Tenth Supplementary
-
మొదటి రోజు ప్రశాంతంగా పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
నిజామాబాద్‌అర్బన్: పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 372 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 79 మంది విద్యార్థులు గైర్హాజయ్యారు. ఘనంగా రేణుక ఎల్లమ్మ 14వ వార్షికోత్సవం నిజామాబాద్ సిటీ: నగరంలోని గౌతంనగర్ రేణుక ఎల్లమ్మ 14వ వార్షికోత్సవము కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. బుధవారం ఆలయానికి అమ్మవారి ఘటం తీసుకువచ్చి వేద మంత్రోచ్ఛరణాల మధ్య కల్యాణం నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి, పట్నాలు వేశారు. స్థానిక కార్పొరేటర్, ఆలయ కమిటీ చైర్మన్ శివచరణ్ ఉన్నారు. ఇంపాక్ట్ ఆధ్వర్యంలో శిక్షణ సిరికొండ: ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యచరణ తదితర అంశాలపై నిర్వహించిన శిక్షణలో సిరికొండకు చెందిన ముక్కంటి పాల్గొన్నారు. సంస్థ వ్యవస్థాపకులు గంప నాగేశ్వర్రావు 35 రోజుల పాటు శిక్షణ ఇచ్చినట్లు ముక్కంటి తెలిపారు. ఈ శిక్షణలో నేర్చుకున్న విషయాలపై ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. సంస్థ ప్రతినిధులు డాక్టర్ ఆదినారాయణరెడ్డి, ముక్కంటికి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఆర్టీసీ చైర్మన్‌ను కలిసిన ఆదిలాబాద్ ఆర్ఎం ఖలీల్‌వాడి: రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను తన నివాసంలో బుధవారం ఆదిలాబాద్ ఆర్ఎం జానీ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆర్టీసీ చైర్మన్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. డిపో మేనేజర్–1 ఆనంద్ ఉన్నారు. మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం డిచ్పల్లి: దేవనగర్ క్యాంప్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి అభిషేక్ మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు. అభిషేక్ అంత్యక్రియలు బుధవారం జరిగగా.. అభిషేక్ మృతదేహానికి కాాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ రూరల్ ఇన్చార్జి డాక్టర్ భూపతిరెడ్డి నివాళులర్పించారు. విజయేంద్ర స్వామి ప్రవచనాలు నిజామాబాద్ సిటీ: నగరంలో శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఇందూరు విజయ యాత్ర కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా విజయేంద్ర సరస్వతి స్వామి బుధవారం నగరంలోని సార్వజనిక్ గణేశ్ ఆలయాన్ని సందర్శించారు. భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. పద్మశాలి సంఘానికి హాల్ వితరణ నిజామాబాద్‌నాగారం: నగరంలోని కోటగల్లీ పద్మశాలి సంఘం–8 తర్ప వ్యవస్థాపకులు తుమ్మ మీనయ్య–రాజవ్వ జ్ఞాపకార్థం వారి మనుమళ్లు తుమ్మ సంజీవ్, శ్రీనులు ఒక హాల్‌ను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు యాదగిరి, పట్టణ అధ్యక్షులు గుజ్జేటి నర్సయ్య, జిల్లా సెక్రటరీ పుల్గం హన్మాండ్లు, తదితరులు పాల్గొన్నారు. -
సప్లిమెంటరీ పరీక్షల్లో పాసైనా రెగ్యులరే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ (జూలై, 2022) పరీక్షలు రాసే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురందించింది. ఈ పరీక్షల్లో పాసయ్యే వారిని కంపార్ట్మెంటల్ అని కాకుండా రెగ్యులర్ విద్యార్థులుగా పరిగణించనుంది. వారికి రెగ్యులర్ విద్యార్థులకు మాదిరిగానే పరీక్షల్లో వచ్చిన మార్కుల ప్రకారం డివిజన్లను కేటాయించనుంది. ఈ మేరకు నిబంధనలు సడలిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మెమో జారీ చేశారు. ఈ ఒక్క విద్యాసంవత్సరానికి మాత్రమే ఈ సడలింపు వర్తించనుందని పేర్కొన్నారు. 2021–22కి సంబంధించి పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాలను జూన్ 6న విడుదల చేశారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా స్కూళ్లు సరిగా నడవకపోవడం, ముఖ్యంగా 8, 9 తరగతుల విద్యార్థులకు పాఠాల నిర్వహణ పూర్తిస్థాయిలో లేకపోవడంతో వారు చాలా వెనుకపడ్డారు. దీంతో పదో తరగతి పరీక్షల్లో దాదాపు 2 లక్షల మంది ఉత్తీర్ణులు కాలేకపోయారు. విద్యార్థులకు వెసులుబాట్లు.. కోవిడ్‌తో తలెత్తిన ఇబ్బందులతో విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల్లో కొన్ని వెసులుబాట్లు కల్పించేలా చర్యలు తీసుకుంది. సాధారణంగా రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిలై సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులు ఆయా సబ్జెక్టులలో ఎన్ని మార్కులు సాధించినా కంపార్ట్మెంటల్ పాస్‌గానే పరిగణిస్తారు తప్ప డివిజన్లను కేటాయించరు. అయితే ఈసారి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ నిబంధన నుంచి మినహాయింపునిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్డ్ పరీక్షలకు పరీక్ష ఫీజు రద్దు జూలై 6 నుంచి 15 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు చెల్లించాల్సి న రుసుమును ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే ఈసారి రెగ్యులర్ పరీక్షల్లో పాసై కొన్ని సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చినవారికి బెటర్మెంట్ పరీక్షలు రాసుకునే అవకాశం కూడా కల్పించింది. ఇంటర్మీడియెట్‌లో తప్ప పదో తరగతిలో ఇలా బెటర్మెంట్ పరీక్షల విధానం లేదు. కానీ కోవిడ్‌తో విద్యార్థులు ఇబ్బందిపడటంతో వారికి మార్కులను పెంచుకునేందుకు ఈ అవకాశం కల్పించింది. 49, అంత కంటే తక్కువ మార్కులు వచ్చినవారు రెండు సబ్జెక్టుల్లో బెటర్మెంట్ పరీక్షలు రాసుకునేందుకు వీలు కల్పించారు. సప్లిమెంటరీ పరీక్షల సమయంలోనే ఈ బెటర్మెంట్ విద్యార్థులూ పరీక్షలు రాయనున్నారు. కాగా టెన్త్ విద్యార్థులకు మాదిరిగానే ఇంటర్మీడియెట్ విద్యార్థులను కూడా సప్లిమెంటరీ పరీక్షల్లో కంపార్ట్మెంటల్ పాస్‌గా కాకుండా రెగ్యులర్ విద్యార్థులుగా పరిగణించి డివిజన్లు ఇవ్వాలని తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు. -
6 నుంచి పది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
సాక్షి, అమరావతి: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూలై 6 నుంచి 15వ తేదీవరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సోమవారం టెన్త్ ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈనెల 7వ తేదీ నుంచి 20వ తేదీవరకు గడువు ఉందని తెలిపారు. రూ.50 ఆలస్య రుసుంతో జూన్ 21వ తేదీ నుంచి ఆయా సబ్జెక్టుల పరీక్ష తేదీకి ఒక రోజుముందు వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. విద్యార్థులకు ఊరట కల్పిస్తూ.. కరోనా కారణంగా చదువులు సరిగా ముందుకు సాగక విద్యార్థులు కొంత నష్టపోయిన నేపథ్యంలో వారికి ఊరట కల్పించేలా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్స వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు ఎన్ని మార్కులు సాధించినా వారిని కంపార్టుమెంటల్ పాస్ కింద కాకుండా పరీక్షలో ఆయా విద్యార్థులు సాధించే మార్కులను యథాతథంగా పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్ పరీక్షల మాదిరిగానే వారికి డివిజన్లను కేటాయించనున్నామని మంత్రి వివరించారు. ► ఉత్తీర్ణులైన అభ్యర్థుల మార్కులకు సంబంధించి షార్ట్ మెమోలను రెండు రోజుల అనంతరం www.bse.ap.gov.in వెబ్సైట్లో పొందుపర్చనున్నారు. ఈ మెమోల ద్వారా విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు పొందవచ్చు. ► ఫెయిలైన వారి వివరాలను మంగళవారం అధి కారిక వెబ్సైట్లో పొందుపరచనుంది. ► విత్‌హెల్డ్‌లో ఉన్న వారి ఫలితాలను ఆయా జిల్లాలనుంచి సమాచారం అందిన అనంతరం ప్రకటించనున్నారు. ► రీ కౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున చెల్లించి 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ► రీ వెరిఫికేషన్, జవాబు పత్రాల ఫొటోస్టాట్ కాపీల కోసం ఒక్కో పేపర్‌కు రూ.1,000 చొప్పున ఈనెల 20వ తేదీలోపు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ► రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసేవారు రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేయాల్సిన అవసరం లే దు. రీ వెరిఫికేషన్‌లో మార్కుల రీ కౌంటింగ్‌తో పాటు సమాధానాలు రాసిన అంశాలన్నిటికీ మార్కులు వేశారా? లేదా? అనేది పరిశీలన చే స్తారు. ఒకవేళ ప్రశ్నలకు సమాధానాలు రాసినా వాటికి మార్కులు ఇవ్వకుంటే ఆ ప్రశ్నల సమాధానాలను రీ వాల్యుయేషన్ చేసి మార్కులు కేటాయిస్తారు. రీ వెరిఫికేషన్‌లో ఆయా సమాధానాల రీ కరెక్షన్కు అవకాశం ఉండదు. అలాంటి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోరు. -
ఒక్కడి కోసం ఐదుగురు
హైదరాబాద్: ఓ డిపార్ట్మెంట్ ఆఫీసర్..మరో చీఫ్ సూపరింటెండెంట్, ఒక ఇన్విజిలేటర్.. కాపలాగా హోంగార్డు.. తనిఖీ నిమిత్తం స్క్వాడ్.. ఇలా పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల కోసం ఆయా కేంద్రాల వద్ద విద్యాశాఖ నియమించిన అధికారులు. ఈ అధికారులంతా ఒకే ఒక విద్యార్థి కోసం విధులు నిర్వర్తించిన ఘటన కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. గురువారం జరిగిన సోషల్ పేపర్–1కు మొత్తం 11 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా సాయి సందీప్ అనే విద్యార్థి మాత్రమే పరీక్ష రాసేందుకు వచ్చాడు. ఈ ఒక్కడి కోసం వీరంతా తమ విధుల్ని నిర్వర్తించారు. విషయం తెలుసుకున్న ‘సాక్షి’ప్రతినిధి స్కూల్‌కు చేరుకుని సాయి సందీప్‌ను పరీక్ష ఎలా రాశావని పలకరించగా అతడు నవ్వుతూ వెళ్లిపోయాడు. -
నేడు ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : ఎస్సెస్సీ 2016 జూన్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు సచివాలయంలోని తన చాంబర్లో ఫలితాలు విడుదల చేయనున్నారని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ ఎంఆర్ ప్రసన్న కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితాలను ‘సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్’లో చూసుకోవచ్చు. -
18 నుంచి టెన్త్ సప్లిమెంటరీ
విజయనగరం అర్బన్ : పదోతరగతి పరీక్షా ఫలితాలు-2015కు సంబంధించిన విద్యార్థులు తమ జవాబు పత్రాల పునఃపరిశీలన (రీవెరిఫికేషన్), పునఃగణన (రీకౌంటింగ్)కు దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్‌ను విద్యాశాఖ ప్రకటించింది. ఫలితాలు వెలువడిన 12 రోజుల (జూన్ 2వ తేదీ) లోపు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చారు. దరఖాస్తులను ‘బీఎస్ఈఏపీ.ఓఆర్జీ’ వెబ్సైట్ నుంచి విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. రీ వెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చలానా చెల్లించాలన్నారు. దరఖాస్తులను సంబంధిత ప్రధానోపాధ్యాయుని ద్వారా డీఈఓ కార్యాలయానికి అందజేయాలని పేర్కొన్నారు. రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునే వారు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చలాణా చెల్లించాలని, ఈ దరఖాస్తులను కూడా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చనని తెలిపారు. ఈ దరఖాస్తులను సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా నేరుగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపించాలన్నారు. రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకునే వారు ప్రత్యేకంగా రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వారు రాసిన జవాబు పత్రాల ఫొటోస్టాట్ కాపీలను పోస్టులో పంపించాలన్నారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు సంబంధించిన విద్యార్థులు తప్పనిసరిగా ఫీజులు చలాణా రూపంలోనే చెల్లించాలన్నారు. బ్యాంక్ డిమాండ్ డ్రాఫ్ట్‌లను అనుమతించరని తెలిపారు. 10వ తరగతి ఫెయిలైన విద్యార్థులకు జూన్ 18వ తేదీ నుంచి జులై 1వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయన్నారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేవారు జూన్ 2వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని, మూడు సబ్జెక్టుల వరకు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 పరీక్ష ఫీజును చెల్లించాలని తెలిపారు. విద్యార్థులు చెల్లించిన పరీక్ష ఫీజును ప్రధానోపాధ్యాయులు 4వ తేదీన బ్యాంకుల్లో చలాణా తీయాలన్నారు. కంప్యూటర్ ఎక్స్ట్రాక్టులను జూన్ 6న ప్రధానోపాధ్యాయులు డీఈఓ కార్యాలయానికి సమర్పించాలని తెలిపారు.