సాక్షి, రాజమండ్రి : నగర పాలక మండలి (కౌన్సిల్) కో ఆప్షన్ సభ్యత్వాల ఎన్నికల వ్యవహారం అధికార తెలుగుదేశంలో కలకలానికి కారణమవుతోంది. అయిదు కో ఆప్షన్ సభ్యత్వాల్లో నామినేట్ చేసే రెండు పదవులు పోను మిగిలిన మూడింటినీ తనకు అత్యంత సన్నిహితులైన వారికే కట్టబెట్టాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరాట పడుతున్నారు.
అయితే మూడు సభ్యత్వాల కోసం ఆ పార్టీ నుంచే ఆరుగురు పోటీ పడుతుండగా, మిత్రపక్షమైన బీజేపీ నుంచి ఇద్దరు బరిలో ఉన్నారు. మరో రిటైర్డ్ అధికారి కూడా గోరంట్ల సహకారం పొంది, కౌన్సిల్‌లో కూర్చోవాలని ఆశపడుతున్నారు. కౌన్సిల్‌లో మొత్తం అయిదుగురు సభ్యులను చేర్చుకోవలసి ఉండగా అందులో రెండు సభ్యత్వాలు (మైనారిటీ పురుషుడు, మైనారిటీ మహిళ) నామినేషన్ ప్రాతిపదికన భర్తీ అవుతాయి. మిగిలిన ముగ్గురూ ఎన్నిక కావలసి ఉంటుంది.
ఆ ముగ్గురు సభ్యులనూ ఏక గ్రీవంగా ఎన్నుకునేలా చేయడంలో నేతలు విఫలమైనందున ఈ నెల 27న జరిగే పాలక మండలి ప్రత్యేక సమావేశంలో పోటీ అనివార్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్‌లు ఉండగా వాటిలో 34 తెలుగుదేశం దక్కించుకున్నందున కో ఆప్షన్ సభ్యులు కూడా అదే పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న గోరంట్ల ఎన్నిక ప్రాతిపదికన జరిగే మూడు పదవులనూ తనకు అత్యంత విధేయులైన వారికి కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. టీడీపీ తరఫున కూరాకుల తులసి, మజ్జి పద్మ, కప్పల వెలుగుకుమారి, గత కౌన్సిల్‌లో డిప్యూటీ మేయర్‌గా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ (బాక్స్ ప్రసాద్), రిటైర్డు జడ్జి సంజీవరావు, రెడ్డి మణి బరిలో ఉన్నారు.
వీరిలో ముందుగా రెండు పదవులకు వెలుగుకుమారి, సంజీవరావులను ప్రతిపాదించగా తాజాగా మార్పు చేసి తన ముఖ్యఅనుచరులైన మజ్జి పద్మ, బాక్స్ ప్రసాద్, రెడ్డి మణిలకు కట్టబెట్టాలని గోరంట్ల ఆలోచిస్తున్నట్టు సమాచారం. కాగా నీటిపారుదల శాఖ రిటైర్డు ఇంజనీరు చంద్రశేఖరరావు కూడా కో ఆప్షన్ సభ్యత్వం కోసం గోరంట్లతో మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ తరఫున ఆ పార్టీ నాయకులు గరిమెళ్ల చిట్టిబాబు, కె.వి.పాపారావు కో ఆప్షన్ సభ్యత్వాన్ని ఆశిస్తున్నారు. మూడు పదవుల్లో ఒకటి మిత్రపక్షమైన తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే గోరంట్ల నామినేటెడ్ పోస్టు ఇస్తాననడం బీజేపీ వారికి రుచించడం లేదు.
27న సమావేశం గరం..గరం!
రెండు నామినేటెడ్ పోస్టుల్లో ఒకదాన్ని టీడీపీకి చెందిన హబీబుల్లా ఖాన్‌కు ఇవ్వనున్నట్టు సమాచారం. టీడీపీకే చెందిన జాన్ భాషా, కరీంఖాన్ ఎవరికి వారే తమ జీవిత భాగస్వామికి రెండో పోస్టును ఇప్పించుకోవాలని పోటీ పడుతున్నట్టు సమాచారం. అయితే రెండో నామినేటెడ్ పోస్టును బీజేపీకి ఇస్తానని, ఈ నెల 26లోగా తేల్చుకోవాలని గోరంట్ల చెప్పినట్టు తెలుస్తోంది. ఆ పోస్టుకు బీజేపీలో అర్హులు ఎవరూ లేరని తెలిసే ఆయన ఈ ‘ఆఫర్’ ఇచ్చారని, అన్ని పదవులూ తన వర్గానికి దక్కాలన్నదే ఆయన వ్యూహమని చెపుతున్నారు.
వాస్తవంగా జూలై మూడున జరిగిన తొలి కౌన్సిల్ సమావేశంలోనే కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. అయితే అప్పటికి అభ్యర్థులను ఎంపిక చేయలేక వాయిదా వేశారు. దీంతో ఈ నెల 27న ఆ ప్రక్రియను పూర్తి చేయడానికే ప్రత్యేకంగా నగర పాలక మండలి సమావేశం నిర్వహిస్తున్నారు. పదవుల కోసం టీడీపీ సభ్యుల మధ్య పోటీ నెలకొనడంతో సమావేశంలో వాడి వేడి వాతావరణం ఏర్పడుతుందని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి.
రాజమండ్రి ‘దేశం’లో కో ఆప్షన్ కలకలం
Published Sat, Aug 16 2014 12:54 AM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM
Advertisement
Advertisement