‘ముళ్లపూడి’ చెరలో ముత్యాలమ్మ చెరువు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అధికారం దన్నుతో ఏం చేసినా చెల్లుబాటవుతుందని రెచ్చిపోతున్న తెలుగుదేశం పార్టీ నేతలు రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం చెరువుల నుంచి యథేచ్ఛగా మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ అక్రమాలపై ఇదేమిటని ప్రశ్నించిన కిందిస్థాయి అధికారులను ‘ఏయ్ మీ పని మీరు చేసుకోండి.. మా జోలికి రావొద్దు.. మేం జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అనుచరులం’ అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. సిబ్బందిని బెదిరిస్తున్నా అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నిద్ర నటిస్తున్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు సొంతూరు నల్లజర్లలోని ముత్యాలమ్మ చెరువులో వారం రోజులుగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. టీడీపీకి చెందిన నల్లజర్ల సర్పంచ్‌వై.శ్రీనివాసరావు, పోతవరం సర్పంచ్ పి.రతీష్, బాపిరాజు సన్నిహితుడు యద్దనపూడి బ్రహ్మరాజు, మరికొంత మంది కలిసి నల్లజర్లలో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌కి శ్రీకారం చుట్టారు. ఈ వెంచర్ కోసం నల్లజర్ల పోలీస్‌స్టేషన్ పక్కనే వందల ఏళ్లుగా ఉన్న 30 ఎకరాల ముత్యాలమ్మ చెరువునుంచి నిర్భీతిగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. ఒక సాధారణ రైతు ఇంటి వద్ద మెరక
చేసుకునేందుకు తన పొలం నుంచి ట్రక్కు మట్టి తీసుకెళుతుంటే అధికారులు నానా హడావిడి చేసి కేసులు పెట్టి జరిమానాలు విధిస్తుంటారు. కానీ ఇక్కడ బహిరంగంగానే మూడు పొక్లెయిన్‌లు, 30 ట్రాక్టర్లతో పట్టపగలే సుమారు వెయ్యి ట్రాక్టర్ల మట్టిని వారం రోజులుగా తరలించుకుపోతున్నా చోద్యం చూశారే గానీ ఇదేమిటని అడిగే ధైర్యం చేయలేక పోయారు. ఈ చెరువులోనుంచి మట్టి తవ్వకాలు జరిపేందుకు ఎటువంటి అనుమతులు లేవు.
నిబంధనలు గాలికి..
మట్టి రియల్ వెంచర్‌కు వాస్తవానికి ఇరిగేషన్ చెరువులో మట్టి తవ్వుకు తీసుకెళ్లాలంటే ముందు వీఆర్వో, ఆ తర్వాత తహసిల్దార్ అభ్యంతరాల్లేవని లేఖ ఇవ్వాలి. ఈ సిఫార్సును పరిగణనలోకి తీసుకుంటే ఇరిగేషన్ అధికారులు మైనింగ్ ఏడీకి అనుమతులివ్వాలి. కానీ ఇక్కడ ఇవేమీ పట్టలేదు. ఎక్కడా ఏ అధికారి అనుమతులివ్వకుండానే తవ్వకాలు జరిగిపోతున్నాయి. గతంలో గంగానమ్మ గుడి ఎదురుగా వేసిన ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం ఇలానే మట్టి తరలిస్తుంటే అధికారులు దాడి చేసి పొక్లెయిన్‌ను స్వాధీనం చేసుకుని తోలిన మట్టికి క్యూబిక్ మీటర్ల వంతున లెక్కగట్టి మరీ జరిమానా విధించారు. కానీ ముత్యాలమ్మ చెరువు తవ్వకాల విషయానికి వస్తే.. అసలు దీనికి అనుమతులున్నాయో లేదో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. ఓ కిందిస్థాయి అధికారి మాత్రం నేరుగా అక్కడికి వెళ్లి అనుమతులున్నాయా అని అడిగితే.. నీకెందు కు.. ఎమ్మార్వోకిచ్చాం.. మేం ఎవరో తెలిసే ఇక్కడకు వచ్చావా.. అని గదమాయించడంతో ఆయన ఏమీ చేయలేని పరిస్థితుల్లో వెనక్కి వెళ్లినట్టు తెలిసింది. జెడ్పీ చైర్మన్ బాపిరాజుకు తెలియకుండానే ఇదంతా జరుగుతుం దంటే ఎవరూ నమ్మరని, కేవలం ఆయన అండదండలతోనే అనుచరు లు, టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి.
కాలం చెల్లిన అనుమతులతో...
గత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హ యాంలో అనుమతిపొంది తిరిగి రద్దయిన కాపీలను పెట్టుకునే వీళ్లు తవ్వకాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరైనా అడిగినా కాలం చెల్లిన అనుమతి లేఖలే చూపిస్తున్నట్టు చెబుతున్నారు.
ఆ చెరువు గురించి మాకేం తెలియదు : మైనింగ్ శాఖ అధికారులు
దీనిపై మైనింగ్ శాఖ ఏడీ వై.సత్తిబాబును వివరణ కోరేందుకు గత నాలుగురోజులుగా యత్నిస్తున్నా అయన ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. కనీసం ఆ శాఖకు చెందిన ఇతర అధికారులను కలిసి విష యం ప్రస్తావించగా, ఆ చెరువు గురించి మాకేం తెలియదు.. మేమేం మాట్లాడలేం.. అని నోరు నొక్కుకుంటున్నారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.