నెల్లూరు(విద్య): పరీక్షలు దగ్గర పడుతున్నాయి... టైమ్ వేస్ట్ చేయొద్దు.. కొత్త మెటీరియల్ వచ్చింది. చూశావా... అంటూ పదో తరగతి విద్యార్థులను టీచర్లు, బంధువులు అడుగుతుంటే విద్యార్థుల్లో రోజురోజుకీ ఒత్తిడి పెరిగిపోతోంది. కారణం రోజుకొక కొత్త మెటీరియల్ మార్కెట్‌లోకి విడుదల కావడమే. స్పెషల్ మెటీరియల్ టెన్త్ విద్యార్థులపై మోయలేని భారంగా తయారవుతున్నాయి. నవంబర్ నెలాఖరు వరకు పరీక్షల విధానం ఖరారు కాలేదు. కొత్త సిలబస్, పాత పరీక్షా పద్ధతిని ఖరారు చేసినప్పటి నుంచి మెటీరియల్ రూపకల్పన ప్రారంభమైంది. సంక్రాంతి సెలవుల నుంచి ఈ మెటీరియల్స్ మార్కెట్లోకి పుట్టగొడుగుల్లా వెలిశాయి. వర్క్‌బుక్స్, స్టడీ మెటీరియల్స్, బిట్‌బ్యాంక్స్, ఆల్ ఇన్ ఒన్స్ అందుబాటులోకి వచ్చాయి. కొత్తపుస్తకం మార్కెట్‌లోకి విడుదలైన వెంటనే ఆ పుస్తకాన్ని చదవాలంటూ రకరకాలుగా ప్రచారాలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏ పుస్తకం చదవకపోతే మార్కులు తగ్గిపోతాయోనన్న భయం పిల్లలను చదివింది కాస్తా మరచిపోయేలా చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
తల్లిదండ్రులకు మోయలేని భారం
ఇదిలా ఉంటే మార్కెట్‌లోకి విడుదలైన ప్రతి స్పెషల్ మెటీరియల్‌ను కొనేందుకు తల్లిదండ్రులు డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో పరీక్షలకు సిద్ధపడాల్సిన విద్యార్థులను లాభపేక్షతో కొందరు ఇబ్బందులపాలు చేస్తున్నారు. తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్నారు.
డబ్బులు వెచ్చించి తమ పిల్లలను మరింత మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారన్న విషయాన్ని తల్లిదండ్రులు విస్మరిస్తున్నారు. తమ పిల్లలకు మంచి మార్కులు రావాలనే క్రమంలో అప్పులపాలైనా పర్వాలేదని మార్కెట్‌లో ఉండే స్పెషల్ మెటీరియల్స్‌ను కొంటున్నారు. పిల్లవాడిపై పడుతున్న భారం వారికి గుర్తుకు రాకపోవడం బాధాకరమని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి
మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు 34,680 విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో జెడ్పీ పాఠశాలల నుంచి 15,691 మంది, ప్రభుత్వ పాఠశాలల నుంచి 1,070 మంది, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల నుంచి 1,348 మంది, వెల్ఫేర్ పాఠశాలల నుంచి 1,714 మంది, కేజీబీవీల నుంచి 337 మంది, ఎయిడెడ్ పాఠశాలల నుంచి 1,170 మంది, ప్రైవేటు పాఠశాలల నుంచి 13,344 మంది, ప్రైవేటుగా 1,437 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ఆంగ్లమాధ్యమంలో 17,890, తెలుగు మాధ్యమంలో 16,778 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఒక్కొక్క మెటీరియల్ సగటున రూ.150 వేసుకున్నప్పటికీ 10 మెటీరియల్స్ కొనడం తల్లిదండ్రుల ఆర్థిక భారమవుతుంది. వాటిని చూస్తేనే పిల్లల్లో ఆందోళన పెరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఇబ్బడిముబ్బడిగా వస్తున్న ఈ స్పెషల్ మెటీరియల్స్‌పై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది.
ఉపాధ్యాయుల ఆరాటం
ఉత్తమ ఫలితాలను సాధించాలనే ఆరాటంతో కొందరు టీచర్లు కూడా విద్యార్థులపై ఒత్తిడి కలిగిస్తున్నారు అనే ఆరోపణలున్నాయి. పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గితే కఠినచర్యలు తీసుకుంటామని ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పదేపదే హెచ్చరిస్తుండటంతో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల మానసిక పరిస్థితులను గమనించకుండా రకరకాల మెటీరియళ్లపై దృష్టిపెడుతున్నారు. ప్రైవేటు పాఠశాలల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కొన్ని ప్రైవేటు స్కూళ్లు సిండికేట్లుగా ఏర్పడి ఏకంగా పబ్లిషర్స్‌తో ఒప్పందాలు చేసుకుని తమ పాఠశాలల్లో ఆ మెటీరియళ్లను మాత్రమే వాడేలా చూస్తున్నారు.
కొత్త అంశాల జోలికి వెళ్లొద్దు
పరీక్షల కోసం కొత్త అంశాల జోలికి వెళ్లవద్దు. ఏడాది పొడవునా చదివిన పాఠ్యాంశాలనే మళ్లీ మళ్లీ చదవండి. ప్రభుత్వం ఇచ్చిన మెటీరియల్ బాగుంది. ఒత్తిడికి గురికాకుండా ఉండాలంటే మనకు వచ్చిన అంశాలనే పరీక్షల కోసం పునశ్ఛరణ చేసుకోవాల్సిన సమయం ఇది. కొత్త అంశాల కోసం ఆరాటపడితే నేర్చుకున్న అంశాలను కూడా మరిచిపోయే అవకాశం ఉంది.
- ఆంజనేయులు డీఈఓ