
కంపెనీ వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులు
మచిలీపట్నంసబర్బన్: భారత్ సాల్ట్ కంపెనీ వద్ద బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ డిమాండ్‌లను పరిష్కరించాలంటూ కార్మికులు కంపెనీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి యాజమాన్యం, కార్మికుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. మండల పరిధిలోని పల్లెతుమ్మలపాలెం గ్రామంలో ఉన్న ఈ కంపెనీలో పల్లెతుమ్మలపాలెం, కోన, పాతేరు, పోలాటితిప్ప గ్రామాల్లోని 1500 మంది పనిచేస్తున్నారు. కొందరు టీడీపీ నాయకుల అండతో కంపెనీ యాజమాన్యం కొద్ది రోజులుగా నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26వ తేదీ నుంచి కార్మికులు 48 గంటల రిలే నిరాహార దీక్షలకు దిగారు. డిమాండ్‌లను పరిష్కరించేందుకు యాజమాన్యం ససేమిరా అనడంతో కార్మికులు ఆందోళనను ఉధృతం చేశారు.
పేర్ని నాని చర్చలు విఫలం
విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య(నాని) హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కార్మికుల తరుపున డిమాండ్‌ల సాధనపై యాజమాన్యంతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. దాదాపు 3 గంటలపాటు కార్మికుల సమక్షంలో చర్చలు జరిగాయి. కార్మికుల వేతనాలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమచేయాలనే డిమాండ్‌ను మాత్రమే యాజమాన్యం అంగీకరించింది. మిగిలిన డిమాండ్‌లపై చర్చ జరుగుతుండగానే కంపెనీ మేనేజర్ వి.ప్రసాదరావు వెళ్లిపోవడంతో ఆందోళన మరింత ఉధృతమైంది. మేనేజర్, యాజమాన్యం వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని పేర్ని నాని చెప్పారు. బుధవారం రాత్రి కంపెనీ వద్ద కార్మికులు, వైఎస్సార్ సీపీ నాయకులు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేర్ని నానితోపాటు నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు లంకే వెంకటేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్, మాదివాడ రాము తదితరులు కార్మికులకు అండగా నిలిచారు.
ముగిసిన దీక్ష
భారత్‌సాల్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు మోకా నాగరాజు, గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రాయవరపు సత్యభామ, కార్యదర్శి కుమారస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల రిలే దీక్షలు బుధవారంతో ముగిసింది. కార్మికుల డిమాండ్‌లను యాజమాన్యం అంగీకరించకపోవడంతో తదుపరి కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని యూనియన్ నాయకులు తెలిపారు. యాజమాన్యానికి డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఆందోళన నేపథ్యంలో మూడు రోజుల పాటు కంపెనీలో పనులు నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment