అమెరికాలో భారత్ భారీగా ఉద్యోగాలు
అమెరికాలో భారత్ భారీగా ఉద్యోగాలు
Published Tue, Jun 27 2017 8:51 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM
వాషింగ్టన్ : అమెరికాలో ఉద్యోగాలను భారత్ ఎగరేసుకుంటూ పోతుందంటూ శ్వేతాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనకు రిపోర్టులు గట్టి సమాధానమిస్తున్నాయి. ఆ దేశంలో మన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతంగా సాగుతున్న క్రమంలో అమెరికాకు భారత్ అందిస్తున్న సహకారాన్ని వెల్లడించాయి. భారత్ కు అమెరికా చేసే ఎగుమతులు వల్ల ప్రత్యక్షంగాను, పరోక్షంగాను 2,60,000పైగా ఆ దేశ ఉద్యోగాలకు మన దేశం సహకరిస్తున్నట్టు తాజా రిపోర్టులు వెల్లడించాయి. 2015లో అమెరికా నుంచి 28.3 బిలియన్ డాలర్లు అంటే రూ1,82,351కోట్లకు పైగా పెట్టుబడులు మనదేశంలోకి వచ్చినట్టు తెలిపాయి.
అమెరికాలోనూ భారత విదేశీ పెట్టుబడులు 2015 వరకు 9.2 బిలియన్ డాలర్లు(రూ.52,838కోట్లు)గా ఉన్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ఇవి 2006 నుంచి 2015 వరకు 5000 శాతానికి పైగా పైకి ఎగిసినట్టు తెలిపాయి. ఇండియా మాటర్స్ ఫర్ అమెరికా/ అమెరికా మాటర్స్ ఫర్ ఇండియా పేరుతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్ఐసీసీఐ) ఈ రిపోర్టు విడుదల చేసింది. అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఈస్ట్-వెస్ట్ సెంటర్ ఈవెంట్ లో ఈ డేటాను వెల్లడించింది.
ప్రతి ఒక్క అమెరికా రాష్ట్రం భారత్ కు ఎగుమతులు చేస్తుందని, ఈ ఎగుమతులు వల్ల అమెరికాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,60,000కు పైగా ఉద్యోగాల కల్పన జరుగుతున్నట్టు పేర్కొంది. 31 రాష్ట్రాలు భారత్ కు ఎగుమతి చేసే వాటిపైనే ఆధారపడి 1000 ఉద్యోగాలు కల్పిస్తున్నాయని తెలిపింది. అదేవిధంగా అదనంగా 6 రాష్ట్రాలు 10వేలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తున్నాయని చెప్పింది. భారత్ లో ఎక్కువగా పెట్టుబడులు చేసే దేశాల్లో అమెరికా ఒకటని రిపోర్టు వెల్లడించింది. ప్రొఫిషినల్, సైటిఫిక్, టెక్నికల్ సర్వీసెస్, డిపాజిటరీ ఇన్ స్టిట్యూషన్స్, మానుఫ్రాక్ట్ర్చరింగ్ వంటి వాటిని భారత్ కూడా ఎక్కువగా అమెరికాలో పెట్టుబడులుగా పెడుతున్నట్టు ఆ దేశ వాణిజ్య అధికారి చెప్పారు.
అంతేకాక ఇటీవల 100 కొత్త అమెరికన్ విమానాలు కావాలంటూ భారత్ విమానయానాల ఆర్డర్ వల్ల తమ దేశంలో వేలకు పైగా వేలు ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం చెప్పారు. అతిపెద్ద ఆర్డర్స్ లలో ఇదీ ఒకటని అభివర్ణించారు. భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి అమెరికన్ ఎనర్జీని భారీగా ఎగుమతి చేస్తామని హామీ ఇచ్చారు. దీనిలో అమెరికన్ నేచురల్ గ్యాస్ కొనుగోలు ఒప్పందం కూడా ఒకటి. దీనిపై సంతకం చేయనున్నట్టు ట్రంప్ ప్రకటించారు.
Advertisement