సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సార్వత్రిక ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సిద్ధమవుతుండగా, అకస్మాత్తుగా మునిసిపల్ ఎన్నికలు వచ్చాయి. రాజకీయపార్టీల నాయకులు అయోమయంలో పడ్డారు. సార్వత్రిక ఎన్నికలు అయిన తరువాత మునిసిపల్ ఎన్నికలు వస్తాయని రాజకీయ పార్టీల నేతలు భావించారు. ఊహించని విధంగా పురపాలక పోరు ముందే వచ్చింది. దీంతోపాటు మునిసిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. రిజర్వేషన్లకు తగిన అభ్యర్థిని ఎంపిక చేసుకోవడం సమస్యగా మారింది.
అంతవరకు టికెట్లు ఆశిస్తున్న వివిధ పార్టీ నాయకులు, రిజర్వేషన్లు కేటాయించడంతో, తమకు సీటు దక్కదని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లు తమకు సీటు వస్తుందని, భారీగా చేసిన ఖర్చులు వృధా అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది తమకు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ముఖ్యంగా గందరగోళం తెలుగు దేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారడంతో నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ఆందోళన చెందుతున్నారు. పురపాలక సంఘాల ఎన్నికలు జరిగే చీరాలను మాత్రమే ఓసీ జనరల్‌కు కేటాయించారు. మిగిలినవన్నీ రిజర్వేషన్లు కావడంతో అభ్యర్థుల కోసం వేట ప్రారంభించారు.
మార్కాపురం ఓసీ మహిళకు, అద్దంకి ఎస్సీ మహిళకు, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరులను బీసీలకు కేటాయించారు. దీంతో ఆ రిజర్వేషన్లకు తగిన విధంగా అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు నాయకులు పరుగులు తీస్తున్నారు. ఈనెల 10 నుంచి నామినేషన్ల దాఖలు మొదలవుతోంది. వారం రోజులు కూడా గడువు లేదని నాయకులు ఆందోళనపడుతున్నారు. అభ్యర్థుల జాబితాలను తీసుకుని పార్టీల అధిష్టానం నాయకులను కలుసుకునేందుకు జిల్లా నాయకులు హైదరాబాద్‌కు బయలుదేరుతున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెసు పార్టీ తరపున పోటీ చేసేందుకు అన్ని వార్డులకు అభ్యర్థుల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది.
పోటీచేసేందుకు ఎవరు ముందుకు వచ్చినా వారికి అవకాశం కల్పించడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకులు పార్టీలో కొనసాగుతారో లేదో తెలియని పరిస్థితి. దీంతో వారు కూడా ఏ నిర్ణయం తీసుకోలేక, పార్టీ హైకమాండ్ వైపునకు వేలు చూపిస్తున్నారు. దొరికిన అభ్యర్థుల జాబాతాను తీసుకుని తెలుగుదేశం పార్టీ జిల్లా ఇన్‌చార్జి హుటాహుటిన హైదరాబాద్‌కు ప్రయాణం కావడానికి సన్నాహమవుతున్నట్లు తెలిసింది. రిజర్వేషన్లకు తగిన అభ్యర్థులు దొరకనిచోట ఏదో ఒక పేరును రాసుకుని వెళ్లి, అధినేత చంద్రబాబును సంతృప్తిపరిచే యత్నంలో ఉన్నట్లు తెలిసింది. మరోవైపు మునిసిపల్ ఎన్నికల్లో చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతం ప్రభావం గుదిబండగా మారుతుందని ఆ పార్టీ నేతలే భయపడుతున్నారు.
ముందే వచ్చిన మున్సిపల్ ఎన్నికలు
Published Tue, Mar 4 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 4:19 AM
Advertisement
Advertisement