పశ్చిమగోదావరి జిల్లా అట్టుడుకుతోంది. ఆక్వా ఫుడ్‌పార్కు పెడితే దాన్నుంచి వెల్లువెత్తే కాలుష్యం కారణంగా తమ జీవనం మొత్తం అస్తవ్యస్తం అవుతుందని గగ్గోలు పెడుతున్న తుందుర్రు పరిసర గ్రామాల వాసులను పోలీసులు ఈడ్చిపారేశారు. ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మహిళలను మహిళా దినోత్సవం అని కూడా చూసుకోకుండా లాఠీలతో కుమ్మేశారు. గర్భిణులను కూడా ఎత్తుకెళ్లి జీపుల్లో వేసి స్టేషన్లకు తీసుకెళ్లారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ప్రయత్నించిన నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్టులు, హౌస్ అరెస్టులు చేశారు. పలువురు వైఎస్ఆర్‌సీపీ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ప్రజల మనోభావాలను గుర్తించరా?
ప్రజల మనోభావాలను గుర్తించకుండా.. తీరప్రాంత ప్రజలను దారుణంగా నిర్బంధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్‌సీపీ నాయకుడు ముదునూరి ప్రసాదరాజు మండిపడ్డారు. నిర్బంధాల ద్వారా ప్రజావ్యతిరేకతను ప్రభుత్వం ఆపలేదని ఆయన అన్నారు. ఈ ఫ్యాక్టరీ కడితే నీళ్లకు చాలా ఇబ్బంది అవుతుందని, మత్స్యకారుల జీవన విధానం దెబ్బతింటుందని చెప్పారు. వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వచ్చి తుందుర్రు పరిసర ప్రాంత వాసులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ఫ్యాక్టరీలకు తాము వ్యతిరేకం కాదని, సముద్రతీర ప్రాంతానికి ఇదే నియోజకవర్గంలో కట్టాలని తామంతా కూడా కోరామని.. దాని నిర్మాణానికి సహకరిస్తామని చెప్పామని అన్నారు. కానీ ప్రభుత్వం మొండివైఖరితో ఆరు నెలల నుంచి ఈ గ్రామాల్లో పోలీసులను మోహరిస్తున్నారని, 144 సెక్షన్ పెట్టి ప్రజలను నిర్బంధిస్తున్నారని తెలిపారు. ఈ ఫ్యాక్టరీని ఇదే నియోజకవర్గంలో ఎవరికీ నష్టంలేని చోట తీరప్రాంతంలో కడితే, ఉపాధి అవకాశాలు కూడా ఇక్కడివారికే వస్తాయని తెలిపారు.
రాష్ట్రమంతా రౌడీరాజ్యం చేస్తున్నారు
ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రమంతటినీ రౌడీ రాజ్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్‌సీపీ నాయకుడు గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. ఇక్కడ దాదాపు 2వేల మంది పోలీసులను పెట్టారని, తమ సొంత ఊళ్లలో తిరగాలన్నా కూడా ఆధార్ కార్డులు పట్టుకుని తిరగాల్సి వస్తోందని అన్నారు. అసలు తొలుత పబ్లిక్ హియరింగ్ జరిపించి, ప్రజల అనుమతితోనే ఫ్యాక్టరీ కడతామని అందరూ చెప్పారని, కానీ అసలు పబ్లిక్ హియరింగ్ అన్నదే చేయలేదని తెలిపారు. పోలీసులు మఫ్టీలో ఉండి ప్రజల్లో కలిసిపోయి దారుణాలు చేస్తున్నారని, మహిళలను కూడా అరెస్టు చేసి ఈడ్చేస్తున్నారని వాపోయారు. చంద్రబాబు నేతృత్వంలో ఇక్కడ రాక్షస పాలన కొనసాగుతోందని, ప్రభుత్వం ఫ్యాక్టరీ యాజమాన్యానికి వంతపాడుతోందని మండిపడ్డారు. పోలీసులను అడుగుదామని అనుకుంటే తమను పొద్దుట నుంచి ఒక్క అడుగు కూడా బయటకు వేయనీయకుండా హౌస్ అరెస్టు చేశారన్నారు. తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏం చెప్పాలని ఆయన అన్నారు.