చిత్తూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: సేద్యంలో యంత్రాల వినియోగంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. కూలీల ఖర్చు తగ్గుతుండడం, పనులు త్వరగా అవుతుండడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. జిల్లాలో ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్‌లో 1.35 లక్షల హెక్టార్లు, రబీ సీజన్‌లో 17 వేల హెక్టార్లల్లో రైతులు వేరుశెనగ పంటను సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో కూలీలు, ఇతర ఖర్చులు తలకు మించిన భారంగా మారుతున్నాయి.
అదే సమయంలో అధికారులు పరిచయం చేస్తున్న యంత్రాలు రైతులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా డ్రమ్ సీడర్ (విత్తనాలను నాటే యంత్రం) రైతులకు ఎంతో ఉపయోగపడుతోంది. దీని ద్వారా గంట వ్యవధిలో 2.5 ఎకరాల పొలంలో విత్తనాలు నాటుకోవచ్చు. యూనిట్ ధర రూ.4,500. రాయితీపై రైతులకు 2500 రూపాయలకే అందజేస్తున్నారు. ఈ యంత్రానికి డిమాండ్ అధికంగా ఉండడంతో ఇప్పటివరకు 170 డ్రమ్ సీడర్ల కోసం ఇండెట్ పెట్టామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
ఇవి మరో రెండు రోజుల్లో కోయంబొత్తూరు నుంచి జిల్లాకు రానున్నాయని ఏడీ మనోహర్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. యాంత్రికీకరణ కోసం రూ.17 కోట్ల నిధులు శాఖలో ఉన్నాయని చెప్పారు. యాంత్రికీకరణ విధానంలో రైతులకు అవసరమైన మేరకు యం త్రా లు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అంతేకాకుండా రైతుల స్వయం సహాయక గ్రూపులకు యంత్ర పనిముట్లను మంజూరు చేసే సౌలభ్యం ఉందని వివరించారు. వచ్చే ఖరీఫ్ నుంచి కేవలం డ్రమ్‌సీడర్ల ద్వారా రైతులు వేరుశెనగ విత్తనాలు వేసేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు.
యాంత్రికీకరణపై రైతన్న మొగ్గు
Published Thu, Jan 16 2014 5:59 AM | Last Updated on Tue, Oct 16 2018 3:04 PM
Advertisement