టీడీపీలో అంతర్మథనం!  | TDP Lack Of Supporters To Contest In Municipal Elections | Sakshi
Sakshi News home page

అభ్యర్థులు కరువు.. టీడీపీ పడరాని పాట్లు!

Published Fri, Feb 26 2021 3:27 PM | Last Updated on Fri, Feb 26 2021 7:09 PM

TDP Lack Of Supporters To Contest In Municipal Elections - Sakshi

రెండేళ్ల క్రితం సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన టీడీపీ పరాజయ యాత్రను కొనసాగిస్తోంది. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో నాలుగు దశల్లోనూ ఉనికి చాటేందుకు ఆ పార్టీ పడరాని పాట్లు పడింది. తమ పార్టీ మద్దతుదారులు కాని వారిని తమ వారేనని చెబుతూ బుకాయించింది. వాస్తవానికి వరుస పరాజయాలు, వైఫల్యాలు టీడీపీ ముఖ్య నేతలను అంతర్మథనంలో పడేశాయి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా క్షేత్ర స్థాయిలో టీడీపీ పరిస్థితి పూర్తిగా దిగజారింది. త్వరలో నిర్వహించనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగేందుకు అభ్యర్థులు సాహసం చేయలేకపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.                   

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పంచాయతీ ఎన్నికల్లో తన మద్దతుదారులతో కనీస పోటీ ఇవ్వలేకపోయిన టీడీపీ.. మున్సి‘పోల్‌’ సమరానికి ముందే ఢీలా పడింది! పంచాయితీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా స్థానాల్లో సత్తా చాటిన వైఎస్సార్‌ సీపీ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగించేందుకు దూకుడు పెంచింది. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో వైఎస్సార్‌ సీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయగా టీడీపీ తరఫున పోటీ చేసే వారు కరువయ్యారు. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కావడం, గత ఏడాది ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచే మొదలుపెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే.

జిల్లాలో ఒంగోలు నగరపాలక సంస్థతోపాటు ఆరు పురపాలక సంఘాలకు ఈ నెల 10వ తేదీన ఎన్నికలు నిర్వహించి 14వ తేదీన ఓట్ల లెక్కించనున్నారు. గత ఏడాది జరిగిన నామినేషన్ల ప్రక్రియలో అన్ని మున్సిపాలిటీల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఆ సమయంలో అనామకులతో నామినేషన్లు వేయించి పరువు దక్కించుకునేందుకు టీడీపీ ప్రయత్నించింది. ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు అన్ని మున్సిపాలిటీల్లో ఇండిపెండెట్‌ అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేశారు. టీడీపీ తరఫున మాత్రం పోటీలో నిలిచేందుకు అభ్యర్థులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుని కూర్చున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలు, ఇటీవల పంచాయితీ ఎన్నికల్లోనూ ఘోర ఓటమి తర్వాత భయాందోళనలో ఉన్న టీడీపీకి పురపాలక సంఘాల ఎన్నికలు మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా మారాయి.

పరువు కాపాడుకునేందుకు అభ్యర్థులను బతిమాలి పురపాలక సంఘాల్లో నామినేషన్లు వేయించినా ఈ నెల 3వ తేదీ వరకు ఉపసంహరించుకోకుండా చూసేందుకు ఆ పార్టీ నేతలు నానాతంటాలు పడుతున్నారు. జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో కనీసం వార్డులకు సైతం అబ్యర్థులను నిలపలేని దుస్థితి టీడీపీకి ఏర్పడింది. టీడీపీ అభ్యర్థులతో పోలిస్తే ఇండింపెండెంట్‌లే అత్యధికంగా నామినేషన్లు వేశారంటే టీడీపీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. నామినేషన్‌ వేసిన వారు సైతం పోటీ నుంచి తప్పుకోవాలని యోచిస్తుండటంతో టీడీపీ నేతలకు నిద్ర పట్టడం లేదు. ఇక బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌ పార్టీల పరిస్థితి చెప్పనవసరం లేదు.   

చీరాల మున్సిపాలిటీలో టీడీపీకి అభ్యర్థులు కరువు 
చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్సీ పోతుల సునీత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు మద్దతు తెలపడం, కరణం తనయుడు వెంకటేశ్‌, మాజీ మంత్రి పాలేటి రామారావు టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరడంతో చీరాల టీడీపీ ఖాళీ అయింది. దీంతో అక్కడ టీడీపీకి అభ్యర్థులు కరువయ్యారు. చీరాల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా 13 వార్డుల్లో టీడీపీ తరఫున ఎవరూ బరిలోకి దిగలేదు.

ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేసిన వారు సైతం పోటీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఒంగోలు నగరపాలక సంస్థతోపాటు జిల్లాలోని మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, చీమకుర్తి వంటి చోట్ల సైతం టీడీపీకి అభ్యర్థులు దొరకక అనామకులతో నామినేషన్‌ వేయించారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసేనాటికి సగం మందికి పైగా పోటీ నుంచి తప్పుకుంటారనే విషయం టీడీపీ నేతలకు స్పష్టంగా తెలిసినప్పటికీ ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నారు.

చదవండిబాబు బూతు పురాణం: రెచ్చగొట్టి.. రచ్చచేసి!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement