
ఎండ తీవ్రతతో నిర్మానుష్యంగా ఉన్న దర్శి–ముండ్లమూరు రోడ్డు
ఒంగోలు సిటీ: ఎండ నిప్పులు చెరిగింది. ఉదయం నుంచే వేడి గాలులు. బయట అడుగు పెడితే నిప్పుల కుంపట్లో పెట్టినట్లే. రోడ్లు నిప్పుల కొలిమిని తలపించాయి. కాలు పెడితే మండుతున్న రోడ్లపై జన సంచారం లేదు. ఆది, సోమవారాలు పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే తరహాలో అగ్నిగుండం తరహా ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఒంగోలులో 45.08 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రానికి 46 డిగ్రీలు చేరుకున్నట్లుగా అధికారులు చెప్పారు. దర్శి, కురిచేడుల్లో అత్యధికంగా 48 డిగ్రీలు నమోదైంది. యర్రగొండపాలెంలో 46.76 డిగ్రీలు, చీమకుర్తిలో 46.69, కనిగిరి 46.52, దోర్నాలలో 46.44, త్రిపురాంతకం 46.52, మద్దిపాడులో 46.30, టంగుటూరులో 46.22, మార్కాపురం 46, సంతనూతలపాడులో 45.54, కురిచేడులో 45.37 డిగ్రీలు ఇలా 45 డిగ్రీలకుపైగా 17 మండలాల్లోఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా అధికారులు చెబుతున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి భానుడి భగభగలు మొదలయ్యాయి. ఉక్కపోతలు రాత్రి 9 గంటలైనా తగ్గడం లేదు. వడగాలులు తీవ్రంగా ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ పరిశోధన అధికారులు ప్రజలను హెచ్చరించారు. మరో మూడు రోజుల పాటు వడగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు.
క్రమంగా పెరుగుతున్న వడదెబ్బ మృతులు:
జిల్లాలో మూడు రోజుల నుంచి నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకు 16 మంది వడదెబ్బతో మృతిచెందారు. ఆదివారం అత్యధికంగా జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంతనూతలపాడులో 46.9 డిగ్రీలు, దొనకొండలో 45.9 డిగ్రీలు నమోదయ్యాయి. అలాగే జిల్లాలోని 17 మండలాల్లో 45 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎండ నుంచి ఇలా తప్పించుకోవాలి:
ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలను పాటిస్తే వడదెబ్బకు గురికాకుండా తప్పించుకోవచ్చు.
♦ తెలుపు రంగున్న పలుచటి కాటన్ వస్త్రాలు ధరించాలి. తలపై టోపీ, తలపాగా కట్టుకోవాలి. ఉప్పు కలిపిన మజ్జిగ తీసుకోవాలి. ఓఆర్‌ఎస్ వంటి ద్రవాలు తాగవచ్చు.
♦ వడదెబ్బకు గురైన వారిని వెంటనే నీడగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లాలి. వడదెబ్బకు గురైన వారిని తడిగుడ్డతో శరీరం అంతా రద్దుతుండాలి. ఐస్ నీటితో బట్టను తడిపి శరీరమంతా తుడవాలి. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల కంటే తక్కువ స్థాయికి వచ్చే వరకు ఇలా చేయాలి.
♦ ఎండ నుంచి రాగానే చల్లని నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, చల్లని నీరు తీసుకోవాలి. తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లినప్పుడు తల తిరగడం మొదలై ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తితే దగ్గరలోని వైద్యున్ని సంప్రదించాలి. ప్రాథమిక చికిత్స పొంది వడదెబ్బ బారిన పడకుండా కాపాడుకోవాలి.
♦ ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయట తిరగకూడదు. ఉదయాన్నే అత్యవసర పనులుంటే ముగించుకోవాలి. ప్రధానంగా ఉపాధి హామీ కూలీలు పది గంటల తర్వాత పని చేయడం ప్రమాదకరం.
♦ ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే తీపి పదార్థాలు, తేనె తీసుకోకూడదు. శీతల పానీయాలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment