
భానుడు
ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు
వేడిగాలులతో జనం ఇబ్బందులు
అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
రోహిణీలో 45 డిగ్రీలకు చేరుతుందంటున్న వాతావరణ నిపుణులు
రోను తుపాను ప్రభావంతో మండే ఎండల నుంచి ఉపశమనం పొందిన జిల్లా వాసులను భానుడు మళ్లీ బెంబేలెత్తిస్తున్నాడు. ఆదివారం ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఓ వైపు ఎండ, మరోవైపు వడగాలుల స్థాయి పెరగటంతో జనం ఆపసోపాలు పడ్డారు.
విజయవాడ (గుణదల) : భానుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రోను తుపాను ప్రభావంతో నాలుగు రోజుల పాటు వాతావరణం చల్లబడినా ఆదివారం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఉదయం నుంచి క్రమేణా పెరిగిన ఎండ వేడిమి మధ్యాహ్నానికి 43.5 డిగ్రీలకు చేరింది. దీనికితోడు గాలిలో తేమ ప్రభావం తక్కువగా ఉండటం వల్ల ఉక్కపోత ఎక్కువైంది. దీంతో విజయవాడ నగర వాసులు అల్లాడిపోయారు. వివిధ పనులపై బయటకు వెళ్లేవారు ఎండ నుంచి రక్షణకు తువాళ్లు, టోపీలు ధరించక తప్పలేదు. దీనికితోడు అసలే ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు విద్యుత్ శాఖాధికారులు మరింత పరీక్ష పెట్టారు. నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అప్రకటిత విద్యుత్ కోత విధించారు. దీంతో చంటిబిడ్డలు, గర్భిణులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
జిల్లా అంతటా భారీగా ఉష్ణోగ్రతల నమోదు...
ఆదివారం నాటి ఎండ తీవ్రతతో జిల్లా అంతటా ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. విజయవాడ, నూజివీడుల్లో అత్యధికంగా 43.5 డిగ్రీలు, జగ్గయ్యపేటలో 43.4, నందిగామలో 43.1, గుడివాడలో 43, మచిలీపట్నంలో 42.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఒకేసారి పెరిగిన ఉష్ణోగ్రతలతో జిల్లా ప్రజలు అల్లాడిపోయారు.
మరింత పెరగనున్న ఎండ వేడి
సోమవారం ఉదయం నుంచే 30 డిగ్రీల ఉష్ణోగ్రతతో మొదలై మధ్యాహ్నానికి 44 డిగ్రీలకు చేరుకుంటుందని, రాత్రివేళలో కూడా 35 డిగ్రీలు ఉండే అవకాశముందని, దీనికితోడు ఉక్కపోత కూడా తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 25 నుంచి రోహిణీ కార్తె ప్రారంభమవుతుందని, వాతావరణంలో వేడి ప్రభావం మరింతగా పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు. గరిష్టంగా 45 డిగ్రీలకు చేరే అవకాశముందని అంటున్నారు. వేడిగాలులు కూడా పెరిగే అవకాశముందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
పెరుగుతున్న వడగాలులు...
రోహిణీ కార్తె ప్రభావంతో నగరంలో వడగాలులు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. సగటున గంటకు 25 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వరకు వేడిగాలులు వీస్తాయని, మధ్యాహ్నం వేళలో బయటకువెళ్లేవారు ఎండ నుంచి రక్షణ పొందేందుకు తగు జాగ్రత్తలు పాటించాలని, రాత్రివేళలో కూడా వడగాలులు గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ విశ్లేషకులు సూచిస్తున్నారు.