మండల ప్రత్యేకాధికారి గదిలో టీడీపీ నేతల సమావేశం
సాక్షి, సంతబొమ్మాళి (శ్రీకాకుళం): వారంతా మాజీలుగా మారిపోయినా అధికార మత్తులోనే జోగుతున్నారు. ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లోనే మకాం వేసి తమ సొంతానికి వినియోగిస్తున్నారు. సభలు, సమావేశాలు అక్కడే నిర్వహిస్తూ అటు ప్రజలను ఇటు అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీరికి కొంతమంది అధికారులు సైతం రాచ మర్యాదలు చేస్తుండటం విడ్డూరంగా ఉంది. సంతబొమ్మాళి మండల పరిషత్ కార్యాలయంలో కొంతకాలంగా సాగుతున్న తంతు ఇది.
సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఒక వైపు వలంటీర్ల ఇంటర్వ్యూలు, మరో వైపు స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో మండల ప్రత్యేకాధికారి గదిలో టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. వీరికి సరిపడా కుర్చీలు సైతం వేయించి మండల అధికారులు సకల మర్యాదలు చేశారు. మండల ప్రత్యేకాధికారి కుర్చీలో మాజీ జెడ్పీటీసీ భర్త ఎల్‌ఎల్ నాయుడు అశీనుడయ్యారు. తనకి ఇరువైపులా మాజీ ఎంపీపీ భర్త కర్రి విష్ణుమూర్తి, మండల మాజీ ఉపాధ్యక్షుడు ఎస్ భీమారావు, పార్టీ మండలాధ్యక్షుడు జీరు భీమారావు తదితరులు కూర్చొన్నారు.
మాజీలైన వీరందరికీ అధికార మత్తు ఇంకా వదలలేదని, కార్యాలయాల్లో కూర్చుని ఇష్టానుసారంగా వ్యవహరించడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోజూ కార్యాలయంలో ఓ టీడీపీ నేత కూర్చోని తమ పనులను చక్కబెడుతున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మండల పరిషత్ అధికారులు కూడా టీడీపీ నేతలకు ఎర్ర తివాచీ పరచడంతో వారు ఆడిందే ఆటగా... పాడిందే పాటగా సాగుతోంది. ఈ విషయమై మండల ప్రత్యేకాధికారి వీవీ కృష్ణమూర్తి వివరణ కోరగా టీడీపీ నేతలు సమావేశం నిర్వహించినట్లు తనకు తెలియదని, ఇక నుంచి తన గదికి తాళం వేయాలని సిబ్బందికి చెబుతానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment