వీధినపడ్డ ‘తెలుగు’ తమ్ముళ్లు
- నూజివీడులో ముదురుతున్న రగడ
- ఎంపీ వ్యాఖ్యలతో ముద్దరబోయిన వర్గం ఆగ్రహం
- అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయిన ‘దేశం’
నూజివీడు : నియోజకవర్గంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలుగు తమ్ముళ్ల అంతర్గత విభేధాలు ఎంపీ మాగంటి బాబు వ్యాఖ్యలతో బట్టబయలయ్యాయి. టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నిట్టనిలువునా చీలి పోయారు.
ముద్దరబోయినను ఇన్‌చార్జిగా ఎవరు నియమించారని ఆయన వ్యతిరేకవర్గం ప్రశ్నిస్తుండగా, ఓడిపోయిన అభ్యర్థే నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉండే ఆచారం తెలుగుదేశంపార్టీ పుట్టిన నాటి నుంచి కొనసాగుతోందని అనుకూలవర్గం వాదిస్తోంది. ఇప్పటివరకు చాపకింద నీరులా ఉన్న విభేదాలు, సోమవారం నూజివీడు వచ్చిన ఏలూరు ఎంపీ మాగంటి బాబు వ్యాఖ్యలతో ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ఇప్పటివరకు ఎవరినీ నియమించలేదని స్పష్టం చేయడంతో ముద్దరబోయిన వర్గానికి పుండుమీద కారం చల్లినట్లయింది.
టీడీపీకి నూజివీడు అభ్యర్థిగా ముద్దరబోయిన వెంకటేశ్వరరావును చంద్రబాబు ప్రకటించిన నాటి నుంచి నియోజకవర్గంలోని ఒక వర్గం నాయకులు బహిరంగంగానే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ వర్గం ఎన్నికల్లో టీడీపీకి పనిచేయలేదనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. ముద్దరబోయిన, ఈ వర్గం నాయకులు పలు కార్యక్రమాల్లో కలసి పాల్గొన్నప్పటికీ ముభావంగానే ఉండేవారు.
ఎన్నికల్లో ఓటమి పాలైన ముద్దరబోయిన నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతాడని ఈ వర్గం భావించింది. అయితే అందుకు విరుద్ధంగా ముద్దరబోయిన ఇక్కడే ఉండి పార్టీ కార్యక్రమాల కోసం తనవంతు పనిచేస్తుండడంతో జీర్ణించుకోలేని నాయకులు ఎలాగైనా పొమ్మనకుండానే పొగబెట్టి ఇక్కడి నుంచి పంపించేయాలనే లక్ష్యంతో ఇటీవల కొద్ది రోజుల నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జిగా చంద్రబాబు ఎవరినీ నియమించలేదనే ప్రచారాన్ని సాగిస్తున్నారు.
ఇదే విషయాన్ని ఎంపీ స్వయంగా ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమై నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై పార్టీలోని బీసీ నాయకులు మండిపడుతున్నారు. కావాలనే బీసీ నాయకుడైన ముద్దరబోయినను ఇక్కడి నుంచి ఎలాగైనా పంపించేయాలని పలు కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై కొంతమంది బీసీ నాయకులు ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదులు పంపినట్లు తెలుస్తోంది. గతంలోనూ అప్పటి ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్యను సైతం ఇలాగే పొమ్మనకుండా పొగబెట్టి పార్టీలో నుంచి బయటకు వెళ్లిపోయే వరకు నిద్రపోలేదని, అదే తరహాలో ఇప్పుడూ చేయాలని చూస్తున్నారని బీసీనాయకులు అంటున్నారు.రాబోయే రోజుల్లో పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనంటున్నారు.