సాక్షి, ఖమ్మం: మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలతో పాటే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా నగారా మోగనుంది. ఈ ఎన్నికల ఆలస్యంపై సుప్రీంకోర్టు రాష్ట్రానికి మొట్టికాయలు వేసింది. ఈ పరిణామంతో జిల్లా అధికార యంత్రాంగం పరుగులు పెడుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సోమవారం నోటిఫికేషన్ వెలువడితే ఇక జిల్లాలో పరిషత్ ఎన్నికల కోలాహలం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజర్వేషన్లను అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.
జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల పదవీకాలం పూర్తయి మూడేళ్లు కావస్తున్నా.. ఎన్నికల నిర్వహించకుండా ప్రభుత్వం కాలయాపన చేసింది. దీంతో జిల్లా, మండల స్థాయి అధికారులే మండలాల్లో అభివృద్ధి పనులు, ఇతర కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మండల, జిల్లా పరిషత్‌లకు పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. ప్రశ్నించేవారు లేకపోవడం, ప్రభుత్వం ఇష్జారాజ్యంగా వ్యవహరించడంతో గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ఈ ఎన్నికల రిజర్వేషన్లలో వచ్చిన తేడాతో గతంలో కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఎలక్షన్లు నిలిచిపోయాయి.
అయితే రెండురోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో ఇప్పుడు అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వారు ముందస్తుగానే ఎంపీటీసీల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లాలోని 640 ఎంపీటీసీ స్థానాలకు గాను ఎస్టీలకు 225, ఎస్సీలకు 110, బీసీలకు 106, ఇతరులకు 199 స్థానాలను రిజర్వు చేశారు. ఇక జడ్పీటీసీ రిజర్వేషన్లను కూడా సుప్రీంకోర్టు తీర్పుకన్నా ఒకరోజు ముందే వెల్లడించారు. 46 జడ్పీటీసీ స్థానాలలో ఎస్టీ జనరల్‌కు 7, ఎస్టీ మహిళలకు 8, ఎస్సీ జనరల్ 4, ఎస్సీ మహిళలకు 4, జనరల్ 7, బీసీ జనరల్ 5, బీసీ మహిళ 5, జనరల్ మహిళల కు 6 స్థానాలు రిజర్వు అయ్యాయి.
ఆశావహుల ఎదురుచూపు..
పరిషత్ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు సుప్రీంకోర్టు తీర్పు కలిసివచ్చింది. సార్వత్రిక ఎన్నికల ముందే ఈ ఎలక్షన్లు వస్తుం డడం, ఇవి కూడా పార్టీ గుర్తుపైనే ఉండడంతో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చును కూడా భరించకతప్పదని ‘పరిషత్’ అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ వెలువడితే ఇక తమ ప్రచారం ఖర్చు తగ్గినట్లేనని భావిస్తున్నారు. కాగా, ఈ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు ముందే ఉంటాయన్న ప్రచారం జరుగుతుండడంతో తమపై వీటి ప్రభావం ఉంటుందని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. గ్రామస్థాయిలో పరిషత్ ఎన్నికలు కీలకం కావడంతో అన్ని పార్టీలూ అభ్యర్థుల వేటలో తలమునకలయ్యాయి. కొన్ని రోజులుగా పరిషత్ ఎన్నికల నిర్వహణపై ప్రచారం జరుగుతుండడంతో గతంలో పోటీ చేసిన అభ్యర్థులు మళ్లీ తమ భవిష్యత్‌ను పరీక్షించుకునేందుకు బరిలో నిలవాలన్న యోచనలో ఉన్నారు.
ఓటర్ల జాబితాపై అధికారుల తర్జనభర్జన..
మున్సిపల్ ఎన్నికల ఓట్లను అధికారులు వార్డుల వారీగా ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా కూడా అప్పుడే సిద్ధం చేశారు. ప్రస్తుతం పరిషత్ ఎన్నికల ఓటర్ల జాబితాపై వారు తర్జనభర్జన పడుతున్నారు. నియోజకవర్గంలో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఓట్లను తీసేసి జడ్పీటీసీ, ఎంపీటీసీల పరిధిలో ఉన్న ఓట్ల జాబితా సిద్ధం చేయాలంటే తలకు మించిన భారమే. రిజర్వేషన్లు సిద్ధం చేసి పెట్టుకున్న అధికారులు.. ఓటర్ల జాబితాపై మాత్రం కసరత్తు చేయక తప్పడం లేదు. మండలాల వారీగా గతంలో ఎంపీటీసీ పరిధిలో ఉన్న ఓట్ల జాబితాను తొలుత తయారు చేస్తారు. ఆ తర్వాత జడ్పీటీసీల ఓట్ల లెక్క తేలనుంది. రెండు నెలల్లోనే మున్సిపల్, పరిషత్, సార్వత్రిక ఎన్నికలు వస్తుండడడంతో అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఉన్న సిబ్బందితోనే ఈ ఎన్నికలను నిర్వహించడం భారమైనా.. ఒకదానిపై ఒకటి వస్తుండడంతో ఏం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు.
మోగనున్న స్థానిక నగారా
Published Sat, Mar 8 2014 2:08 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM
Advertisement
Advertisement