
విద్యుత్ బిల్లుతో రిక్షా కార్మికుడు పెంటయ్య
బలిజిపేట: విద్యుత్ శాఖ సిబ్బంది ఓ రిక్షా కార్మికుని ఇంటికి ఇచ్చిన విద్యుత్ బిల్లు అక్షరాలా రూ.పది వేలు. దీన్ని చూసిన ఆ కార్మికుడు నిజంగానే షాక్‌కు గురయ్యాడు. బిల్లులో వాడిన యూనిట్లు రెండుగా చూపి..బిల్లు మాత్రం రూ.పది వేలుగా చూపడంతో ఆ ఇంటి యజమాని కంగుతిన్నాడు. వివరాల్లోకి వెళ్తే...పలగర గ్రామానికి చెందిన రిక్షా కార్మికుడు నులక పెంటయ్య ఇంటికి ఫిబ్రవరి నెలకు సంబంధించి విద్యుత్ బిల్లు రూ.10,357లు వచ్చింది. దీంతో యజమాని అవాక్కయ్యాడు. పెంటయ్య పలగర ఎస్సీ కాలనీలో నివాసముంటున్నాడు.
ఆ రిక్షా కార్మికుని ఇంట్లో రెండు బల్బులు, ఒక ఫ్యాన్, టీవీ ఉన్నాయి. రిక్షా కార్మికుడు కావడంతో ఉదయం సాయంత్రం వరకు రిక్షాతో పాటు ఆయన బయటే ఉంటారు. ఫిబ్రవరి నెలలో కుటుంబ సభ్యులు కూడా వలసపోవడంతో ఒక్కడే ఉంటున్నాడు. పెంటయ్య సర్వీసు నంబరు 354 కాగా వచ్చిన బిల్లు రూ.పది వేలు దాటిపోవడంతో లబోదిబోమంటున్నాడు. ఆ బిల్లులో పూర్వపు రీడింగ్ 1669 ఉండగా ప్రస్తుత రీడింగ్ 1671 ఉంది. అంటే కేవలం రెండు యూనిట్లు మాత్రమే వినియోగించినట్టు లెక్క తేల్చారు. కానీ బిల్లు మాత్రం గూబ గుయ్యమనిపించారు. పెంటయ్యకు ఏం చేయాలో తెలియక సంబంధిత శాఖాధికారులను సంప్రదించగా అదంతే...అన్నట్టుగా సమాధానం చెప్పి పంపారు.
Comments
Please login to add a commentAdd a comment