సబ్సిడీ లడ్డూ ఎత్తివేతకు సిఫారసు | Terms of rising ticket prices paid heavily tirumala srivaru | Sakshi
Sakshi News home page

సబ్సిడీ లడ్డూ ఎత్తివేతకు సిఫారసు

Published Fri, Jan 29 2016 10:53 PM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM

సబ్సిడీ లడ్డూ ఎత్తివేతకు సిఫారసు - Sakshi

సబ్సిడీ లడ్డూ ఎత్తివేతకు సిఫారసు

- టీటీడీ ధర్మకర్తల మండలి సబ్ కమిటీ సిఫారసు
- లడ్డూ ధర పెంచకుండా ఒక సబ్సిడీ లడ్డూ ఎత్తివేతకు సిఫారసు
- రూ.300 టికెట్లు ధర పెంచాలని కమిటీ సిఫారసు
- రూ.2650 కోట్లు దాటిన 2016-2017 టీటీడీ బడ్జెట్
- నేడు ధర్మకర్తల మండలి సమావేశంలో తుది నిర్ణయం


సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనంతోపాటు అన్ని రకాల ఆర్జిత సేవా టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ఈమేరకు టీటీడీ ధర్మకర్తల మండలి సబ్ కమిటీ నిర్ణయించింది. జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు నేతృత్వంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన సబ్ కమిటీ సమావేశానికి బోర్డు సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, శేఖర్‌రెడ్డి, సుచిత్రా ఎల్లా, పుట్టా సుధాకర్‌యాదవ్ , పిల్లి అనంత లక్ష్మి హాజరయ్యారు. ధరల పెంపుపై సుదీర్ఘంగా చర్చించారు. గర్భాలయ మూలమూర్తికి నిర్వహించే అర్చన, తోమాల, అష్టదళ పాద పద్మారాధన, అభిషేకం, వస్త్రం సేవా టికెట్ల ధరలు ఎక్కువగా పెంచాలని నిర్ణయించారు. బంగారు వాకిలిలో నిర్వహించే సహస్రదీపాలకంరణ సేవ, తిరుప్పావైతోపాటు ఉత్సవమూర్తులకు నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు తక్కువ మోతాదులో పెంచాలని నిర్ణయించారు. సామాన్య భక్తులపై అధికంగా ప్రభావం చూపే లడ్డూ ధరను కూడా యథావిధిగానే కొనసాగించాలని సభ్యులు ఎక్కువ మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయటంతో లడ్డూ ధర పెంచటాన్ని విరమించుకున్నారు.

ఇప్పటి వరకు సర్వదర్శనం, కాలిబాట భక్తులకు ఇస్తున్న రూ.10 చొప్పున రెండు లడ్డూల్లో ఇకపై ఒక లడ్డూ మాత్రమే ఇవ్వాలని కమిటీ సిఫారసు చేసింది. తిరుమల, తిరుపతిలోని అతిథిగృహాల గదులు, కాటేజీలతోపాటు దేశవ్యాప్తంగా ఉండే కల్యాణమండపాల అద్దెలు కూడా 50 నుంచి 100 శాతం పైబడి పెంచాలని ధర్మకర్తల మండలి సబ్‌కమిటీ నిర్ణయించింది. ఇక ఏటా సుమారు రూ.130 కోట్ల రాబడి కల్పించే రూ.300 ఆన్‌లైన్ టికెట్లను కూడా పెంచాలని కమిటీ సిఫారసు చేసింది. ఈమేరకు సిఫారసులను శనివారం తిరుమల అన్నమయ్య భవన్ అతిథిగృహంలో జరిగే ధర్మకర్తల మండలికి అందజేయనుంది. దీనిపై శనివారమే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఒక్క రూ.300 టికెట్ల మినహా మిగిలిన ధరలు అటుఇటుగా స్వల్ప మార్పులతో ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

సేవ - ప్రస్తుత ధర - సిఫారసు ధర
వీఐపీ దర్శనం - రూ.500 - రూ.800-1000
సుప్రభాతం - రూ. 220 - రూ.500
తోమాలసేవ - రూ.440 - రూ.2 వేలు
అర్చన - రూ.440 -రూ. 2 వేలు
సహ్రస్రకళశాభిషేకం -రూ.850 -రూ.1500
తిరుప్పావడ- - రూ.850 -రూ.1500
పూరాభిషేకం - రూ.750 -రూ.1500
(విచక్షణ కోటా కింద రూ.2250 నుంచి రూ.4వేలు)
వస్త్రాలంకారసేవ - రూ.12,500 - రూ.2500
- సహస్రదీపాలంకరణ రూ. 200 - రూ.500
- వసంతోత్సవం - రూ.300 - రూ.500
- ఆర్జిత బ్రహ్మోత్సవం రూ.200 - రూ.500
- కల్యాణోత్సవం -1000 - రూ.2వేలు

రూ.2,650 కోట్లు దాటనున్న టీటీడీ బడ్జెట్
2016-2017 టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.2,650 కోట్లు దాటనుంది. 2015-2016 వార్షిక బడ్జెట్ రూ.2,530 కోట్లతో ఆమోదించిన విషయం తెలిసిందే. తిరుమలలో శనివారం నిర్వహించిన ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ వార్షిక బడ్జెట్‌ను ప్రకటిస్తారు. అలాగే, తిరుమలలోని కొత్తగా నిర్మించ తలపెట్టిన వేయికాళ్ల మండపం, దేశ విదేశాల్లోని టీటీడీ స్థలాల పరిరక్షణ, విక్రయం కూడా నిర్ణయం తీసుకోనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement