడంలో దిట్టగా పేరు పొందిన ఒక ప్రజాప్రతినిధి అనుచరులు పాత నోట్లు మార్చడంతో బిజీబిజీగా వున్నారు. ఇసుక సిండికేట్ల వద్ద  ఉన్న నల్లధనాన్ని మొత్తం కొత్త నోట్లగా మార్చే బాధ్యతల్ని వీరు భుజానికి ఎత్తుకున్నట్లు తెలిసింది.

**  ఒక ప్రజాప్రతినిధి కార్యాలయంలో పనులు చక్కదిద్దే  మరో నేత వన్‌టౌన్‌ లోని ఒక మార్వాడీ వ్యాపారితో ఒప్పందం పెట్టుకుని హవాలా, వడ్డీవ్యాపారస్తుల వద్ద పెద్ద నోట్లు తెల్లనోట్లుగా మార్చే పనిలో బిజీబిజీగా వున్నారు.

500 కోట్లు నల్లధనాన్ని మార్చిన మంత్రి!
రాజధాని ప్రాంతంలోని ఓ కీలక మంత్రి, ఆయన ముఖ్య అనుచరులు గత రెండు వారాల్లో రూ.500 కోట్ల మేర పాత నోట్లను మార్చుకున్నారని అత్యంత విశ్వసనీయ సమాచారం. ‘మాది పెద్ద శాఖ. కోట్లలో పనులు జరుగుతుంటాయి. శాఖలోని డబ్బులతో పాటు సంస్థలకు చెప్పి మీ బ్యాంకు శాఖల్లో డిపాజిట్లు పెద్ద ఎత్తున చేయిస్తాం. రద్దయిన మా పెద్దనోట్లను మార్చి కొత్త నోట్లు ఇవ్వండి...’ అని చెప్పి, రెండు బ్యాంకుల్లో పనిచేసే కీలక అధికారుల సాయంతో ఈ మార్పిడి చేసినట్లు తెలుస్తోంది.

ఆ మంత్రికి మద్యం సిండికేట్‌తో అనేక లాలూచీలు ఉన్నాయనే ఆరోపణలు టీడీపీ నేతల నుంచే వినిపిస్తుంటాయి. మంత్రితో పాటు పార్టీ నేతలు ఓ ప్రభుత్వ, ఓ ప్రైవేటు బ్యాంకు అధికారులతో మంతనాలు జరిపి తమ వద్ద పాత నోట్లను మార్చుకున్నట్లు సమాచారం. నోట్లు మార్చుకున్న టీడీపీ నేతలు కూడా తమకు పరిచయం ఉన్న పరిశ్రమలకు చెందిన కరెంటు, సేవింగ్స్‌ ఎకౌంట్‌లను మీ బ్యాంకులకు మార్పిస్తామని, వ్యాపారులు కూడా మీ వైపు మళ్లేలా చూస్తామని హామీనివ్వటంతో వారు కూడా అంగీకరించారని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement