సాపాటు ఎటూ లేదు.. | Telugu students problems at United States | Sakshi
Sakshi News home page

సాపాటు ఎటూ లేదు..

Published Wed, May 24 2017 12:37 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

సాపాటు ఎటూ లేదు.. - Sakshi

సాపాటు ఎటూ లేదు..

అమెరికాలో తెలుగు విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరం
- ట్రంప్‌ రాకతో మారిన సమీకరణాలు
- కొత్త ఉద్యోగాలు లేవు.. ఉన్న కొలువులకు భద్రత లేదు..
- ఉద్యోగులను ఎడాపెడా తొలగించేస్తున్న కంపెనీలు


న్యూయార్క్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి  కంచర్ల యాదగిరిరెడ్డి
చేతిలో ఎంఎస్‌ పట్టా ఉంటే కొలువు వెతుక్కుంటూ వచ్చేది.. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్‌ రంగాల్లో ఉద్యోగాలకు ఢోకా ఉండేది కాదు.. ఇదంతా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించడానికి నెల రోజుల ముందటి పరిస్థితి! కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం తారుమా రైంది. కంప్యూటర్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారికి కూడా ఇప్పుడక్కడ ఉద్యోగాలు లేవు. అతికొద్ది అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగాలు పొందేవారి పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోయినా.. సాధారణ వర్సిటీల్లో చదివి కన్సల్టెన్సీలపై ఆధారపడి ఉద్యోగాలు చేద్దామనుకున్న భారతీయ విద్యా ర్థులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండేళ్ల కిందట గ్రాడ్యుయేషన్‌ చదవడానికి వచ్చి పట్టా చేత పట్టుకున్న వేలాది మంది భారతీయ విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఇటీవల అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా రాష్ట్రాలను సందర్శించిన ‘సాక్షి ప్రతినిధి’ అక్కడ చదువుకుంటున్న, చదువు పూర్తి చేసిన తెలుగు విద్యార్థులతో మాట్లాడగా వారంతా తమ గోడు వెళ్లబోసుకున్నారు.

తండ్రి చేసిన అప్పులు తీరేదెలా?
కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన మధుసూదన్‌రావు పంచాయతీరాజ్‌ శాఖలో చిరుద్యోగి. వేతనం గృహావసరాలు, ఇద్దరు పిల్లల చదువులకే సరిపోయింది. సొంతిల్లు కూడా కట్టుకోలేకపోయారు. అయినా బ్యాంకు నుంచి రూ.25 లక్షలు రుణం తీసుకుని.. తన కుమార్తె అనూషను ఇంజనీరింగ్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోసం అమెరికా పంపారు. ఆమె షికాగోలోని నార్త్‌ ఈస్టర్న్‌ ఇలినాయిస్‌ వర్సిటీలో ఆర్నెల్ల కింద ఎంఎస్‌ పూర్తి చేశారు. మూడు నెలల తర్వాత అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వీలుగా ఓపీటీ (ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌) కార్డు రావడంతో ఉద్యోగాన్వేషణ ప్రారంభించారు. మూడు రాష్ట్రాల్లో డజనుకు పైగా ఐటీ సంస్థలకు దరఖాస్తు చేసినా.. ఏ సంస్థ నుంచీ ఇంటర్వూ్యకు పిలుపురాలేదు. కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాల కోసం ప్రయత్నించినా ఫలితం లేదు. స్వదేశం నుంచి తండ్రి పంపే డబ్బుతోనే జీవితం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఉందని, మరో రెండుమూడు నెలలు చూసి స్వదేశానికి వెళ్లి ఏదో ఉద్యోగం వెతుక్కుంటానంటూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. తన చదువు కోసం తండ్రి చేసిన అప్పులు తీర్చేదెలా అని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతా మారిపోయింది..
మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తికి చెందిన సుష్మ ఎంఎస్‌ చదువు, ఉద్యోగం కోసం గంపెడాశలతో అమెరికా వెళ్లారు. గతేడాది డిసెంబర్‌లో హూస్టన్‌లోని టెక్సాస్‌ సదరన్‌ వర్సిటీలో ఎంఎస్‌ పూర్తి చేశారు. ఆమె తండ్రి రైతు. వ్యవసాయ భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.15 లక్షలు అప్పు చేసి కుమార్తెను అమెరికా పంపారు. అయితే ఎంఎస్‌ పూర్తి చేసి ఆరు నెలలవుతున్నా సుష్మకు ఉద్యోగం దొరకలేదు. ఏం చేయాలో దిక్కుతోచని సుష్మ.. తన ఖర్చుల కోసం ఓ హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా రోజుకు (12 గంటలు) 75 డాలర్ల వేతనంతో అనధికారికంగా పనిచేస్తున్నారు. అది కూడా నెలలో 10 నుంచి 12 రోజులు మాత్రమే!

ఉన్న ఉద్యోగం పోయింది..
మహబూబ్‌నగర్‌ జిల్లా గండేడ్‌కు చెందిన మహిపాల్‌రెడ్డి కాలిఫోర్నియా స్టేట్‌ వర్సిటీలో 2014లో ఎంఎస్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేశారు. అక్కడి ఒక భారత ఐటీ కంపెనీలో 65 వేల డాలర్ల వార్షిక వేతనానికి చేరారు. ఏడాది తిరిగే సరికి వేతనం 75 వేల డాలర్లకు పెరిగింది. హెచ్‌1బీ వీసా కూడా వచ్చింది. కానీ నెల రోజుల కింద కంపెనీ మహిపాల్‌రెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో ఆయన ఈ నెల 20న భారత్‌కు తిరిగి వచ్చేశారు. స్థానికులకే ఉద్యోగాలన్న ట్రంప్‌ నినాదాన్ని అందిపుచ్చుకొని భారత కంపెనీలు ఇలా టెక్నికల్‌ సపోర్టు ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ చివరిదాకా దాదాపు 2,500 మందిని భారత ఐటీ కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సమాచారం.

తాత్కాలిక  ఉద్యోగాలూ లేవు
ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన సుధాకర్‌ యాదవ్‌ జీఆర్‌ఈ, టోఫెల్‌లో అర్హత సాధించి ఈ ఏడాది జనవరిలో నార్తర్న్‌ అరిజోనా వర్సిటీలో ఎంఎస్‌ కోర్సులో చేరారు. బ్యాంకు రుణంతో అమెరికా పయనమైన ఆయన.. వర్సిటీలో అసిస్టెంట్‌షిప్‌ లేదా ఎక్కడైనా పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసి నాలుగు డాలర్లు సంపాదిస్తే ఖర్చులకు సరిపోతాయని భావించారు. కానీ ట్రంప్‌ రాకతో అమెరికా వర్సిటీల్లోని ప్రొఫెసర్లు తమ దగ్గరి పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలను స్థానికులకే కేటాయించడం మొదలుపెట్టారు. దీంతో సుధాకర్‌కు పార్ట్‌టైమ్‌ ఉద్యోగం కూడా దొరకడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement