పదేళ్ల పగ | Ten revenge | Sakshi
Sakshi News home page

పదేళ్ల పగ

Published Mon, Mar 17 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM

పదేళ్ల పగ

పదేళ్ల పగ

ఫ్యాక్షన్ ప్రాంతంగా ముద్ర పడిన నందికొట్కూరు నియోజకవర్గంలో తమ ఆధిపత్యం చూపించుకునేందుకు ప్రత్యర్థులు నందికొట్కూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సాయి ఈశ్వరుడిని అంతమొందించినట్లు తెలుస్తోంది.

కొన్ని వ్యవహారాల్లో అంతర్గతంగా అడ్డుపడుతున్నాడనే కారణంతోపాటు తమ సత్తాను చాటుకునేందుకు దారుణానికి పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెరైడ్డి రాశేఖరరెడ్డి ముఖ్య అనుచరుడుగా 1989 నుంచి 2002 వరకు కొనసాగిన సాయి ఈశ్వరుడిపై ముచ్చుమర్రి స్టేషన్‌లో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.  అతని ఎదుగుదలను ఓర్వలేని కొందరుగతంలో దాడి చేయించి కొనప్రాణంతో వదిలివేశారు.

అనంతరం అతని ఇంటి పైకప్పును పెకలించి ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఆ ఇంటి మొండి గోడలు ఆ సంఘటనకు సాక్ష్యాలుగా మిగిలి ఉన్నాయి. ఆయన ఫ్యాక్షన్‌కు దూరంగా దశాబ్ద కాలంపాటు కర్నూలులోనే ఉంటూ ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఈ క్రమంలో హత్యకు గురికావడం జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది. ఎన్నికల వేళ ఫ్యాక్షన్ హత్యతో స్థానిక నాయకులు వణికిపోతున్నారు. పదేళ్లుగా ఒక్కొక్కరు ఫ్యాక్షన్ రక్కసి నుంచి బయటపడిన నాయకులు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో ఈ హత్యతో బరిలో నిలిచేందుకు కూడా జంకుతున్నారు. మరో వైపు గతంలో తమపై ఉన్న పాత కేసులు తవ్వుతారేమోనని భయాందోళన చెందుతున్నారు.

 అంతా నిశ్శబ్దం : సాయి ఈశ్వరుడు హత్యోదంతంతో ముచ్చుమర్రిలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. గ్రామంలో ప్రజలు మరొకరితో మాట్లాడేందుకు కూడా భయపడుతున్నారు. హత్య జరిగిన స్థలంలో లభించిన సెల్‌ఫోన్ గ్రామానికి చెందిన చికెన్ బాషదిగా వెలుగు చూడటంతో బెరైడ్డి సిద్ధార్థరెడ్డి ముఖ్య అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లారు. స్పెషల్ పార్టీ పోలీసు బలగాలు ముచ్చుమర్రిలోని ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నాయి.

ఉదయం నుంచి గ్రామంలో కవాతు చేస్తూ ప్రజలు గుంపులుగా లేకుండా చెదరగొడుతున్నాయి.  హత్య స్థలంలో దొరికిన సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు గ్రామంలో అనుమానితులుగా శ్రీనివాసరెడ్డిని విచారించారు. బెరైడ్డి సిద్ధార్థరెడ్డి కారు డ్రైవర్ హరినాథ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన వెంటనే దుండగులు ఓ ఆటోలో పారిపోగా ఆ ఆటో డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు.    ఆత్మకూరు డీఎస్పీ నరసింహారెడ్డి ఆదివారం ముచ్చుమర్రిని సందర్శించారు. గ్రామంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని స్పెషల్ పార్టీ బలగాలను ఆయన ఆదేశించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement