పరీక్షా ఫలితాలు-2015కు సంబంధించిన విద్యార్థులు తమ జవాబు పత్రాల పునఃపరిశీలన (రీవెరిఫికేషన్),
విజయనగరం అర్బన్ : పదోతరగతి పరీక్షా ఫలితాలు-2015కు సంబంధించిన విద్యార్థులు తమ జవాబు పత్రాల పునఃపరిశీలన (రీవెరిఫికేషన్), పునఃగణన (రీకౌంటింగ్)కు దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్‌ను విద్యాశాఖ ప్రకటించింది. ఫలితాలు వెలువడిన 12 రోజుల (జూన్ 2వ తేదీ) లోపు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చారు. దరఖాస్తులను ‘బీఎస్‌ఈఏపీ.ఓఆర్‌జీ’ వెబ్‌సైట్ నుంచి విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. రీ వెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చలానా చెల్లించాలన్నారు. దరఖాస్తులను సంబంధిత ప్రధానోపాధ్యాయుని ద్వారా డీఈఓ కార్యాలయానికి అందజేయాలని పేర్కొన్నారు.
రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునే వారు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చలాణా చెల్లించాలని, ఈ దరఖాస్తులను కూడా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చనని తెలిపారు. ఈ దరఖాస్తులను సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా నేరుగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపించాలన్నారు. రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకునే వారు ప్రత్యేకంగా రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వారు రాసిన జవాబు పత్రాల ఫొటోస్టాట్ కాపీలను పోస్టులో పంపించాలన్నారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు సంబంధించిన విద్యార్థులు తప్పనిసరిగా ఫీజులు చలాణా రూపంలోనే చెల్లించాలన్నారు. బ్యాంక్ డిమాండ్ డ్రాఫ్ట్‌లను అనుమతించరని తెలిపారు.
10వ తరగతి ఫెయిలైన విద్యార్థులకు జూన్ 18వ తేదీ నుంచి జులై 1వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయన్నారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేవారు జూన్ 2వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని, మూడు సబ్జెక్టుల వరకు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 పరీక్ష ఫీజును చెల్లించాలని తెలిపారు. విద్యార్థులు చెల్లించిన పరీక్ష ఫీజును ప్రధానోపాధ్యాయులు 4వ తేదీన బ్యాంకుల్లో చలాణా తీయాలన్నారు. కంప్యూటర్ ఎక్స్‌ట్రాక్టులను జూన్ 6న ప్రధానోపాధ్యాయులు డీఈఓ కార్యాలయానికి సమర్పించాలని తెలిపారు.