ట్రెండ్‌ మారుతోంది.. అమెరికా వద్దు | Telugu Students Opinion Changing On Overseas Education | Sakshi
Sakshi News home page

ట్రెండ్‌ మారుతోంది..

Published Sat, Mar 17 2018 1:33 AM | Last Updated on Sat, Mar 17 2018 10:54 AM

Telugu Students Opinion Changing On Overseas Education - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విదేశాల్లో ఉద్యోగం.. ఎంతో మంది భారతీయ విద్యార్థులు, మరీ ముఖ్యంగా తెలుగు విద్యార్థుల కల. దీని కోసం పాశ్చాత్య దేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉద్యోగావకాశాలు, అక్కడి ప్రభుత్వ విధానాలను బట్టే ఏ దేశంలో ఉన్నత విద్యను అభ్యసించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటున్నారు. గడచిన నాలుగు దశాబ్దాలుగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్న వారి వివరాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 1980–2000 దాకా దాదాపు రెండు దశాబ్దాలపాటు బ్రిటన్‌(యునైటెడ్‌ కింగ్‌డమ్‌)లో ఉన్నత విద్య చదివేందుకు వెళ్లి తెలుగు విద్యార్థులు భారీ సంఖ్యలో అక్కడ స్థిరపడ్డారు. 1980–90 దశకంలో ఆర్థిక వనరులున్న కుటుంబాలు తక్కువ కావడంతో ఇంగ్లండ్‌లో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లినవారి సంఖ్య తక్కువే. 1990–2000 దశకం వచ్చేసరికి అక్కడకు క్యూ కట్టిన వారి సంఖ్య భారీగా ఉండటంతో బ్రిటన్‌ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో విదేశీయులకు అవకాశం లేకుండా కట్టడి చేయడం మొదలుపెట్టింది. దాంతో మనవాళ్ల దృష్టి అమెరికాపై పడింది. దాదాపు 15 ఏళ్ల పాటు లక్షల సంఖ్యలో తెలుగు విద్యార్థులు అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. దీంతో అక్కడ వర్ణవివక్ష మొదలైంది. ‘బయ్‌ అమెరికన్‌–హైర్‌ అమెరికన్‌’నినాదంతో ట్రంప్‌ అధికారంలోకి రావడంతో తెలుగు విద్యార్థుల దృష్టి ఇతర దేశాలపై పడింది. దీంతో ఆస్ట్రేలియా, కెనడా, మలేషియా వంటి దేశాలకు వారు తరలివెళుతున్నారు. విదేశీ విద్యకు సంబంధించి ఎప్పటికప్పుడు మారుతున్న తెలుగు విద్యార్థుల ట్రెండ్‌పై ‘సాక్షి’ప్రత్యేక కథనం. 

అక్కడే చదువు.. ఉద్యోగం.. 
ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌కు చెందిన ప్రభాకర్‌రెడ్డి 2004లో ఎంబీఏ కోర్సు పూర్తి చేసేందుకు లండన్‌ వెళ్లారు. రెండేళ్లలో కోర్సు పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుండగానే అతడిని అక్కడి ప్రభుత్వం భారత్‌కు తిప్పిపంపింది. అయితే ప్రభాకర్‌రెడ్డి లండన్‌ వెళ్లింది చదువు పేరులో అక్కడ ఉద్యోగం సంపాదించడానికే. దానికి నేపథ్యం అంతకు ముందు 15 ఏళ్ల నుంచి బ్రిటన్‌లో మాస్టర్స్‌ విద్యను అభ్యసించేందుకు వెళ్లిన బోథ్‌ పరిసర ప్రాంతాల యువకులు అక్కడే ఉద్యోగాలు సంపాదించి జీవితంలో స్థిరపడటమే. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్‌ దాకా వేలాది మంది యూకేకు వెళ్లి స్థిరపడ్డారు. 1990 దశకం మొదట్లో మొదలైన ఈ వలసలు పదేళ్ల పాటు అంటే 2000 సంవత్సరం వరకూ సాగాయి. అధ్యాపకులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు ఇలా వేలాది మందికి బ్రిటన్‌ ఆశ్రయం ఇచ్చింది. ఆ భరోసాతోనే ఆ తర్వాత ఐదేళ్లు కూడా వేలాది మంది తెలుగు విద్యార్థులు మాస్టర్స్‌ డిగ్రీ కోసం యూకే బాటపట్టారు. కానీ, అందులో 80 శాతం మందిని ఆ దేశం వెనక్కి పంపింది. చదువుకోవడానికి కాకుండా ఉద్యోగాల కోసమే వస్తున్నారన్న విషయాన్ని గ్రహించిన బ్రిటన్‌ 2005లో తన పాలసీని సమీక్షించి వలసవాద విధానాలను కట్టుదిట్టం చేసింది. ఫలితంగా గత 13 ఏళ్లలో యూకే వెళ్లి మాస్టర్స్‌ చేసిన వారు సంఖ్య వందల్లోకి వచ్చింది. 

2005 నుంచి అమెరికా వైపు.. 
తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన రవికుమార్‌ యూకే వెళ్లడం వల్ల ఫలితం లేదని గ్రహించి 2005లో ఇంజనీరింగ్‌లో పోస్ట్రుగాడ్యుయేషన్‌ చేయడానికి అమెరికా బాట పట్టారు. అక్కడే ఎంఎస్‌ పూర్తి చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు. రవికుమార్‌ను ఆదర్శంగా తీసుకుని అమలాపురం, దాని పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 5,000 మంది అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని కె.సతీష్‌కుమార్‌ అతని ఆరుగురు ఇంజనీరింగ్‌ స్నేహితులు అమెరికాలో ఎంఎస్‌ డిగ్రీ కోసం 2016 ఆగస్ట్‌లో టెక్సాస్‌కు వెళ్లారు. అయితే డల్లాస్‌ విమానాశ్రయంలో అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఈ ఆరుగురిని విచారించి.. వారు చేరబోయే విశ్వవిద్యాలయాలకు అనుమతి లేదంటూ భారత్‌కు తిప్పిపంపారు. అంతే ఒక్కసారిగా అమెరికా వెళ్లాలనుకున్న విద్యార్థుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. అంతకు ముందు 15 ఏళ్ల పాటు అమెరికాలో విద్య కోసం వెళ్లిన వారికి అక్కడి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. యూకేలో వలసవాద విధానాలు కట్టుదిట్టం కావడంతో 2001–2002 నుంచే ఉన్నత విద్య కోసం అమెరికాకు వలసలు పెరిగాయి. 2002లో 15,550 మంది అమెరికా వెళితే 2015కు వచ్చేసరికి ఆ సంఖ్య 2.25 లక్షలకు పెరిగింది. అంటే 15 ఏళ్లలో 15 రెట్లు పెరిగిందన్నమాట. ఇందులో తెలుగు విద్యార్థుల సంఖ్య దాదాపు 40 శాతం. ఈ నేపథ్యంలో భారతీయ సాంకేతిక నిపుణుల వల్ల అమెరికాలో నిరుద్యోగం ఎక్కువైందన్న ప్రచారం సాగడంతో 2016 ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ‘బయ్‌ అమెరికన్‌–హైర్‌ అమెరికన్‌’నినాదంతో అనూహ్యంగా ఆ దేశానికి అధ్యక్షుడయ్యారు. అప్పటి నుంచి ఆయన వలసవాద విధానాన్ని కఠినతరం చేసేందుకు అనేక ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ఇప్పుడవన్నీ చట్టసభల ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో గత రెండేళ్లలో అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి సంఖ్య 40 శాతం తగ్గింది. 

రారమ్మంటున్న ఇతర దేశాలు.. 
మహమ్మద్‌ షబ్బీర్‌ హైదరాబాద్‌ వాసి. ఇక్కడ ఇంజనీరింగ్‌ చదివి 2014లో ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే ఉన్నత విద్యను పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడ్డారు. ఆ తర్వాత మూడేళ్లలో షబ్బీర్‌ తన నలుగురు సోదరులతో పాటు సమీప బంధువులు పది మందిని అక్కడికి తీసుకువెళ్లారు. ఇప్పుడు వారిలో అత్యధికులు శాశ్వత నివాస హోదా కూడా పొందారు. షబ్బీర్‌ మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది చూపు ఇప్పుడు ఆస్ట్రేలియాపై పడింది. యూఎస్‌ తన విధానాలను కఠినతరం చేస్తున్నట్లు ప్రచారం కావడంతోనే తెలుగు విద్యార్థులు ఆస్ట్రేలియా బాట పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2015లో ఉన్నత విద్య కోసం 6,500 మంది ఆస్ట్రేలియా వెళితే 2017 సెస్టెంబర్‌ వచ్చేసరికి ఆ సంఖ్య 39,000కు పెరిగింది. వచ్చే సెప్టెంబర్‌లో మొదలయ్యే విద్యా సంవత్సరానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య 50,000 దాటుతుందని విదేశీ విద్యా కన్సల్టెన్సీ సంస్థలు చెపుతున్నాయి. ఒక్క ఆస్ట్రేలియానే కాదు న్యూజిలాండ్, కెనడా, మలేషియా వంటి దేశాలకూ విద్యార్థులు క్యూ కడుతున్నారు. అమెరికా మాదిరిగా కెనడా ఇప్పటిదాకా ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. పైపెచ్చు అమెరికాతో పోలిస్తే కెనడాలో అతి తక్కువ కాలంలోనే శాశ్వత నివాస హోదా దక్కుతోంది. 

ప్రతిభావంతుల చాయిస్‌ అమెరికానే.. 
‘జీఆర్‌ఈ, టోఫెల్‌లో మంచి స్కోర్‌ రావడంతో పాటు తమ మీద తమకు నమ్మకం ఉన్నవారు ఇప్పటికీ అమెరికాకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదో ఒక ఉద్యోగం ముఖ్యం అనుకునే వారే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా వంటి దేశాలకు వెళుతున్నారు. అలాంటి వారి సంఖ్య ఈ రెండేళ్లలో 150 శాతం పెరిగింది. అదే సమయంలో అమెరికా వెళ్లాలనుకునే వారి సంఖ్య బాగా తగ్గింది. రెండేళ్ల క్రితం వరకు మా దగ్గరకు సలహా కోసం వచ్చిన వారిలో 90 శాతం మంది అమెరికానే కోరుకునే వారు. ఇప్పుడు వారి సంఖ్య 50 శాతానికి తగ్గింది’అని అమీర్‌పేటలో గత నాలుగు దశాబ్దాలుగా విదేశీ విద్య కన్సల్టెన్సీ సర్వీసు నడుపుతున్న నాగేశ్వరరెడ్డి చెప్పారు. ‘అమెరికాకు వెళ్లే విద్యార్థులు తగ్గినా 320–325 జీఆర్‌ఈ స్కోర్‌ వచ్చినా అక్కడి టాప్‌ రేటెడ్‌ విశ్వవిద్యాలయాల్లో సీట్లు దక్కడం లేదు. 2010–2014 మధ్య 305–310 స్కోరు వస్తే టాప్‌ 50 విశ్వవిద్యాలయాల్లో సీట్లు వచ్చేవి. ఇప్పుడు అదే వర్సిటీల్లో 320–325 వచ్చినా సీట్లు లేదు. విద్యార్థులు ఆస్ట్రేలియా, కెనడా వెళ్లడానికి ఇది కూడా ఒక కారణం’అని ఆయన విశ్లేషించారు. 


No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement