నటుడు తనికెళ్ళ భరణిని సత్కరిస్తున్న దృశ్యం
కాకినాడ కల్చరల్: నాటక రంగానికి పంతం పద్మనాభం స్మారక పరిషత్ చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి అన్నారు. స్థానిక సూర్యకళామందిర్‌లో నాలుగు రోజులుగా పంతం పద్మనాభం స్మారక కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ రాష్ట్రస్థాయి నాటికల పోటీలకు ఆదివారం తనికెళ్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనను కళాపరిషత్ సభ్యులు ఘనంగా సత్కరించారు.
మరో విశిష్ట అతిథి, సినీ నటుడు గౌతమ్‌రాజు మాట్లాడుతూ కళలకు కాణాచి కాకినాడ అన్నారు. కాకినాడ కళాకారులతో తనకు ఉన్న అనుబంధాలను వివరించారు. ఈ కార్యక్రమానికి ముందు స్వర్గీయ పి.సీతారామ బాలాజీరావు (దొరబాబు) కళా ప్రాంగణాన్ని మార్కండేయ నాటక కళాపరిషత్ వ్యవస్థాపకులు పడాల రవి ప్రారంభించారు. తదుపరి పంతం పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి నివాళులు అర్పించారు. కళాపరిషత్ వ్యవస్థాప కార్యదర్శి బుర్రా పద్మనాభం మాట్లాడుతూ నాటక రంగానికి పూర్వవైభం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. తదుపరి కళావాణి ఉభయగోదావరి సంస్థ సమర్పణలో రేలంగి మల్లిక్ రచించిన ‘ప్రపంచం నీ గుప్పెటో’్ల నాటిక ఆర్.ఉదయ్‌భాస్కర్ దర్శకత్వంలో ప్రదర్శించారు. ఇంటికి మహాలక్ష్మిగా భావించాల్సిన ఆడపిల్లలపై చూపుతున్న వివక్షకు అద్దం పట్టేలా నాటిక సాగింది. తదుపరి మీ కోసమే సంస్థ సమర్పణలో డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘జాగా’ నాటిక ప్రదర్శించారు. వృద్ధాప్యంలో ముసలివాళ్లు అనుభవిస్తున్న నరక యాతనకు అద్దం పట్టేలా నాటిక సాగింది. గాలిబ్, రామసత్యనారాయణ, పంతం వేణు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో బాజీబోయిన వెంకటేష్ నాయుడు, తురగా సూర్యారావు, టీవీ.సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఎస్ రాజా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment