పాఠశాల ఆవరణలో ఆలయ నిర్మాణం వద్దంటున్న విద్యార్థులు
సాక్షి, సంతబొమ్మాళి (శ్రీకాకుళం): మండలంలోని ఆర్‌హెచ్ పురం గ్రామంలో ప్రాథమిక పాఠశాల ముందు గుడి నిర్మాణం చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్మాణం వల్ల విద్యార్థులకు ఆటస్థలం కొరత ఏర్పడింది. తరగతి గదుల్లోకి గాలి వెలుతురు రాకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. గుడి నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, గ్రామంలో ఖాళీ స్థలాలు చాలా చోట్ల ఉన్నా.. పాఠశాల ముందు నిర్మాణం చేయడంతో అంతర్యమేంటో అర్థం కావడం లేదని చెబుతున్నారు.
ఈ నిర్మాణాలపై ఎంఈఓ, డీఈఓకి ఫిర్యాదు చేసినా నిర్మాణదారులు పట్టించు కోవడం లేదని మాజీ సర్పంచ్ ఎన్ని మన్మథరావు వాపోతున్నారు. పాఠశాల స్థలంలో అక్రమనిర్మాణం చేపట్టవద్దని వీఆర్వో చిరంజీవి చెప్పినా పట్టించుకోలేదు. దీంతో వీఆర్వో సంతబొమ్మాళి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విధులకు అటంకం కలిగించి అక్రమ నిర్మాణం చేపట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గ్రామానికి చెందిన బాడాన నాగభూషణరావు, ఎన్ని ఢిల్లీశ్వర్రావు, ఎన్ని పోలినాయుడు, ఎన్ని రాము, ఎన్ని గౌరునాయుడుపై కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఐ కామేశ్వర్రావు ఆదివారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment