ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన కుసుమంచి వేణుగోపాల్ను సముదాయిస్తున్న బీజేపీ నాయకులు
బీజేపీ, టీడీపీల మధ్య ‘పొత్తు’ పొడవకుండానే జిల్లాలో ఇరుపార్టీల నేతలు అధిష్టానాలపై కత్తులు నూరుతున్నారు. పొత్తు కుదిరితే జిల్లాలో పిఠాపురం, రాజోలు సీట్లు బీజేపీకి విడిచి పెట్టడానికి చంద్రబాబు ‘సై’ అంటున్నారు. వాటితో పాటు పెద్దాపురం, కాకినాడ సిటీ స్థానాలు, కాకినాడ పార్లమెంటు స్థానం ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది. ఈ వ్యవహారంలో బాబు ఎత్తులపై ఇరుపార్టీల నేతల్లో నిరసన సెగ రగులుతోంది. ప్రస్తుతానికి బీజేపీ వారే రోడ్డెక్కి ఆందోళనకు దిగగా, పొత్తు ఖరారైతే తెలుగు తమ్ముళ్లు కూడా రచ్చకు వెనుకాడని పరిస్థితి కనిపిస్తోంది.
కాకినాడ :జిల్లాలో పిఠాపురం, రాజోలు అసెంబ్లీ స్థానాలను బీజేపీకి వదులుకోవడానికి సిద్ధపడుతున్నా.. చంద్రబాబు కొత్త ఎత్తు వేశారని సమాచారం. ఆ రెండు స్థానాల నుంచీ తాము ప్రతిపాదించే వారిని పార్టీలోకి తీసుకుని, టిక్కెట్లు వారికే కేటాయించాలని బాబు మెలిక పెట్టినట్టు తెలుస్తోంది. ఆ రెండు చోట్లా టీడీపీ నేతల మధ్య విభేదాలతో వచ్చిన తలపోటు తప్పుతుందన్నదే బాబు వ్యూహమంటున్నారు. ది తెలుగుతమ్ముళ్లకు రుచించడం లేదు.
పిఠాపురం నుంచి గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఎస్‌వీఎస్ వర్మపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన నేతలు మాజీ ఎమ్మెల్యే దివంగత వెన్నా నాగేశ్వరరావు తనయుడు జగదీష్‌ను బలపరుస్తూ వచ్చారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న వర్మ భవిష్యత్‌లో ఏకుమేకవుతారన్న భయంతో జగదీష్‌కు ఆదిలోనే అడ్డుకట్ట వేయడం మొదలుపెట్టారు. ఈ పరిణామాలు చివరకు నియోజకవర్గంలో వర్మకు వ్యతిరేకంగా బలమైన కూటమి ఏర్పడటానికి కారణమైంది. ఈ తలపోటు తప్పించుకునేందుకే పిఠాపురం సీటును బీజేపీకి వదులుకునేందుకు చంద్రబాబు సై అంటున్నారు.
పొత్తు పేరుతో మా ఆశకు గోరీ కడతారా?
వాస్తవానికి రాజోలు లేదా పి.గన్నవరంలలో ఒకటి పొత్తులో దక్కినా, దక్కకున్నా బరిలోకి దిగాలని బీజేపీ ముందు నుంచీ యోచిస్తోంది. ఇదే కారణంతో.. ఒకప్పుడు బీజేపీ నుంచి బయటకు వెళ్లి, తిరిగి ఆ గూటికే చేరిన మాజీ ఎమ్మెల్యే అయ్యాజీవేమాకు రాజోలును ఖాయం చేసినట్టు ఆయన సన్నిహితులు, అనుచరులు అంటున్నారు. రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను టీడీపీలోకి తీసుకువచ్చి, ఆ సీటును ఆయనకు కట్టబెట్టాలని చంద్రబాబు తొలుత భావించారు. ఇంతలో బీజేపీతో పొత్తుకు తెరలేవడంతో వ్యూహాత్మకంగా ఆ స్థానాన్ని బీజేపీకి వదిలేసినా, టిక్కెట్టు మాత్రం బీజేపీ తరఫున రాపాకకు ఇవ్వాలని ప్రతిపాదించినట్టు చెపుతున్నారు.
ఒకపక్క పిఠాపురం, మరోవైపు రాజోలు సీట్లు బీజేపీకి కేటాయించి ఇన్నాళ్లూ పార్టీని నమ్ముకున్న తమకు అన్యాయం చేసే సహించబోమని టీడీపీలోని ఆశావహులు హెచ్చరిస్తుండగా.. ఆ రెండు సీట్లూ తమ పార్టీకి కేటాయించినట్టే కేటాయించి, సీట్ల కోసం పార్టీలోకొస్తున్న వారికి కట్టబెడితే ఉపేక్షించేది లేదని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. కొందరు బీజేపీ నేతలు తమ ఆగ్రహాన్ని శుక్రవారం కాకినాడలోని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద వ్యక్తం చేశారు.
జిల్లా బీజేపీ అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడా కృష్ణమోహన్, పార్టీ మత్స్యకార విభాగం కన్వీనర్ కర్రి చిట్టిబాబుల సమక్షంలో కాకినాడ నగర కన్వీనర్ కుసుమంచి వేణుగోపాల్ వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం ఆ పార్టీ శ్రేణుల నిరసన తీవ్రతను చాటింది. పార్టీలో ఉన్న వారికి కాక బయటవారికి టిక్కెట్లు ఇస్తే సహించేదిలేదని ఈ సందర్భంగా జిల్లా బీజేపీ నాయకులు అధిష్టానానికి తెగేసి చెప్పారు. ఇలాంటి సెగే ఒకటి, రెండు రోజుల్లో తెలుగుతమ్ముళ్ల నుంచి కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ నాయకులు అంటున్నారు. రాష్ట్ర విభజనలో ‘బాబు’ అనుసరించిన రెండు నాల్కల ధోరణినే పొత్తుల్లో కూడా కనబరుస్తుండడం భవిష్యత్‌లో పార్టీలో ఏ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.
పిఠాపురం గీతకిస్తే.. తడాఖా చూపిస్తాం..
అయితే ఆ స్థానాన్ని బీజేపీకి విడిచి పెట్టినా ఆ సీటును ఒకప్పటి తెలుగుమహిళ, సిట్టింగ్ ఎమ్మెల్యే వంగా గీతకు కేటాయించాలనే షరతును బాబు విధించారనే సమాచారంతో ఇరుపార్టీల నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో రాజకీయ భవిష్యత్‌పై ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్న గీత టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నారనే ప్రచారం జరిగింది. ఇంతలో పొత్తులో భాగంగా పిఠాపురం వదులుకోవాల్సి వస్తే ఆ సీటు గీతకు కేటాయించాలనే బాబు ప్రతిపాదించారంటున్నారు. అదే జరిగితే తడాఖా చూపిస్తామని ఆ నియోజకవర్గ తెలుగుతమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు.