
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు హడలెత్తిస్తున్నాయి. ప్రధానంగా ఏపీలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. కోస్తా జిల్లాల్లో మంగళవారం భారీ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఎండలతో గుంటూరు, విజయవాడ అగ్నిగుండాన్ని తలపిస్తోంది. మరో నాలుగు రోజులు పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. సముద్ర తీరం నుంచి వేడి గాలులు వీస్తుండటంతో కోస్తా తీరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఎండలకు బయటకు రావాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. ఇప్పటికే అత్యవసర పనులు ఉన్నవారు తప్ప ప్రజలెవరూ మధ్యాహ్నం 11 గంటల తరువాత రోడ్లపైకి రావడానికి సాహసం చేయలేకపోయారు. రాత్రి పది గంటలకు కూడా వేడి గాలులు వదల్లేదు. మరో నాలుగు రోజులపాటు ఇలానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నాలుగు రోజుల్లో ఏపీలోని ఎనిమిది జిల్లాల్లో సగటు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నట్టు నాసా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
నమోదైన ఉష్ణోగ‍్రతల వివరాలు
గుంటూరు -46 డిగ్రీలు
విజయవాడ-46 డిగ్రీలు
ఒంగోలు-45 డిగ్రీలు
ఏలూరు-45 డిగ్రీలు
నెల్లూరు-44 డిగ్రీలు
కాకినాడ-45 డిగ్రీలు
తెలంగాణలోనూ భారీగా ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్-45
ఖమ్మం-45
నల్లగొండ-45
నిజామాబాద్-44
కరీంనగర్-44
వరంగల్-44
హైదరాబాద్-42